ఆమె అనుకుంది ఒక‌టి… అయింది మ‌రొక‌టి… అయినా అందులోనూ త‌నదైన ప్ర‌తిభ‌ను చాటి శ‌భాష్ అనిపించుకుంది..!

జీవితంలో అనుకున్న‌వి సాధించాల‌ని అనేక మంది క‌ల‌లు కంటుంటారు. ఆ దిశ‌గా ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అందుకు త‌గిన శ్ర‌మ‌, క‌ష్టం ప‌డుతుంటారు కూడా. అయితే అలా శ్ర‌మించే వారిలో కేవ‌లం కొంద‌రే తాము అనుకున్న క‌ల‌ల‌ను నిజం చేసుకుంటారు. ఇంకొంద‌రు వాటికి దూర‌మ‌వుతారు. అలా అనుకున్న క‌ల‌ను సాధించ‌క‌పోయినా కొద్ది మంది నిరాశ చెంద‌రు. త‌మ‌కు ల‌భించిన దాంట్లోనే ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఆశ్చ‌ర్యంగా వారు అది సాధిస్తారు కూడా. అలాంటి వారిలో థానేకు చెందిన ఆ మ‌హిళ కూడా ఒక‌రు. ఆమే కింజ‌ల్ ద‌ర్శ‌న్ చంద్ర‌.

Kinjal-Darshan-Chandra

మ‌హారాష్ట్ర‌లోని ముంబైకి చెందిన కింజ‌ల్ ద‌ర్శ‌న్ చంద్ర చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువుల్లో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తూ ఉండేది. ఈ క్ర‌మంలో 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి బోర్డ్ ప‌రీక్ష‌ల్లో ఫ‌స్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణురాలైంది కూడా. కాగా ఆమెకు ఎలాగైనా డెంటిస్ట్రీ (దంత వైద్యం) కోర్సు చ‌ద‌వాల‌ని ఉండేది. అయితే ఆమెది 12వ త‌ర‌గ‌తి పూర్త‌య్యే స‌రికి ఇంట్లో ఆర్థిక ప‌రిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయి. పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. అదే స‌మ‌యంలో త‌న‌తో ఎంతో అనుబంధం పెన వేసుకున్న ఆమె తాత కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కింజ‌ల్ ఒక్క‌సారిగా డిప్రెష‌న్‌కు లోనైంది. త‌న చ‌దువు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. బంధువులైతే ఆమెను చ‌దువు మానేయ‌మ‌ని, ఇంట్లో ఉండి ప‌నిచేసుకోమ‌ని స‌ల‌హాలు కూడా ఇచ్చారు. అయినా కింజ‌ల్ వాటిని లెక్క చేయ‌లేదు. ప‌ట్టుద‌లగా క‌ష్ట‌ప‌డి చ‌దివింది. ఎలాగోలా గ్రాడ్యుయేష‌న్ విద్య‌ను అభ్య‌సించింది. అయితే డిగ్రీ పూర్త‌య్యే నాటికి త‌న ప్రాణ స్నేహితురాలిని ఆమె యాక్సిడెంట్‌లో కోల్పోయింది. దీంతో కింజ‌ల్ మ‌రింత డిప్రెష‌న్‌కు లోనైంది. అయినా ఆకుపేష‌న‌ల్ థెర‌పీతో త‌న ఒత్తిడిని, మాన‌సిక వేద‌న‌ను త‌గ్గించుకుంది. కాగా కింజ‌ల్ ఆకుపేష‌న‌ల్ థెర‌పీ తీసుకుంటున్న‌ప్పుడు పీడియాట్రిష‌య‌న్‌ ద‌గ్గ‌ర‌కు వెళ్లే క్ర‌మంలో అక్క‌డ ప‌లువురు చిన్నారుల‌తో బాగా క‌లిసిపోయేది. ఆ పిల్ల‌లు ఎలాంటి వారంటే మాన‌సిక స్థితి స‌రిగ్గా లేక, చ‌దువుల్లో వెనుకబ‌డి పోయిన వారు. అలాంటి వారితో నిత్యం గ‌డిపినందువ‌ల్లో ఏమో ఆమె కెరీర్ డెంటిస్ట్రీ వైపు కాక పీడియాట్రిష‌న్ వైపు మ‌ళ్లింది. చివ‌ర‌కు ఆ కోర్సునే పూర్తి చేసేలా చేసింది. ఇంత‌లో ఆమెకు పెళ్లి చేశారు.

వివాహం అయిన త‌రువాత కొద్ది నెల‌ల‌కు కింజ‌ల్ సొంతంగా క్లినిక్‌ను ప్రారంభించింది. అయితే క్లినిక్ వ‌ల్ల త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే ప్ర‌త్యేక అవ‌స‌రాలు గ‌ల పిల్ల‌ల‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌గా రోజూ ప‌రిశీలిస్తుండ‌డంతో వారిని చూసి ఆమె హృద‌యం చ‌లించిపోయేది. చిన్నారులుగా ఉన్న‌ప్పుడు త‌ల్లిదండ్రులు అవ‌గాహ‌న లేక, స‌రిగ్గా గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్ల పిల్ల‌లు అలా అన్నింటిలో వెనుక బ‌డ‌తార‌ని, మాన‌సికంగా ఎద‌గ‌ర‌ని ఆమె తెలుసుకుంది. ఈ క్ర‌మంలో ప‌సిపిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం మొద‌లు పెట్టింది. అలా ఆమె స్కూళ్ల‌కు, ప‌లు కాల‌నీలకు, బ‌స్తీల‌కు వెళ్లి స్వ‌యంగా ఉప‌న్యాసాలు ఇస్తూ, అవ‌గాహన క‌ల్పిస్తూ కార్య‌క్ర్ర‌మాలు చేయ‌డం మొద‌లు పెట్టింది. దీన్ని చూసి అంద‌రూ మొద‌ట్లో ప‌రిహ‌సించారు. సుబ్బ‌రంగా డ‌బ్బులు సంపాదించుకోక ఎందుకు వ‌చ్చిన ఈ తిప్ప‌లు అని ఆమెను గేలి చేశారు. అయినా కింజ‌ల్ ఆ కామెంట్ల గురించి ప‌ట్టించుకోలేదు. తాను అనుకున్న తోవలోనే ముందుకు సాగింది. ఆ తోవే నేడు ఆమెకు ‘100 WOMEN ACHIEVERS OF INDIA’ లో చోటు క‌ల్పించింది. రాష్ట్ర‌పతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ చేతుల మీదుగా అవార్డును అందుకునేలా చేసింది. తాను అనుకున్న ల‌క్ష్యం ఒక‌టైనా, త‌న‌కు ల‌భించిన దాంట్లోనే కింజ‌ల్ ద‌ర్శ‌న్ చంద్ర మున్ముందుకు సాగుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె కృషికి, ప‌ట్టుద‌ల‌కు మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top