ఏ వంట‌నైనా ఇట్టే అవ‌లీల‌గా చేయ‌గ‌ల ఈ బామ్మ‌… యూట్యూబ్ చాన‌ల్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది..!

మాంచిగా మ‌సాలాలు ద‌ట్టించి చేసిన కోడికూర‌…. రొయ్య‌ల ఫ్రై… చేప‌ల పులుసు… చికెన్ బిర్యానీ… దోశపై వేసిన ఆమ్లెట్‌… పాయా సూప్‌… అబ్బో… ఇలా చెప్పుకుంటూ పోతే ఆ బామ్మ చేసే వంట‌ల లిస్ట్ చాంతాడంత ఉంటుంది లెండి. ఏ వంట‌నైనా ఇట్టే చేసేయ‌డంలో ఆమె దిట్ట‌. మ‌సాలు నూరి నాన్ వెజ్ వండినా, వెజిటేరియ‌న్ వంట‌లు చేసినా ఆమెకు ఆమే సాటి. అవును మ‌రి. అందుకే ఆమె అంత పాపుల‌ర్ అయింది. త‌న పేరిట ఏకంగా ఓ యూట్యూబ్ చాన‌ల్‌నే న‌డుపుతోంది. ఈ క్ర‌మంలో ఆ బామ్మ అత్యంత ఎక్కువ వ‌య‌స్సున్న యూట్యూబ్ చాన‌ల్ ఓన‌ర్ గా రికార్డు సృష్టించింది కూడా. ఇంత‌కీ ఆమె ఎవ‌రు..? ఎక్క‌డుంటుంది అనేగా మీ ప్ర‌శ్న‌..! ఏమీ లేదండీ… ఆమె మ‌న తెలుగావిడే. పేరు మ‌స్తాన‌మ్మ‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గుడివాడ‌కు చెందిన మ‌స్తానమ్మ వంట‌ల ఎక్స్‌ప‌ర్ట్‌. ఏ వంట‌నైనా ఇట్టే చేసేయ‌గ‌ల‌దు. నాన్ వెజ్‌, వెజ్‌, స్నాక్స్‌, రైస్ ఐటం అని తేడా లేదు. త‌న చేయి ప‌డిందంటే ఆ వంట‌కు వ‌చ్చే టేస్టే వేరు. సాధార‌ణంగా అంద‌రూ వండుకునే వంట‌లే కాదు, తాను ప్ర‌త్యేకంగా త‌యారు చేసే వంట‌లు కూడా అంద‌రికీ న‌చ్చుతాయి. అంత‌లా ఆమె పాపుల‌ర్ అయింది. ఆమె ఎగ్ దోశ‌, ఫిష్ ఫ్రై, పాయా, అర‌టి ఆకుల్లో చేసే చేప‌ల ఫ్రై, బొంగు చికెన్‌, పుచ్చ‌కాయ చికెన్ వంటి వంట‌ల‌ను అల‌వోక‌గా చేయ‌గ‌ల‌దు. అవి ఆమె మాత్ర‌మే చేసే ప్ర‌త్యేక‌మైన వంట‌లు. ఇవే కాదు, ఇంకా ఇలాంటి ఎన్నో ప్ర‌త్యేక‌మైన వంట‌లు ఆమె మెనూలో ఉన్నాయి. అయితే ఇంత‌కీ ఆమె మ‌నంద‌రికీ ఎలా తెలిసింది అంటారా..? అది యూట్యూబ్ పుణ్య‌మే.

మ‌స్తాన‌మ్మ ఇంత పాపుల‌ర్ అవ‌క ముందు అంటే యూట్యూబ్‌లో చాన‌ల్ ఓపెన్ చేయ‌క‌ముందు ఓ రోజు త‌న మ‌న‌వ‌డికి ఏదో నాన్‌వెజ్ వండి పెట్టింద‌ట‌. అత‌ని పేరు ల‌క్ష్మ‌ణ్‌. అయితే అప్ప‌టికి త‌న బామ్మ వండిన వంట తిని అత‌ను తృప్తి ప‌డ్డాడు. కానీ… ఆలోచిస్తే ఆ త‌రువాత తెలిసింది, త‌న బామ్మ ఎంత అద్భుతంగా వంట చేయ‌గ‌ల‌దో అని. ఇంకేముందీ… ఓ కెమెరా ప‌ట్టుకుని ఆమె చేత వంట‌లు వండించి వాటిని వీడియోలు తీసి ల‌క్ష్మ‌ణ్ వాటిని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఆ క్ర‌మంలో అత‌ను కంట్రీ ఫుడ్స్ పేరిట యూట్యూబ్‌లో ఓ చాన‌ల్ ను కూడా ఏర్పాటు చేశాడు. మ‌న‌వ‌డు అలా చేస్తుండ‌డంతో మురిసిపోయింది అత‌ని బామ్మ‌..!

అలా మ‌స్తాన‌మ్మ తాను వండే ప్ర‌తి వంట‌కాన్ని మ‌న‌వ‌డు ల‌క్ష్మ‌ణ్ యూట్యూబ్‌లో పెడుతుండ‌డంతో అనతి కాలంలోనే ఆ చాన‌ల్‌కు పాపులారిటీ పెరిగింది. దీంతో దానికి స‌బ్‌స్క్రైబ‌ర్లు కూడా పెరిగారు. ప్ర‌స్తుతం ఆ చాన‌ల్‌కు 2.48 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. దీన్ని బ‌ట్టే మ‌స్తాన‌మ్మ పాపులారిటీ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఆమె చేసిన వంట‌ల‌న్నింటిలోకి ఎక్కువ వ్యూస్ వచ్చింది దేనికో తెలుసా..? ఆమె చేసిన పుచ్చ‌కాయ చికెన్‌కు..! కావాలంటే మీరూ ఆ వీడియోను చూడ‌వ‌చ్చు..! ఇంత‌కీ అస‌లు ఆ బామ్మ వ‌య‌స్సు ఎంతో తెలుసా..? అక్ష‌రాలా 106 సంవ‌త్స‌రాలు. మొన్నా మ‌ధ్యే త‌న 106వ జ‌న్మ‌దినాన్ని ఆమె జ‌రుపుకుంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఆమెకు బ‌హుమ‌తులు పంపారు. అందులో విదేశాల నుంచి వ‌చ్చిన బ‌హుమ‌తులు కూడా చాలానే ఉన్నాయి. దీన్ని బ‌ట్టే మ‌న‌కు తెలుస్తుంది, ఆమె అంత‌ర్జాతీయంగా కూడా ఎంత పాపుల‌ర్ అయిందో..! అవును మ‌రి, అంత‌టి ఘుమ ఘుమ‌లాడే నోరూరించే వంట‌లు చేస్తే ప‌బ్లిసిటీ, పేరు ఎందుకు రాదు చెప్పండి. మీరు గ‌న‌క అటు వైపు వెళితే ఆమె వంట‌లు టేస్ట్ చేయ‌డం మాత్రం మ‌రువ‌కండి..!

Comments

comments

Share this post

scroll to top