ఆ మ‌హిళ ఒక‌ప్పుడు చిత్తు కాగితాలు ఏరుకునేది… ఇప్పుడు రూ.1 కోటి ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీకి య‌జ‌మానురాలైంది…

కృషి, ప‌ట్టుద‌ల ఉంటే సాధించ‌లేనిది అంటూ ఏదీ లేద‌ని గ‌తంలో మ‌నం అనేక మంది విష‌యంలో చూశాం. ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ మ‌హిళ గురించే. ఆమె ఒక‌ప్పుడు రోజుకు క‌నీసం రూ.5 కూడా సంపాదించ‌లేని ప‌రిస్థితిలో ఉండేది. అయితే ఇప్పుడు ఏకంగా కోటి రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీకి య‌జ‌మానురాలిగా మారింది. అందుకోసం ఆమె ఎంత‌గానో శ్రమించింది. అంతే కాదు ఒక‌ప్పుడు త‌న‌లా బ‌తికిన మ‌హిళ‌ల‌కు నేనున్నానంటూ భ‌రోసా క‌ల్పిస్తూ వారి ఉపాధికి బాట‌లు వేస్తోంది. ఆమే మంజుల వాఘెలా.

manjula

అహ్మ‌దాబాద్‌కు చెందిన మంజుల వాఘెలా 1981 ముందు అంటే దాదాపు 35 సంవ‌త్స‌రాలకు పూర్వం ర‌హ‌దారుల వెంట చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవ‌నం సాగించేది. నిత్యం ఓ పెద్ద గోనె సంచిని వెనుక పెట్టుకుని రోజంతా క‌ష్ట‌ప‌డి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌, ఇనుప వ‌స్తువుల‌ను సేక‌రించేది. కాగా అలా సేక‌రించిన వాటిని సాయంత్రం పూట వేస్ట్ పేప‌ర్ మార్ట్ వ‌ర్త‌కుల‌కు అమ్మేది. అలా అమ్మ‌గా అప్ప‌ట్లో ఆమెకు రోజుకు రూ.5 వ‌చ్చేవి. దాంతోనే ఆమె నిత్యం త‌న కుటుంబాన్ని పోషించేది. కాగా 1981లో ఎలాబెన్ భ‌ట్ అనే మ‌హిళ త‌న సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ వుమెన్స్ అసోసియేష‌న్ (సేవా) పేరిట మంజుల‌కు స‌హాయం చేసింది. దీంతో మంజుల సొంతంగా ఓ చిన్న‌పాటి స‌ర్వీస్ కంపెనీని ఏర్పాటు చేసుకోగ‌లిగింది.

మంజుల ఏర్పాటు చేసుకున్న ఆ కంపెనీ పేరు శ్రీ సౌంద‌ర్య స‌ఫాయి ఉత్క‌ర్ష్ మ‌హిళా సేవా స‌హ్‌కారి మండ‌లి లిమిటెడ్ (SSSUMSSML). ఆ కంపెనీతో ఆఫీసులు, కార్యాల‌యాలు, ఇత‌ర సంస్థ‌ల‌కు క్లీనింగ్ సేవ‌ల‌ను అందించ‌డం మొద‌లు పెట్టింది. కాగా ఆమె కంపెనీ రిజిస్ట‌ర్ అయ్యే స‌రికి దాదాపు 5 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. ఎందుకంటే త‌మ‌ది సేవా రంగానికి చెందిన సంస్థ అని, ఉత్పత్తులు అమ్మే సంస్థ కాద‌ని అధికారుల‌ను ఒప్పించడానికి అన్ని రోజులు ప‌ట్టింది మ‌రి. అయితేనేం నెమ్మ‌దిగా ఆ కంపెనీ వృద్ధిలోకి వ‌చ్చింది. కాగా అందులో ప‌నిచేసే వారు కూడా ఒకప్పుడు మంజుల లాగే చిత్తుకాగితాలు ఏరుకునే వారు కావ‌డం గ‌మ‌నార్హం. అలాంటి మ‌హిళ‌ల‌ను మంజుల చేర‌దీసి వారికి శిక్ష‌ణనిప్పించి అనంత‌రం త‌న కంపెనీలోనే ప‌ని ఇచ్చేది. దీంతో ఆ మ‌హిళ‌లు సొంతంగా త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం మంజుల సంస్థ‌లో 400 కు పైగా మ‌హిళ‌లు ప‌నిచేస్తున్నారు. ఇప్పుడామె ఆదాయం రూ.1 కోటికి పైనే. త‌న జీవితాన్ని తాను నిల‌బెట్టుకోవ‌డ‌మే కాదు, త‌న లాంటి వారికి కూడా ఉపాధి చూపుతున్న మంజుల‌ను నిజంగా మ‌నం అభినందించాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top