ఈ వీడియో చూస్తే స‌మాజంలో ఆ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధేంటో తెలుస్తుంది.

”నేను చ‌ద‌వ‌డం మానేశాను, ఎందుకంటే వారు న‌న్ను ద‌ళితురాలిన‌ని అవ‌మానించేవారు. ”
”కేవ‌లం ఈ ప‌ని కోస‌మే మమ్మ‌ల్ని వాడుకుంటున్నారు. ఏ ప‌నీ ఇవ్వ‌రు. ”
”నన్ను, నా ప‌నిని చూస్తే ఎవ‌రూ గౌర‌వించ‌రు, అస‌హ్యించుకుంటారు. ”
”నేనెక్క‌డికి వెళ్లినా నాకు టాయిలెట్లు క‌డిగే పనే ఇస్తున్నారు. చ‌చ్చిపోతే పోవాలి, లేదంటే ఈ పనే చేయాలి. ”
”మేమూ మ‌నుషుల‌మే క‌దా, మాకూ మ‌న‌స్సు ఉంటుంది, భావాలు ఉంటాయి. ఈ ప‌ని చేయ‌డం కంటే బిచ్చ‌మెత్తుకోవడం చాలా మంచిది. ”
”వారు ఎక్క‌డ పడితే అక్కడ రెంటికి వెళ్తారు. దాన్ని మేం ఓ వ్య‌ర్థ ప‌దార్థంలా ఏమీ తెలియ‌న‌ట్టు చేతుల్తో ప‌ట్టుకుని ఆ ప్రాంతంలో క్లీన్ చేయాలి. మ‌నుషుల వ్య‌ర్థాల‌ను ఎత్తే ప‌ని చేసి ఇంటికి వెళ్తే నా కూతురు చేతుల్లోంచి ఏదీ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌దు.”

ఈ మాటలు చాలు. త‌మిళ‌నాడులో టాయిలెట్లు, సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువ‌ల‌ను క్లీన్ చేస్తున్న వారి దీనావ‌స్థ గురించి చెప్పేందుకు. దివ్య భార‌తి అనే యువ‌తి తీసిన 4 నిమిషాల నిడివి గ‌ల ఓ డాక్యుమెంట‌రీని చూస్తే అప్పుడు మేం పైన చెప్పిన మాట‌లు నిజ‌మే అని మీరు కూడా అంటారు. అంత‌టి హీన స్థితిలో అక్క‌డి ప్ర‌జ‌లు జీవ‌నం సాగిస్తున్నారు. కేవ‌లం త‌మిళ‌నాడులో మాత్ర‌మే కాదు, దాదాపుగా దేశ‌మంతటా ప‌రిస్థితి ఇలాగే ఉంది.

1993లో Employment of Manual Scavengers and Construction of Dry Latrines (Prohibition) Act ప్ర‌కారం మ‌నుషుల‌చే సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయించ‌డం, మ‌నిషి వ్య‌ర్థాల‌ను ఎత్తించ‌డం వంటి ప‌నుల‌ను మ‌న దేశంలో నిషేధించారు. ఎవ‌రైనా ఆ ప‌నికోసం యంత్రాల‌ను మాత్ర‌మే వాడాల్సి ఉంటుంది. మ‌నుషుల‌ను ఉప‌యోగించ‌కూడ‌దు. కానీ జ‌రుగుతున్న‌ది వేరు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం… ఆ ప‌ని చేసే వారు ద‌ళిత వ‌ర్గాల‌కు చెందిన వారు కావ‌డ‌మే. ఆ వ‌ర్గానికి చెందిన వారు కాబ‌ట్టే వారిని చిన్న చూపు చూస్తూ కొంద‌రు కాంట్రాక్ట‌ర్లు వారికి కేవ‌లం అదే ప‌ని ఇస్తున్నారు. వేరే ప‌నులు ఇవ్వ‌డం లేదు. దీంతో బ‌తుకు బండిని లాగేందుకు వారికి ఆ ప‌ని చేయ‌క త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో ఎంతో మంది సెప్టిక్ ట్యాంకుల‌ను క్లీన్ చేస్తూ ప్రాణాల‌ను కోల్పోయిన సంద‌ర్భాలు ఉన్నాయి.

వారి బ‌తుకుల‌కు గ్యారంటీ లేదు. క‌నీసం మాస్క్‌లు, గ్లోవ్స్ వంటి సుర‌క్షిత‌మైన ప‌రిక‌రాల‌ను కూడా ప్ర‌భుత్వాలు ఇవ్వ‌డం లేదు. వారే సొంతంగా కొనుగోలు చేసుకోవాలి. ఇక ఆ ప‌ని చేసే మ‌హిళ‌ల బ‌తుకులు అయితే మ‌రీ దారుణంగా ఉన్నాయి. వారిలో అధిక శాతం మంది నిత్యం ఏదో ఒక చోట లైంగిక వేధింపుల‌కు కూడా గుర‌వుతుంటారు. ఈ క్ర‌మంలో ఆ ప‌నిచేస్తున్న ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను, స‌మస్య‌ల‌ను తెలియజేసేలా త‌మిళ‌నాడుకు చెందిన ఓ సామాజిక వేత్త అయిన దివ్య భార‌తి అనే యువ‌తి 4 నిమిషాల నిడివి గ‌ల వీడియో తీసింది. దాన్ని చూస్తే ఆ ప్ర‌జ‌ల దీనావ‌స్థ‌పై ఎవ‌రికైనా జాలి క‌ల‌గ‌క మాన‌దు. ఇప్పుడు దివ్య భార‌తి ముందున్న ల‌క్ష్యం ఒక్క‌టే. ఎలాగైనా ఈ ప‌ని నుంచి వారిని విముక్తులను చేసి వారికి స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేలా చేయాల‌ని ఆమె ఆశ‌యం. అది నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top