గొంతు క్యాన్స‌ర్‌తో మాట పోగొట్టుకున్న వారి కోసం భార‌త వైద్యుడి అద్భుత ఆవిష్క‌ర‌ణ‌…

మ‌నిషికి స్వ‌ర పేటిక అవ‌స‌రం ఎంత ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. దాంతోనే ఏ వ్య‌క్తి అయినా త‌న మ‌న‌సులోని భావాల‌ను మాట‌లుగా పైకి చెప్ప‌గ‌లుగుతాడు. అయితే కొంద‌రు వివిధ కార‌ణాల వ‌ల్ల పుట్టుక‌తోనే మూగ‌వారుగా జ‌న్మించ‌డ‌మో, కొంద‌రు ఏదో ఒక ప్ర‌మాదంలోనో లేదా వేరే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో స్వ‌ర పేటిక‌ను పోగొట్టుకుని మూగ‌వారుగా మారుతారు. ఈ క్ర‌మంలో గొంతు క్యాన్స‌ర్ ద్వారా కూడా కొంత మందికి ఒక్కోసారి స్వ‌ర‌పేటిక తీసేయాల్సి వ‌స్తుంది. దీంతో వారు కూడా మాట్లాడే శ‌క్తిని కోల్పోతారు. అయితే అలాంటి వారి కోసం ఇప్ప‌టికే మార్కెట్‌లో ప‌లు డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ అవెంతో ధ‌ర ఎక్కువ‌. కాగా అలాంటి ఎక్కువ ధ‌ర ఉన్న ప‌రిక‌రాల స్థానే అత్యంత త‌క్కువ ధ‌ర‌కే మ‌న భార‌తీయ వైద్యుడు ఒక‌త‌ను ఓ కొత్త వాయిస్ బాక్స్ ప‌రిక‌రాన్ని రూపొందించాడు. గొంతు క్యాన్స‌ర్ ద్వారా మాట్లాడే శ‌క్తిని పోగొట్టుకున్న వారికి ఈ ప‌రిక‌రం ఎంత‌గానో ఉప‌యుక్తంగా మారింది.

aum-voice-box

బెంగుళూరులోని హెల్త్‌కేర్ గ్లోబ‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్ అనే హాస్పిట‌ల్‌లో త‌ల‌, మెడకు సంబంధించిన వైద్య నిపుణుడిగా విధులు నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్ విశాల్ రావు గొంతు క్యాన్స‌ర్ ద్వారా మాట్లాడే శ‌క్తిని పోగొట్టుకున్న బాధితుల కోసం ఓ నూత‌న ప‌రిక‌రాన్ని ఇటీవ‌లే త‌యారు చేశారు. ‘ఓం’ అని పిల‌వ‌బ‌డే ఈ ప‌రిక‌రం ధ‌ర రూ.50 మాత్ర‌మే. ఇలాంటి ప‌రిక‌రాలు మార్కెట్‌లో ప్ర‌స్తుతం రూ.15 వేల నుంచి రూ.30వేల ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. అయితే అవ‌న్నీ ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డం, పేద‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో డాక్ట‌ర్ విశాల్ రావు తానే స్వ‌యంగా శ్ర‌మించి ఓం ప‌రిక‌రాన్ని ఆవిష్క‌రించారు. ఓ పారిశ్రామిక వేత్త ఆర్థిక స‌హ‌కారంతో విశాల్ రావు ఈ ప‌రిక‌రాన్ని రూపొందించారు. ధ‌ర రూ.50 మాత్ర‌మే అయినా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా దీన్ని 1 డాల‌ర్ వాయిస్ బాక్స్‌గా పిలుస్తున్నారు.
డాక్ట‌ర్ విశాల్ రావు త‌యారు చేసిన ఈ ప‌రిక‌రాన్ని బాధిత పేషెంట్ గాలి పైపుకు, ఆహార నాళానికి మ‌ధ్య‌లో అమ‌రుస్తారు. ఆ రెండింటి నుంచి అందే గాలి ద్వారా ఈ వాయిస్ బాక్స్ ప‌నిచేస్తుంది. కాగా మ‌న దేశంలో పొగాకు ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా వాడే వారికి గొంతు క్యాన్స‌ర్ వ‌స్తోంద‌ని, అలాంటి వారిలో ఎక్కువ‌గా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారే ఉంటున్నార‌ని విశాల్ రావు తెలిపారు. ఈ క్ర‌మంలో గొంతు క్యాన్స‌ర్ వ‌స్తే వారు మాట్లాడే శక్తిని కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని, దీంతో ఎక్కువ ధ‌ర వెచ్చించి వాయిస్ బాక్స్ ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయ‌లేని వారి కోస‌మే ఈ ప‌రిక‌రాన్ని రూపొందించాన‌ని విశాల్ రావు చెబుతున్నారు. అయితే ఈ వాయిస్ బాక్స్‌ల‌లో దేన్నైనా 6 నెల‌ల‌కు మించి వాడ‌లేమ‌ని, ఈ క్ర‌మంలో తాను త‌యారు చేసిన డివైస్‌తో పెద్ద ఖ‌ర్చు కూడా కాదు కాబ‌ట్టి పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఎంతో ఉప‌యోగంగా ఉంటుంద‌ని అంటున్నారు. అంతేగా మ‌రి! గొంతు క్యాన్స‌ర్‌తో మాట పోగొట్టుకున్న బాధిత పేషెంట్ల కోసం డాక్ట‌ర్ విశాల్ రావు చేసిన కృషికి ఆయ‌న‌ను మ‌నం ఎంత‌గానో అభినందించాలి.

Comments

comments

Share this post

scroll to top