ఆ మహిళ అనుభవిస్తోంది కటిక పేదరికం. మరో వైపు భర్త లేడు. పిల్లలున్నా వారు ఇంకా చిన్న వారే. ఏ పని చేద్దామన్నా సహకరించని శరీరం. కనీసం తాగడానికి నీళ్లు కూడా తెచ్చుకోలేని శారీరక అనారోగ్యం. ఆదుకునే వారు, నా అన్నవారు ఆమెకు లేరు. నగర, పట్టణ జీవితాలకు దూరంగా విసిరేసినట్టు ఉండే గ్రామం కావడంతో అక్కడికి నాయకులు కాదు కదా, కనీసం ప్రభుత్వ అధికారులు కూడా రావడం లేదు. అటు వైపు చూడడం లేదు. ఇంకేముంది. అన్నీ కలిపి ఆమెను మరింత దీన స్థితిలోకి చేర్చాయి. ఒక్క పూట కూడా గడవని కడు దయనీయ స్థితికి ఆమె చేరుకుంది. ఈ క్రమంలో ఆహారం కూడా దొరకడం లేదు. ఓ వైపు కడుపును కాల్చేస్తున్న ఆకలి బాధ. అది తీరేదెలా? అవును, తీరుతుంది. తీరింది. ఎలా..? ఎలా..? మట్టితో… అవును, మట్టితోనే. మట్టినే తినాలి. తింటుంది కూడా. ఎందుకంటే అక్కడ ఏమీ లేవు కదా.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న లలిత్పుర్ జిల్లాలో రాజ్వారా అనే గ్రామంలో షకున్ రైక్వార్ అనే మహిళ జీవిస్తోంది. ఆమెది స్థానికంగా ఉన్న సహారియా అనే గిరిజన తెగకు చెందిన కుటుంబం. ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు ఉన్నారు. 5 ఏళ్ల కిందట ఆమె భర్త చనిపోయాడు. అయితే అంతకు ముందు నుంచే ఆ ప్రాంతంలో తీవ్రమైన కరవు నెలకొని ఉంది. ఆ కరవు తీవ్రత ఎలా ఉందంటే దాని దెబ్బకు లలిత్పుర్ జిల్లాలోని అనేక గ్రామాల్లో ఉన్న ప్రజలు విలవిలలాడిపోయారు. తినడానికి తిండి దొరకని దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనేక మంది తమ తమ గ్రామాలను వదిలేసి నగరాలకు, పట్టణాలకు వలస వెళ్లిపోయారు. కానీ ఇంకా అక్కడ కొన్ని కుటుంబాలు ఇప్పటికీ అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. అలాంటి కుటుంబాల్లో షకున్ కుటుంబం కూడా ఒకటి.
తిండి దొరకడం అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో ఆమె తన ఇంటి పరిసరాల్లో ఉన్న మట్టినే తిని జీవించడం మొదలు పెట్టింది. భర్త తీసుకువస్తే ఆ పూటకు ఏదైనా తిన్నా మళ్లీ ఆకలి బాధకు మట్టి తినేది. ఎందుకంటే అసలు ఆ గ్రామంలో ఎలాంటి ఆహారం దొరకడం లేదు కాబట్టి. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ భర్త చనిపోగా షకున్కు కష్టాలు ఇంకా తీవ్రమయ్యాయి. ఇక ఆమె అప్పటి నుంచి అసలు ఆహారం అన్నదే చూడలేదు. నిత్యం మట్టినే ఆహారంగా స్వీకరించేది. అలా ఆమె గత 12 ఏళ్లుగా మట్టిని తింటూ జీవిస్తోంది. దీంతో అనారోగ్యాలు ఆమెను చుట్టు ముట్టాయి. ఓ దశలో కాలు కదపని స్థితికి చేరుకుంది. నీరు తెచ్చుకునేందుకు కూడా లేవలేని స్థితికి ఆమె చేరుకుంది. దీంతో ఆమె తినే మట్టి ఆమె కడుపును రాయిగా మార్చేసింది. అవును, ఇది నిజమే. ఆమె కడుపు ఇప్పుడు రాయంత దృఢంగా మారింది. ఈ క్రమంలో ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలు ఏదైనా పెడితే ఆమె ఆ ఆహారాన్నిఅరిగించుకోలేకపోతోంది. ఫలితంగా కడుపునొప్పి కూడా వస్తోంది.
ఇది కేవలం షకున్ పరిస్థితే కాదు. ఆ గ్రామంలో ఇంకా మిగిలి ఉన్న వారిది కూడా దాదాపు ఇదే పరిస్థితి అని చెప్పవచ్చు. అక్కడ తిండి అనేది ఇప్పుడొక విలాస వస్తువుగా మారింది. కాగా షకున్ కుటుంబానికి ఇప్పటి వరకు కనీసం రేషన్ కార్డు కూడా లేకపోవడం గమనార్హం. అలా ఉంది అక్కడి నాయకులు, అధికారుల పని తీరు. ప్రజలు ఎలా మాడిపోతే వారికేమిటి? వారు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతూ, బంగ్లాల్లో ఉంటూ హాయిగా కాలం వెలిబుచ్చుతున్నారు కదా. ఈ విషయం తెలుసుకుని ఇప్పటికైనా వారు అక్కడి ప్రజలకు ఏవైనా పథకాలు ప్రవేశ పెట్టి వారి జీవితాల్లో మార్పును తీసుకురావాలని ఆశిద్దాం.