దాహంతో అల్లాడుతున్న వారికి వాట‌ర్ బాటిల్స్‌ను ఉచితంగా ఇస్తూ దాహం తీరుస్తున్న గుర్గావ్ మ‌హిళ….

వేస‌విలో మిట్ట మ‌ధ్యాహ్నం ఎండ అదిరిపోతున్న వేళ దాహంతో ఉన్న వారికి త‌గిన స‌మ‌యంలో నీరు దొర‌క‌క‌పోతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌న‌కైతే ఇంట్లోనో, ఆఫీసులోనో, బ‌య‌ట ఉంటే ఏదైనా షాపులో వాట‌ర్ బాటిల్ రూపంలోనో నీరు ల‌భిస్తుంది. మరి అనాథ‌లు, పేద వారి సంగ‌తి. వారికైతే అస‌లు స‌రైన నీరే దొర‌క‌దు. ఇక మంచి నీటి గురించి ఎవ‌రు ప‌ట్టించుకుంటారు. అలాంటి ద‌య‌నీయ స్థితిలో ఉన్న వారు పైన చెప్పిన లాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటే? దాన్ని ఊహించుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉంది క‌దూ. అయితే అలాంటి స్థితిని ఎదుర్కొంటున్న వారు మ‌న దేశంలో చాలా మందే ఉన్నారు. ఈ క్ర‌మంలో అలా దాహంతో అల్లాడిపోతున్న వారి గురించి ఆలోచించింది ఆ మహిళ‌. అనుకున్నదే త‌డవుగా త‌న ఆలోచ‌న‌ను ఆచ‌ర‌ణలో పెట్టింది.

shailee-shah-water

గుర్గావ్‌కు చెందిన శైలీ షా స్థానికంగా ఉన్న ఓ హోట‌ల్ మేనేజ్‌మెంట్ క‌ళాశాల‌లో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తోంది. ఈమె ఒక‌రోజు రోడ్డుపై ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద వేచి చూస్తుండ‌గా త‌న వ‌ద్ద‌కు ఓ అనాథ బాలుడు వ‌చ్చి యాచించాడు. దీంతో ఆమె త‌న ద‌గ్గ‌ర ఉన్న బిస్కెట్ల‌ను తీసి అతనికి ఇచ్చింది. అయితే ఆ కుర్రాడు ఆ బిస్కెట్ల‌ను వ‌ద్ద‌న్నాడు. ఎందుకంటే వాటిని తింటే నీరు తాగాల్సి వ‌స్తుంద‌ని, త‌న ద‌గ్గ‌ర నీరు లేద‌ని జ‌వాబిచ్చాడు. దీంతో శైలీ షా త‌న వ‌ద్ద ఉన్న ఒకే ఒక వాట‌ర్ బాటిల్‌ను ఆ బాలుడికి ఇచ్చింది. అత‌న్ని చూసిన మ‌రికొంద‌రు చిన్నారులు నీటి కోసం ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చారు. అయితే అప్ప‌టికే త‌న వ‌ద్ద ఉన్న బాటిల్స్ అన్నీ అయిపోవ‌డంతో ఆమె చేసేదేం లేక ట్రాఫిక్ నుంచి బ‌య‌ట ప‌డింది. ఆ క్ర‌మంలో ఆమెకు ఆ అనాథ చిన్నారుల దాహార్తి గుర్తుకు వ‌చ్చింది. దీంతో వారికి ఎలాగైనా నీటిని అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. అనుకున్న‌దే త‌డ‌వుగా త‌న నిర్ణ‌యాన్ని అమ‌ల చేసింది.

త‌మ కాలేజీలో స్టూడెంట్స్ ఉప‌యోగించిన వాట‌ర్ బాటిల్స్‌ను సేక‌రించి ఇంటికి తెచ్చేది. వాటిని శుభ్రంగా క‌డిగి వాటిలో త‌మ ద‌గ్గ‌ర ఉన్న నీటిని ప‌ట్టేది. అనంత‌రం ఆ బాటిల్స్‌ను ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచి తెల్లార‌గానే తీసి త‌న‌కు దారిలో క‌నిపించే అనాథ పిల్ల‌ల‌కు, రిక్షా, ఆటో, భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు, కూలీల‌కు ఇస్తుండేది. దీంతో ఆ నీటిని వారు ఆనందంగా తాగేవారు. అది శైలీ షాకు ఎంతో సంతృప్తినిచ్చేది. అలా ఆమె ఇప్పుడు రోజూ దాదాపు 30 వాట‌ర్ బాటిల్స్ వ‌ర‌కు అలాగే ఇస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె త‌న కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో 3,500 బాటిల్స్ వ‌ర‌కు దాహార్తుల‌కు ఇచ్చింది. శైలీ షా చేస్తున్న పనిని చూసిన ఆమె స్నేహితులు కూడా వాట‌ర్ బాటిల్స్‌ను అందించేందుకు ముందుకు వ‌స్తుండ‌డం విశేషం. అవును మ‌రి. ఎవ‌రైనా ఒక మంచి ప‌ని చేస్తే, అది న‌లుగురికీ నిజంగా మంచి క‌లిగిస్తే దాన్ని చూసిన ఇత‌రులు కూడా ఆ మంచి ప‌ని చేస్తారు క‌దా. అందుకే అంటారు ప్ర‌తి ఒక్క‌రికీ స్పందించే హృద‌యం ఉండాల‌ని. అలా ఉంటే స‌మాజహిత కార్య‌క్ర‌మాల‌ను ఎన్నింటినో చేయ‌వ‌చ్చు. ఏమంటారు!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top