ఆ మ‌హిళ భ‌ర్త శ‌వాన్నిమోసింది, కూతురిచే త‌ల‌కొరివి పెట్టించి క‌ట్టుబాట్ల‌ను ఛేధించింది..!

మ‌న దేశంలో పురాత‌న కాలం నుంచి అనేక మూఢాచారాలు, విశ్వాసాలు ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా ఆడ వారి విష‌యానికి వ‌స్తే వీటి పాళ్లు ఇంకా కొంచెం ఎక్కువ‌గానే ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే వారు ఎదుర్కొంటున్న అలాంటి అనేక స‌వాళ్ల‌లో ఓ ముఖ్య‌మైన అంశం కూడా ఒక‌టి ఉంది. అదే చ‌నిపోయిన వారిని ఖ‌న‌నం చేసేందుకు ఆడ‌వారు వెళ్ల‌కూడ‌ద‌ని చెప్ప‌డం. హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారమైతే ఎవ‌రైనా చ‌నిపోయిన వ్య‌క్తుల శ‌రీరాల‌ను ఆడ‌వారు శ్మ‌శానానికి తీసుకెళ్ల‌కూడ‌దు. త‌ల‌కొరివి కూడా పెట్ట‌కూడ‌దు. ఇది మ‌న దేశంలో ఎంతో కాలం నుంచి అమ‌లులో ఉంది. ఇప్ప‌టికీ చాలా ప్రాంతాల్లో దీన్ని పాటించే వారు ఉన్నారు కూడా. కానీ గుజ‌రాత్‌కు చెందిన ఆ మ‌హిళ ఇలాంటి మూఢ విశ్వాసాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టి శ్మ‌శానానికి వెళ్లింది. అది కూడా చ‌నిపోయిన త‌న భ‌ర్త శవాన్ని తీసుకుని వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

anju-yadav

గుజ‌రాత్ పోలీసు విభాగంలో రాకేష్ యాద‌వ్ అనే వ్య‌క్తి హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. అత‌ని భార్య అంజు యాద‌వ్‌. వీరికి ఒక కుమార్తె సంతానం. కాగా ఇటీవ‌లే రాకేష్ యాద‌వ్ విధి నిర్వ‌హ‌ణ‌లో ఉండ‌గా అక‌స్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావ‌డంతో చ‌నిపోయాడు. దీంతో అత‌ని మృత దేహానికి పోస్టు మార్టం నిర్వ‌హించిన వైద్యులు ఆ బాడీని ఆంబులెన్సులో ఇంటికి పంపారు. కాగా అత‌ని మృతదేహాన్ని ఖ‌న‌నం చేసేందుకు శ్మ‌శానానికి త‌ర‌లించాల్సిన స‌మ‌యం కూడా వ‌చ్చింది. ఎంతో మంది స‌హాయం చేస్తామ‌ని ముందుకు వ‌చ్చారు కూడా. కానీ అంజు యాద‌వ్ నిరాక‌రించింది. త‌న భ‌ర్త శ‌వాన్ని పాడెపై శ్మ‌శానానికి మోసింది.

అంజు యాద‌వ్ అలా త‌న భ‌ర్త శవాన్ని పాడె మోయ‌గా అక్క‌డికి వెళ్లాక ఆమె కూతురు త‌ల‌కొరివి పెట్టింది. కొడుకులు ఎవ‌రూ లేక‌పోవ‌డం వ‌ల్ల ఆమె త‌న కూతురితోనే భ‌ర్త మృత‌దేహానికి త‌ల‌కొరివి పెట్టించింది. సాధార‌ణంగా ఎవరూ కూడా ఇంత ధైర్యంగా ముందుకు వెళ్లి అలాంటి సాహ‌సం చేయ‌రు. ప్ర‌ధానంగా స‌మాజం విధించిన ఈ క‌ట్టుబాట్ల‌కు వ్య‌తిరేకంగా వెళ్ల‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు కూడా. అయినా ఎవ‌రు ఏమ‌న్నా అనుకోనీ, అంటూ అంజు యాద‌వ్ తెగువ‌తో ఇలా చేసింది. దీంతో ఆమెను ఇప్పుడు అంద‌రూ అభినందిస్తున్నారు. పురాత‌న కాలం నుంచి ప్ర‌చారంలో ఉన్న క‌ట్టుబాట్ల‌ను పాటించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె నిరూపించింది. ఆమె తెగువ‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top