‘దేవుడు నా నుదుటిపై రాసిన రాత అక్కర్లేదు, దాన్ని నేను ఎలాగైనా తిరగ రాయాలి, అందుకు ఎంత కష్టమైనా సరే భరించాలి, ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాడాలి, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి…’ అనుకుందో ఏమో..! ఆ మహిళ నిజంగానే తన తలరాతను తానే మార్చుకుంది. ఎంతో శ్రమకోర్చి తన జీవిత గమనాన్ని మార్చుకోవడమే కాదు, తన జీవితానికీ ఓ అర్థం ఉందని, అందరిలా తానూ ఓ సాటి మనిషినేనని, ఇంకా చెబితే అంతకన్నా ఎక్కువేనని చాటి చెప్పింది. ఆమే గీతా ఎస్ రావు.
గీతా ఎస్ రావుది గుజరాత్‌లోని అహ్మదాబాద్. గీతకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు జ్వరం బాగా వచ్చింది. దీంతో ఆమెను తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అయితే డాక్టర్ చికిత్స చేసినా ఆమె తరువాత రోజు లేవలేకపోయింది. ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించలేదు. ఈ క్రమంలో తెలిసిందేమిటంటే ఆమెకు పోలియో ఇన్ఫెక్షన్ వచ్చిందని… వైద్యులు చెప్పారు. దీంతో ఆమె చదువు నెమ్మదిగా ప్రారంభమైంది. దీనికి తోడు శరీర ఎదుగుదల కూడా నెమ్మదిగా జరిగింది. గీతను తల్లిదండ్రులు స్కూల్లో చేర్పించినా పోలియో కారణంగా ఆమె నడవలేకపోవడంతో ఇద్దర్లో ఎవరో ఒకరు నిత్యం ఆమె వెంట ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో గీత 8వ తరగతి చదువుతున్నప్పుడు ఒక రోజు తనను తల్లిదండ్రులు స్కూల్‌కు తీసుకెళ్తుండగా తోటి వారు ఆమెను గురించి కామెంట్ చేశారు. దీంతో ఆ మాటలను విన్న గీత హృదయం చలించిపోయింది. వెంటనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే వెంటనే తేరుకుని ఎవరో ఏదో అన్నారని, తానెందుకు చావడం, తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని, ఎవరి సహాయం లేకుండానే తనంతట తానుగా ఎదగ గలనని, దేవుడు తన నుదుటిపై రాసిన రాతను తానే మార్చుకుంటానని నిశ్చయించుకుని ఆ దిశగా ముందుకు కదిలింది. కొద్ది రోజుల్లోనే ఎవరి సహాయం లేకుండా క్రచెస్ సహాయంతో నడవడం మొదలు పెట్టింది. అనంతరం కాళ్లకు పట్టీల వంటివి బిగించుకుని వాటితో అందరిలాగే నడవడం ప్రారంభించింది. అయితే గీత అంతటి సమస్యతో సతమతమవుతున్నా చదువుల్లో మాత్రం బాగా రాణించేది. ఈ క్రమంలోనే విజయవంతంగా బీఎస్సీ కెమిస్ట్రీ విద్యను, పీజీడీఎం కోర్సును పూర్తి చేసింది. అనంతరం ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది.
అయితే కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా ఆమెకు ఎందుకో తృప్తి అనిపించలేదు. ప్రపంచాన్నంతా చుట్టి రావాలనుకుంది. దాంతో జాబ్ మానేసింది. ఆ సమయంలో సోదరుడితో కలిసి హోటల్ బిజినెస్‌ను ప్రారంభించింది. ఆ బిజినెస్‌తో మరోసారి విజయం రుచిని ఆమె చవిచూసింది. అనంతరం తమ హోటల్‌కు గాను మరో 7 బ్రాంచ్‌లను వివిధ ప్రాంతాల్లో ప్రారంభించి వాటి ద్వారా కూడా విజయాన్ని అందుకుంది. అయితే తన కాళ్లు అంత బలంగా లేకున్నా నిత్యం సైకిల్ తొక్కడం ప్రారంభించింది. మొదట్లో కొంచెం కష్టపడినా అలా అలా నెమ్మదిగా సైకిల్ తొక్కుతూ రోజూ కొన్ని కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కడం నేర్చుకుంది. సాధన చేసింది. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో ఉన్న పోలో ఫారెస్ట్‌లో నిర్వహించిన 115 కిలోమీటర్ల రైడ్‌లో ఆమె పాల్గొని ప్రత్యేక బహుమతిని గెలుచుకుంది. ఆ రైడ్ సాధారణ సైక్లర్లకే కొద్దిగా కష్టతరం. అటువంటిది గీత ఎంతో పట్టుదలతో ఆ రైడ్‌ను పూర్తి చేసినందుకు అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం అభినందించారు. ప్రస్తుతం గీత రెండు రోజులకు ఒకసారి 50 నుంచి 70 కిలోమీటర్ల వరకు సైకిల్ రైడ్‌కు వెళ్తుంటుంది. అది ఆమెకు ఇప్పుడు నిత్య కృత్యంలా మారింది. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమే ఇప్పుడు తనను తాను చూసుకుని ఎంతో సంతృప్తి చెందుతోంది. ‘మనసుంటే మార్గముంటుంది, మన తలరాతను మనమే మార్చుకోవాలి, ఎలాంటి కష్టాలు వచ్చినా తలచుకుంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చ’ని గీత నిరూపించింది. ‘హ్యాట్సాఫ్’ టు గీతా ఎస్ రావు!