ఎంతో మంది అనాథ బాలిక‌ల‌ను ప్ర‌యోజ‌కులుగా తీర్చి దిద్దిన గొప్ప వ్య‌క్తి ఆమె..!

న‌వ‌మాసాలు మోసి, క‌ని, పెంచిన బిడ్డ‌ను దుర‌దృష్ట‌వ‌శాత్తూ కోల్పోవాల్సి వ‌స్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బిడ్డ‌ను క‌న్న త‌ల్లికే తెలుస్తుంది. సాధార‌ణంగా  ఏ త‌ల్లి అయినా అలాంటి స్థితిలో ఉంటే ఇక మామూలు మ‌నుషులు అవ‌డం చాలా క‌ష్టం. వారిని ఓదార్చ‌డ‌మూ క‌ష్ట‌మే. అయితే ఆ త‌ల్లి మాత్రం అలా కాదు. త‌న బిడ్డ దూర‌మైనా ఆ బాధ‌ను దిగ‌మింగింది. ఆమె జ్ఞాప‌కాలు ఎప్ప‌టికీ చెరిగిపోకూడ‌ద‌నే ఉద్దేశంతో, త‌ల్లిదండ్రులు లేని అనాథ బాలిక‌ల‌ను చేర‌దీసి వారిలో త‌న బిడ్డ‌ను చూసుకుంటోంది. వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డేలా ప్ర‌యోజ‌కుల‌ను చేస్తోంది ఆమె. ఆమే… డాక్ట‌ర్ స‌రోజిని దేవి.

sarojini-devi
డాక్ట‌ర్ స‌రోజిని దేవి కూతురు మనీషా 30 ఏళ్ల కింద‌ట రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందింది. అయితే అలాంటి స్థితిలో డాక్ట‌ర్ స‌రోజిని దేవికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎన్నో రోజులు మౌనంగా గ‌డిపింది. ఓ వైపు కూతురు చ‌నిపోయింద‌ని గుండెల నిండా బాధ ఉన్నా దాన్నంతా దిగ‌మింగింది. అయితే అప్పుడే ఆమె ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. అదేమిటంటే… త‌ల్లిదండ్రులు లేక అనాథ‌లుగా మారిన బాలిక‌లను చేర‌దీసి వారిని ప్ర‌యోజ‌కుల‌ను చేయాల‌ని అనుకుంది. దీంతో వెంట‌నే త‌న నిర్ణ‌యాన్ని అమ‌లులో పెట్టేసింది. అనుకున్న‌దే త‌డ‌వుగా తాను ఉంటున్న 3 గ‌దుల ఇంట్లోనే మ‌నీషా మందిర్ పేరిట ఓ ఆశ్ర‌మాన్ని నెల‌కొల్పింది. అందులో అనాథ బాలిక‌ల‌కు ఆశ్రయం ఇస్తూ వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తోంది. అంతేకాదు, నైపుణ్యం ఉన్న‌వారి కోసం కంప్యూట‌ర్ కోర్సులు, కుట్లు, అల్లిక‌లు, చేతి వృత్తులు వంటి ప‌నుల‌ను కూడా నేర్పిస్తోంది. దీంతో అటు విద్యా ప‌రంగానే కాదు, ఆమె వ‌ద్ద పెరిగిన చాలా మంది మంచి మంచి ఉన్న‌త ఉద్యోగాలు రాణిస్తున్నారు. చాలా మంది స్వ‌యం ఉపాధి పొందుతూ త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ్డారు కూడా. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం మ‌నీషా మందిర్‌లో మొత్తం 800 మంది దాకా ఆశ్ర‌యం పొందుతున్నారు.

అయితే మొద‌ట్లో ఆశ్ర‌మం నిర్వ‌హించ‌డం డాక్ట‌ర్ స‌రోజినికి చాలా క‌ష్టంగా ఉండేది. పెరుగుతున్న బాలిక‌ల‌కు అనుగుణంగా విశాల‌మైన గ‌దులు, సౌక‌ర్యాల కోసం ఆమె ఏడాదిలోనే 3, 4 సార్లు తాము ఉంటున్న భ‌వ‌నాల‌ను మార్చింది. అయితే ఇప్పుడు అలా కాదు, తాము ఉంటున్న ల‌క్నోకు స‌మీపంలోని గోంతి న‌గ‌ర్ అనే ప్రాంతంలో 3 అంత‌స్తుల విశాల‌మైన శాశ్వ‌త భ‌వ‌నంలోకి ఆశ్ర‌మాన్ని మార్చింది. దీంతో అక్క‌డ ఉంటున్న బాలిక‌ల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంది. అయితే ఆ ఆశ్ర‌మంలో చ‌దువుకుని పైకి వ‌చ్చి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న యువ‌తులు కూడా త‌మ వంతు స‌హాయం ఆ ఆశ్ర‌మానికి చేస్తూనే ఉంటారు. దీంతో అక్క‌డ ఏటా ఆశ్ర‌యం పొందుతున్న బాలిక‌ల సంఖ్య పెరుగుతుంది. అయితే ఇంత చేసినా స‌రోజిని ఏమంటున్నారంటే… త‌న ఒక్క మ‌నీషాను దేవుడు తీసుకుపోయి త‌న‌కు 800 మంది మ‌నీషాల‌ను ఇచ్చాడ‌ని అంటోంది. ఇక అక్క‌డి బాలిక‌లు స‌రోజినిని ఏమ‌ని పిలుస్తున్నారో తెలుసా..? మ‌ద‌ర్ థెరిస్సా అని… అవును మ‌రి, అనాథ బాలిక‌ల పాలిట ఆమె నిజంగా మ‌ద‌ర్ థెరిస్సాయే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top