గ్రామస్తులంతా కలిసి… బీడు భూమిని నిండుకుండలా మార్చారు…

ఏదైనా ఒక గొప్ప ల‌క్ష్యాన్ని సాధించాలంటే ఒక వ్య‌క్తి అయితే అత‌నికి చాలా కాలం ప‌డుతుంది. దీనికి తోడు ఆ వ్య‌క్తి ఎంత‌గానో శ్ర‌మించాల్సి ఉంటుంది. కానీ ఎట్ట‌కేల‌కు దాన్ని ఆ వ్య‌క్తి సాధించ‌గ‌లుగుతాడు. అయితే అదే గొప్ప ల‌క్ష్యాన్ని సాధించ‌డం కోసం కొన్ని వంద‌ల మంది క‌ల‌సి ప‌నిచేస్తే? ఇంకేముంది కేవ‌లం కొద్ది రోజుల్లోనే వారు ఆ ల‌క్ష్యాన్ని సాధిస్తారు. అవును, రాజ‌స్థాన్‌లోని ఆ గ్రామ‌వాసులు కూడా అదే చేసి నిరూపించారు. ఇంత‌కీ వారేం చేశారంటే…

Ramsar-Lake

రాజ‌స్థాన్‌లోని రామ్‌సార్ అనే గ్రామంలో 52 హెక్టార్ల (దాదాపు 128 ఎక‌రాలు) బంజ‌రు భూమి ఉంది. కాగా ఒక‌ప్పుడు ఆ భూమిలో చిన్న‌పాటి కాలువ పారుతుండేది. దీంతో ఆ గ్రామం ఎప్పుడూ ప‌చ్చ‌గా ఉండేది. అయితే కాల‌క్ర‌మంలో ఆ కాలువ కాస్తా ఎండిపోయి స్థానిక గ్రామ‌స్తుల‌కు నీటి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఈ మ‌ధ్య కాలంలో అయితే వారి నీటి క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో వారు ఎండిపోయిన ఆ కాలువ‌కు మ‌ళ్లీ ప్రాణం పోయాల‌నుకున్నారు. కానీ ఈ సారి కాలువలా కాకుండా అదే భూమిని చిన్న‌పాటి చెరువుగా మార్చాల‌నుకున్నారు. దీంతో వారి నిర్ణ‌యానికి అక్క‌డి జిల్లా ప‌రిపాల‌న విభాగం అధికారులు కూడా ఆమోదం తెలిపారు. చెరువును త‌వ్వేందుకు ఆ గ్రామ‌స్తుల‌కు అధికారులు రూ.8 ల‌క్ష‌ల‌ను మంజూరు చేశారు.

అలా ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన రూ.8 ల‌క్ష‌ల‌తో ఆ గ్రామ‌స్తులే త‌మ‌కు తామే ప‌ని క‌ల్పించుకుని ఉపాధి పొందారు. అంతేకాదు దాదాపు 5 నెల‌ల పాటు శ్రమించి ఆ బంజ‌రు భూమిని చెరువుగా మార్చేశారు. 5 అడుగుల లోతు ఉండేలా, 4.08 టీఎంసీల నీరు ప‌ట్టేలా ఆ చెరువును వారు త‌వ్వుకున్నారు. ప్ర‌స్తుతం ప‌డుతున్న వ‌ర్షాల‌తో ఆ చెరువులో 8 అంగుళాల మేర నీరు చేరింది. దీంతో ఆ గ్రామ‌స్తులు చేసిన కృషికి, ప‌డిన శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం దక్కింది. చెరువులో నీరు రావ‌డ‌మేమో కానీ ఇప్పుడు ఆ గ్రామంలోని బావుల‌న్నింటిలోకి నీరు వ‌చ్చింది. దీంతో ఆ గ్రామ‌స్తుల నీటి క‌ష్టాలు కూడా పోయాయి. కాగా ఆ గ్రామ రైతులు ఇప్పుడు ఎంతో సంతోషంగా పంట‌ల‌ను వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వారికి కావ‌ల్సిన నీరు స‌మృద్ధిగా ఉందిగా. ఇక పంట‌లు వేయ‌కుండా ఎలా ఉంటారు! త‌మ బాగు కోసం తామే క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి చెరువును త‌వ్వి ఆ బంజ‌రు భూమిని నీళ్లిచ్చే బంగారు భూమిగా మార్చుకున్న ఆ గ్రామ‌స్తుల చొర‌వ నిజంగా అభినంద‌నీయం.

Comments

comments

Share this post

scroll to top