పూట‌గ‌డ‌వ‌క ప‌స్తులున్న వారి చేతే, ఇప్పుడు నెల‌కు 15 వేల‌కు పైగా సంపాధించేలా చేసింది ఈ మ‌హిళ‌.

చేతిలో నైపుణ్యం ఉంది. ప‌ని చేయించ‌గ‌ల స‌త్తా ఉంది. కానీ సొంతంగా ప‌రిశ్ర‌మ పెట్టుకునేందుకు కావ‌ల్సిన డ‌బ్బే లేదు. అయినా ఆమె దిగులు చెంద‌లేదు. త‌న‌లా ప‌ని చేయ‌గ‌ల స‌త్తా ఉన్న కొంద‌రు మ‌హిళ‌ల‌ను ఏకం చేసింది. అంద‌రితోనూ క‌లిసి నిధులు స‌మ‌కూర్చింది. చిన్న‌గా ఓ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసింది. అదే ఇప్పుడు కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీగా మారింది. అలా ఆమె ఇప్పుడు ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఉపాధిని కూడా క‌ల్పిస్తోంది. ఆమే… సుమితా ఘోష్‌. ఒక‌ప్పుడు ఆమె వ‌ద్ద చేతిలో డ‌బ్బు లేదు. అయినా ప‌ని నైపుణ్యం ఎంత‌గానో ఉంది. దీంతో ఎలాగైనా ఓ కంపెనీ పెట్టాల‌నుకుంది. కానీ బ్యాంకులు ఆమెకు లోన్ నిరాక‌రించాయి. దీంతో సుమితా ఘోష్ త‌న‌లా ప‌నిచేయ‌గ‌లిగిన మ‌రో 1000 మంది చేతివృత్తి క‌ళాకారుల‌ను ఏకం చేసింది. ఈ క్ర‌మంలో వారందరూ త‌లా రూ.1వేయి ఇచ్చారు. అంద‌రినీ షేర్ హోల్డ‌ర్స్‌ను చేస్తూ సుమితా వ‌చ్చిన ఆ రూ.10 ల‌క్ష‌లతో చిన్న కంపెనీ ఏర్పాటు చేసింది. దాని పేరు రంగ్ సూత్రా. అది ఇప్పుడు మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీ అయింది. దాని సంవ‌త్స‌ర టర్నోవ‌ర్ రూ.10 కోట్లు.

rang-sutra

సుమితా ఘోష్ ఏర్పాటు చేసిన రంగ్ సూత్రా కంపెనీలో ఇప్పుడు దాదాపుగా 3వేల మంది మ‌హిళ‌లు చేతి వృత్తి ప‌నులు చేసుకుంటూ నెల‌కు రూ.15వేల దాకా సంపాదిస్తున్నారు. 2200 మంది మ‌హిళ‌లు ఆ కంపెనీలో డైరెక్ట్ షేర్ హోల్డ‌ర్స్‌గా ఉన్నారు. అయితే ఈ మ‌హిళ‌లంద‌రూ క‌ల‌సి చేనేత వ‌స్త్రాలు, చేతి వృత్తి ఉత్పత్తుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు. వీరి ఉత్ప‌త్తుల‌ను ఫ్యాబ్ ఇండియా కంపెనీతోపాటు ఐకియా అనే మ‌రో కంపెనీ కొనుగోలు చేసి దేశ విదేశాల్లో విక్ర‌యిస్తున్నారు. అయితే సుమితా ఘోష్ అంత‌టితో ఆగ‌లేదు. తాము త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను సొంతంగా మార్కెటింగ్ చేయాల‌నే సంక‌ల్పంతో కొత్త‌గా షాపుల‌ను ఢిల్లీ, గుర్గావ్‌ల‌లో ఏర్పాటు చేశారు. స‌ద‌రు శాఖ‌కు గాను 6 మంది బోర్డ్ మెంబ‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు రంగ్ సూత్రా 10 వసంతాలు పూర్తి చేసుకుంది.

ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతో మంది మ‌హిళ‌లు రంగ్ సూత్రా ద్వారా స్వ‌యం ఉపాధి పొందారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతాల‌కు చెందిన ఎంద‌రో మ‌హిళ‌లకు రంగ్ సూత్రా శిక్ష‌ణ‌నిచ్చి మ‌రీ వారి ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు కృషి చేస్తోంది. ఇదంతా ఆ కంపెనీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు సుమితా ఘోష్ చ‌ల‌వే అని చెప్ప‌వ‌చ్చు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌ణిపూర్ తదిత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఎంద‌రో మ‌హిళ‌లు రంగ్ సూత్రా ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌బ్ది పొందుతున్నారు. దీంతో వారి జీవితాలు కూడా బాగుప‌డ్డాయి. కుటుంబ పోష‌ణ‌కు కావ‌ల్సిన నెల‌స‌రి వేత‌నం, ఆదాయం రంగ్ సూత్రా ద్వారా ల‌భ్య‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చేయూత‌నిచ్చేలా మ‌హిళ‌ల‌ను ఆర్థిక ప్ర‌గ‌తి వైపు న‌డిపిస్తున్న రంగ్ సూత్రా, సుమితా ఘోష్‌ల‌ను మ‌నం నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top