నీటి కోసం ఆ గ్రామ వాసులు ప‌డుతున్న క‌ష్టాలు చూస్తే… ఎవ‌రికైనా జాలి క‌ల‌గ‌క మాన‌దు..!

మ‌ళ్లీ ఎండాకాలం వచ్చేసింది. పూర్తిగా ఎండ‌ల్లోకి ఇంకా అడుగు పెట్ట‌లేదు, ఇప్పటికే చాలా చోట్ల జ‌నాలు నీటి కోసం అల్లాడుతున్నారు. నిత్యావ‌స‌రాల కోసం ప‌క్క‌న పెడితే తాగుదామంటే గుక్కెడు నీరు దొర‌క‌డం లేదు. మ‌హారాష్ట్ర‌లోని మ‌ర‌ఠ్వాడా ప్రాంతంలో ఉన్న ఒస్మానాబాద్ జిల్లా త‌క్‌వికీ గ్రామ ప్ర‌జ‌ల నీటి క‌ష్టాలు అయితే మ‌రీ వ‌ర్ణ‌నాతీతం. అక్క‌డ భూగ‌ర్భ జ‌లాలు చాలా మీట‌ర్ల లోతుకు ప‌డిపోయాయి. వేయి అడుగుల‌కు బోర్లు వేసినా చుక్క నీరు ప‌డ‌డం లేదు. బావులు ఉన్నా వాటిలో ల‌భించేది అర‌కొర నీళ్లే. వాటి కోసం అక్క‌డి జ‌నాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. కొంద‌రైతే వ్య‌వ‌సాయ క్షేత్రాల వ‌ద్ద ఉన్న బావుల నుంచి, మోటార్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. అక్క‌డా కూడా అర‌గంట‌కో, గంట‌కో ఒక బిందె నీరు ల‌భిస్తోంది. దీనికి తోడు విద్యుత్ స‌మ‌స్య‌. క‌రెంటు ఎప్పుడు ఉంటే అప్పుడు పొలాల వ‌ద్ద‌కు వెళ్ల‌డం, దొరికిన నీరు ప‌ట్టుకోవ‌డం, తిరిగి ఇంటికి చేరుకోవ‌డం… ఇదీ ఆ గ్రామ వాసుల దిన చ‌ర్య‌..!

త‌క్‌వికీ గ్రామంలో ఉన్న జ‌నాలు అలా నీటి కోసం రోజూ 10 – 15 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించాల్సి వ‌స్తోంది. బైక్‌లు, ఆటోలు, సైకిళ్లు ఉన్న‌వారు వాటిపై నీటిని తెచ్చుకుంటుండ‌గా, అవి లేని వారికి కాలి న‌డ‌కే శ‌ర‌ణ్య‌మ‌వుతోంది. నీరు తెచ్చే డ్యూటీ కోసం ఆ గ్రామ వాసులు వంతుల వారీగా కుటుంబంలో రోజుకొక‌రు చొప్పున వెళ్తున్నారు. ఇక కొన్ని మోటార్లు, బావుల వ‌ద్ద‌నైతే ద‌ళారులు య‌థేచ్ఛ‌గా దందా న‌డుపుతున్నారు. ప్ర‌భుత్వం ఉచితంగా నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని చెబుతున్నా ప‌ట్టించుకోకుండా 500 లీట‌ర్ల నీటిని రూ.200 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో నీటి కోసం త‌ప్ప‌నిస‌రిగా జ‌నాలు డ‌బ్బు వెచ్చించాల్సి వ‌స్తోంది. అయితే అలా నీటిని కొనుక్కున్నా లేదంటే మ‌రే మార్గం ద్వారానైనా తెచ్చుకున్నా ముందుగా వారు ఆ నీటితో స్నానం చేస్తారు. అనంత‌రం అదే నీటితో బ‌ట్ట‌లు ఉతుక్కుని, గిన్నెలు క‌డుక్కుంటారు. ఇంకా ఏమైనా నీరు మిగిలితే అలాంటి అవ‌స‌రాల కోస‌మే వాడుతారు త‌ప్ప వృథా చేయ‌రు. ఇదిలా ఉంటే… ఆ గ్రామంలో ఉండే ద‌ళితుల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. వారిని ఎవ‌రూ ద‌గ్గ‌రికి రానివ్వ‌రు. దీంతో వారికి నీరు దొర‌క‌డ‌మే గ‌గ‌న‌మై వారి బ‌తుకులు చిద్ర‌మ‌వుతున్నాయి.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌క్‌వికీ గ్రామంతోపాటు ఆ చుట్టు పక్క‌ల ఉన్న గ్రామాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అక్క‌డ కొన్నేళ్లుగా వ‌ర్షం స‌రిగ్గా ప‌డ‌డం లేదు. ఏటా న‌మోదు అవ్వాల్సిన సాధార‌ణ వ‌ర్ష‌పాతం కూడా న‌మోదు కావ‌డం లేదు. ఈ క్ర‌మంలో పంట‌లు స‌రిగ్గా పండించ‌లేక‌పోతున్నారు రైతులు. దీంతో చాలా మంది ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక ప‌శువుల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వాటికి గ్రాసం ల‌భించ‌క‌పోవ‌డంతో వాటి పెంపకం రైతుల‌కు భార‌మ‌వుతోంది. దీంతో వాటి ద్వారా వారికి ల‌భించే ఆదాయం కూడా త‌గ్గుతోంది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే మ‌రో రెండు, మూడు నెల‌ల్లో అక్క‌డ నీటి కోసం జ‌నాలు ఇంకా ఎంత‌టి క‌ష్టాలు ప‌డ‌తారోన‌ని ఊహించుకుంటేనే అదోలా అనిపిస్తోంది. ఇక వారికి నీరు ల‌భిస్తుందా అన్నది క‌ల‌లో మాటే. ఎందుకంటే ఇది ఇంకా మార్చి నెలే. ఏప్రిల్‌, మే నెల‌లు వ‌స్తేనే గానీ అస‌లు స‌మ‌స్య‌లు ఇంకా రావు. ఇక మ‌న నేత‌లు ప్ర‌జ‌ల నీటి క‌ష్టాల‌ను తీర్చ‌డం కోసం ఏం పాట్లు ప‌డ‌తారో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top