చీకట్లో మగ్గుతున్న ఊరికి కరెంట్ తెప్పించింది,మాఫియాకు చుక్కలు చూపించింది.

స‌మాజంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయి. వాట‌న్నింటినీ చూసి ఎవ‌రికి వారు నాకెందుకులే అని వెళ్లిపోతున్నారు త‌ప్ప‌, వాటి పోరాటం దిశ‌గా ఎవ‌రూ ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. ఫ‌లితంగా అవే స‌మస్య‌లు మ‌రింత తీవ్ర‌త‌ర‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో సామాన్య జ‌నాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. అది ఏ అంశ‌మైనా కావ‌చ్చు, స‌మ‌స్య‌పై పోరాటం చేసిన‌ప్పుడే దాని ప‌రిష్కారం సాధ్య‌మ‌వుతుంది. అదిగో, ఆ మ‌హిళ కూడా స‌రిగ్గా ఇలాగే చేసింది. ఊరికి దూరంగా విసిరేసిన‌ట్టు ఉండే చిన్న‌పాటి మారుమూల కొండ ప్రాంత గ్రామంలో క‌రెంటు వ‌చ్చేలా చేసింది. టింబ‌ర్ మాఫియా ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేసింది. అనేక చెట్లు నేల‌కొర‌గ‌కుండా కాపాడింది. మ‌హిళ‌ల సాధికార‌త కోసం కృషి చేస్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గెలిచి త‌మ గ్రామాన్ని అభివృద్ధి దిశ‌గా తీసుకెళ్తోంది. ఇవ‌న్నీ చేసింది ఆ ఒక్క మ‌హిళే. ఆమే, కళావ‌తి దేవి రావ‌త్‌.

bacher-village

అది 1980వ సంవ‌త్స‌రం. ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలి జిల్లా బ‌చెర్ ప్రాంతం. ఇత‌ర రాష్ట్రానికి స‌రిహద్దు ప్ర‌దేశం. కొండ ప్రాంతం. మారుమూల ప‌ల్లె. జిల్లా ప్ర‌ధాన కార్యాల‌యానికి 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నా దానికి చాలా దూరంగా విసిరేసిన‌ట్టు ఉంటుంది ఆ గ్రామం. అలాంటి గ్రామంలో ఉన్న త‌న మెట్టినింటికి వ‌చ్చింది క‌ళావ‌తి రావత్‌. అప్ప‌టికి ఆ గ్రామానికి క‌రెంటు అంటే ఏమిటో తెలియ‌దు. చీక‌టి ప‌డిందంటే చాలు, దట్ట‌మైన నిశీధి ఆ ప్రాంతంలో అలుముకుంటుంది. దీంతో సాయంత్రమైందంటే చాలు బ‌చెర్ గ్రామ‌స్తులు ప‌నుల‌న్నీ మానేసి ఇండ్ల‌కు చేరుకుంటారు. ఇక మ‌ళ్లీ వారు బ‌య‌టికి వ‌చ్చేది మ‌రుస‌టి రోజు సూర్యుడు ఉద‌యించాకే. అంత‌టి చిమ్మ చీక‌టి ఉంటుంది ఆ గ్రామంలో. దీన్ని గ‌మనించిన క‌ళావ‌తి ఆ చీక‌టిని పారదోలాల‌ని నిశ్చ‌యించుకుని కొంత మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి జిల్లా ప్ర‌ధాన కార్యాల‌యంకు వెళ్లి అక్క‌డి విద్యుత్ ఉద్యోగుల‌కు త‌మ గ్రామ క‌ష్టాల‌ను మొర పెట్టుకుంది. ఎలాగైనా క‌రెంట్ వ‌చ్చేలా చేయాల‌ని ప్రాధేయ‌ప‌డింది. అయినప్ప‌టికీ ప్ర‌భుత్వ అధికారుల మ‌న‌సు క‌ర‌గ‌లేదు. స‌సేమిరా అన్నారు. దీంతో చేసేది లేక క‌ళావ‌తి వెనుదిరిగింది. అయితే దారిలో వృథాగా ప‌డి ఉన్న క‌రెంటు పోల్స్‌, తీగ‌ల‌ను గ‌మ‌నించింది. దీంతో వెంట‌నే ఓ ఆలోచ‌న చేసింది. తోడుగా ఆ గ్రామానికి చెందిన మ‌హిళ‌లు కూడా ఉండ‌డంతో వారంద‌రినీ ఒప్పించి ఆ క‌రెంట్ పోల్స్‌, తీగ‌ల‌ను గ్రామానికి చేరవేసి వాటిని వీధికొక‌టి చొప్పున‌, ఇత‌ర మ‌హిళ‌ల‌తో క‌ల‌సి సొంతంగా ఏర్పాటు చేసింది. ఇది తెలిసిన అధికారులు వ‌చ్చి కళావ‌తిపై కేస్ పెడ‌తామ‌ని, అరెస్ట్ చేయిస్తామ‌ని బెదిరించారు. అయినా ఆమె భ‌య‌ప‌డ‌లేదు. గ్రామ మ‌హిళ‌లు ఆమెకు తోడుగా నిలిచారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. అనంత‌రం కొద్ది రోజుల‌కే స‌ద‌రు క‌రెంట్ పోల్స్‌కు విద్యుత్ క‌నెక్ష‌న్ ఇచ్చారు. అప్పుడే ఆ గ్రామంలో క‌రెంట్ వ‌చ్చింది. అంద‌రి ఇండ్ల‌లో వెలుగులు వ‌చ్చాయి.

kalawathi-rawat

అయితే క‌ళావ‌తి అంత‌టితో ఆగ‌లేదు. త‌మ గ్రామానికి ఆనుకుని ఉన్న అడ‌విలో టింబ‌ర్ మాఫియా చెట్ల‌ను న‌రుకుతుంటే తోటి మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆ చెట్ల‌ను న‌ర‌క‌కుండా అడ్డుకుంది. వాటిని హ‌త్తుకుని ప్ర‌తి మ‌హిళా నిర‌స‌న తెలిపేలా చేసింది. దీంతో టింబ‌ర్ మాఫియా వెనుదిరిగింది. అలా కొన్ని వంద‌ల వృక్షాల‌ను క‌ళావ‌తి కాపాడింది. అనంత‌రం త‌మ గ్రామంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉన్న మ‌ద్య‌పానాన్ని అరిక‌ట్టేందుకు గాను సారాను త‌యారు చేస్తున్న ప్రాంతాల‌కు తోటి మ‌హిళ‌ల‌తో క‌లిసి వెళ్లి ఆ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది. అయితే ఆమెకు కొన్ని వ‌ర్గాల నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. అయినా ఆమె భ‌య‌ప‌డ‌లేదు. పైపెచ్చు స్థానికంగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. దీంతో ఆ ఎన్నిక‌ల్లో గెలిచింది. అప్ప‌టి నుంచి ఇక ఆమెను ఏం చేద్దామ‌న్నా అలాంటి అల్ల‌రి మూక‌ల‌కు ధైర్యం చాల‌డం లేదు. ఈ క్ర‌మంలో స్థానికంగా ఉన్న పురుషుల్లో కూడా మార్పు వ‌చ్చింది. వారు మ‌హిళ‌ల‌ను అన్ని ప‌నుల్లోనూ భాగ‌స్వాములు చేయడం ప్రారంభించారు. దీంతోపాటు క‌ళావ‌తి మ‌హిళలు సొంతంగా ఎదిగేలా వారికి త‌గిన ఉపాధి కార్య‌క్ర‌మాల‌ను క‌ల్పించ‌డం కోసం కృషి చేసింది. అడ‌విలో చెట్ల‌కు పండే పండ్లు, మొక్క‌ల నుంచి వ‌చ్చే సుగంధ ద్ర‌వ్యాల‌ను సేక‌రించి మార్కెట్‌లో అమ్ముతూ లాభం పొందేలా మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇప్పించింది. దీంతో ఆ గ్రామం ఇప్పుడు ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో క‌ళావ‌తి రావ‌త్‌కు 1986లో ఇందిరా ప్రియ‌ద‌ర్శిని అవార్డు కూడా వ‌చ్చింది. దాంతో పాటు ఇన్ని సంవ‌త్స‌రాల్లో ఆమెకు అనేక అవార్డులు, రివార్డులు కూడా వ‌చ్చాయి. అయిన‌ప్పటికీ ఆమెకు ఒకింత గ‌ర్వం కూడా లేదు. చూస్తే ఓ సాధార‌ణ మ‌హిళ‌లాగే క‌నిపిస్తుంది. ఇంత‌కీ క‌ళావ‌తి రావ‌త్ ఎంత వ‌ర‌కు చ‌దువుకుందో తెలుసా..? ఆమెకు అస్స‌లు చ‌దువే రాదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. చ‌దువు రాన‌ప్ప‌టికీ ఓ గ్రామాభివృద్ధికి బాట‌లు వేసిన ఆ మ‌హిళ‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top