అడవుల్ని కాపాడుకోవడానికి విన్నూత్న ఆలోచన. వృక్షో రక్షతి రక్షిత:

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ త‌గ్గిపోతున్న అడ‌వుల విస్తీర్ణాన్ని మ‌నం కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది స్వ‌చ్ఛంద సేవ‌కులు, సామాజిక వేత్త‌లు, ప‌ర్యావర‌ణ ప్రేమికులు త‌మ వంతు ప్ర‌య‌త్నంగ వృక్షాల‌ను తద్వారా అడ‌వుల‌ను ర‌క్షించుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ల‌ను గురించి అంద‌రిలోనూ అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ఉన్నారు. కొంద‌రైతే త‌మ వంతు బాధ్య‌త‌గా మొక్క‌లు నాటుతూ అడ‌వుల‌ను పెంచుతూ పోతున్నారు. అయితే బీహార్‌లోని ఆ ప్రాంతానికి చెందిన మ‌హిళ‌లు మాత్రం వృక్షాల‌ను సంర‌క్షించ‌డానికి, అడ‌వుల విస్తీర్ణాన్ని కాపాడుకోవ‌డానికి ఓ వినూత్న‌మైన కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అదేమిటంటే…

shashthi-nath-jha

మ‌ధుబ‌ని ఆర్ట్ గురించి తెలుసు క‌దా..! నిజానికి ఆ ఆర్ట్ ఎక్కువ‌గా ప్రచారంలో ఉంది బీహార్‌లోని మ‌ధుబ‌ని అనే జిల్లాలో. అక్క‌డ ఉన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాలు వేటిలోనైనా మ‌హిళ‌లు ఈ ఆర్ట్‌ను ఎక్కువ‌గా వేస్తూ మ‌న‌కు క‌నిపిస్తారు. అయితే అదే ప్రాంతానికి చెందిన శాస్తి నాథ్ ఝా కు కూడా ఈ ఆర్ట్‌లో ప్ర‌వేశముంది. అంతేకాదు, ఆమె ఓ స్వ‌యం స‌హాయ‌క బృందానికి కార్య‌ద‌ర్శి కూడా. ఈ క్ర‌మంలో ఆమె త‌మ గ్రామానికి ద‌గ్గ‌ర్లో ఉన్న రాంప‌త్తి, రాజ్‌న‌గ‌ర్ అడ‌విలో ఏటా వృక్షాలు క‌నుమ‌రుగ‌వుతూ, అడ‌వి విస్తీర్ణం త‌గ్గుతుండ‌డాన్ని గ‌మ‌నించింది. అయితే వృక్షాల‌ను ఎవ‌రు న‌రుకుతున్నారో ఆమెకు తెలియ‌దు క‌దా, కానీ ఎలాగైనా వాటిని సంర‌క్షించాల‌ని అనుకుంది. వెంట‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఆ నిర్ణ‌యాన్ని అమ‌లులో పెట్టింది.

madhubani-paint

స్థానికంగా మ‌ధుబని పెయింటింగ్ వేసే మ‌హిళ‌లు ఎక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్తి నాథ్ ఏం చేసిందంటే అంద‌రు మ‌హిళ‌ల‌కు త‌గ్గిపోతున్న అడ‌వుల విస్తీర్ణం గురించి, వృక్షాల‌ను పెంచుకోవాల్సిన‌, కాపాడుకోవాల్సిన బాధ్య‌త‌ల‌ను గురించి విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించింది. దీంతో ఆ చుట్ట ప్ర‌క్క‌ల ఉన్న గ్రామాల‌కు చెందిన మ‌హిళ‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. త‌మ‌కు వ‌చ్చిన మ‌ధుబని పెయింటింగ్‌తోనే అడ‌వుల‌ను ర‌క్షించాల‌ని అనుకున్నారు. అదే దిశ‌గా స్థానికంగా ఉన్న అట‌వీ ప్రాంతంలోని వృక్షాల కాండాల‌పై మ‌ధుబని పెయింటింగ్‌ల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు. రాముడు, సీత‌, కృష్ణ‌, బుద్ధుడు, మ‌హావీరుడు ఇంకా ఇత‌ర అనేక మ‌తాల‌కు చెందిన దేవుళ్లు, దేవ‌త‌ల బొమ్మ‌ల‌ను మ‌ధుబ‌ని పెయింటింగ్‌లుగా అక్క‌డి చెట్ల కాండాల‌పై వేయ‌డం స్టార్ట్ చేశారు. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ చెట్ల న‌రికివేత ఆగిపోయింది. అలా మ‌హిళ‌లు క‌నిపించిన ప్ర‌తి చెట్టు కాండంపై ఆయా మ‌త విశ్వాసాల‌కు చెందిన బొమ్మ‌ల‌ను వేయ‌డం వ‌ల్ల స‌హ‌జంగానే చెట్ల‌ను న‌రికే వారు భ‌యం చెందారు. ఈ క్రమంలో ఎన్నో వేల చెట్ల కాండాల‌పై వారు పెయింటింగ్‌లు వేయ‌డం వ‌ల్ల వాటిని ఆ మ‌హిళ‌లు కాపాడుకోగ‌లిగారు. అలా ఓ పెద్ద అడ‌విని నాశ‌నం కాకుండా చూశారు. ఈ క్ర‌మంలో రాంప‌త్తి, రాజ్‌న‌గ‌ర్ అట‌వీ ప్రాంతం ఇప్పుడు టూరిస్టుల‌కు కూడా మంచి స్పాట్‌గా మారింది. అనేక మంది ప‌ర్యాట‌కులు ఎప్పుడూ అక్క‌డికి వ‌చ్చి వెళ్తున్నారు. చెట్ల కాండాల‌పై ఉన్న బొమ్మ‌ల‌ను చూసి, ప‌చ్చ‌న ప్ర‌కృతిని ఆస్వాదించి మ‌రీ వెళ్తున్నారు. ఇదంతా శాస్తి నాథ్ చ‌ల‌వే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..? ఇలా వేలాది వృక్షాల‌ను, త‌ద్వారా అడ‌విని కాపాడిన ఆమెకు మ‌నం అభినంద‌న‌లు తెల‌పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top