అమెరికా వేసిన అణుబాంబు కు హీరోషిమా, నాగ‌సాకి ప‌ట్ట‌ణాలు అత‌లాకుత‌లం అయినా…చెక్కు చెద‌ర‌ని ఓ చెట్టు.!

రెండో ప్ర‌పంచ యుద్ధంలో అమెరికా జ‌పాన్ దేశంపై అణుబాంబుల‌ను వేసిన విష‌యం తెలిసిందే క‌దా. జ‌పాన్‌లోని హిరోషిమా, నాగ‌సాకి ప‌ట్ట‌ణాల‌పై వెంట వెంట‌నే రెండు అణుబాంబుల‌ను అమెరికా వేసింది. దీంతో కొన్ని ల‌క్షల మంది జ‌నాలు చ‌నిపోయారు. మ‌రెన్నో ల‌క్ష‌ల మంది జ‌నాలు తీవ్ర గాయాల‌కు గుర‌య్యారు. ఇక చాలా ఏళ్ల వ‌ర‌కు ఆ బాంబులు ప‌డిన ప్ర‌దేశంలో చిన్న మొక్క కూడా పెర‌గ‌లేదు. దీంతోపాటు ఆ ప్రాంతాల్లో నివ‌సించే వారు తీవ్ర‌మైన రేడియేష‌న్ బారిన ప‌డ్డారు. అయితే హిరోషిమాపై అణుబాంబు ప‌డిన ప్ర‌దేశానికి 3 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్న ఓ ఫ్యామిలీ మాత్రం బ‌తికి బ‌ట్ట‌కట్టింది. వారి ఇంటి వ‌ద్ద ఉన్న ఓ బోన్సాయ్ వృక్షం కూడా చెక్కు చెద‌ర‌లేదు.

అమెరికా అణుబాంబు వేసిన హిరోషిమా ప‌ట్ట‌ణానికి 3 కిలోమీట‌ర్ల దూరంలో య‌మ‌కి అనే ఓ వ్య‌క్తి కుటుంబం నివ‌సిస్తోంది. వారి ఇంటి ద్వారం వ‌ద్ద వైట్ పైన్ అన‌బ‌డే ఓ జ‌ప‌నీస్ బోన్సాయ్ చెట్టు ఉండేది. అయితే అంత‌టి అణుబాంబు ప‌డినా వారికీ ఏమీ కాలేదు, ఆ వృక్షానికి ఏమీ కాలేదు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొంద‌రైతే ఆ చెట్టు వ‌ల్లే వారు బ‌తికార‌ని అన్నారు కూడా. అప్ప‌టికే ఆ చెట్టుకు 300 ఏళ్ల‌కు పైగానే ఉంటాయ‌ని చెప్పారు. ఇప్పుడా చెట్టు వ‌య‌స్సు క‌రెక్ట్‌గా 396 సంవ‌త్స‌రాలు అట‌. దీన్ని 1621లో నాటార‌ని చెబుతున్నారు.

అయితే య‌మ‌కి కుటుంబానికి ఈ చెట్టు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌ద‌ట‌. వారి పూర్వీకులు ఎప్ప‌టినుంచో దాన్ని పెంచుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే వారు కూడా దాన్ని అలాగే పెంచారు. అయితే రెండో ప్ర‌పంచ యుద్ధంలో వారు అణుబాంబు దాడి నుంచి బ‌తికి బ‌య‌ట ప‌డ్డాక ఆ చెట్టును త‌మ‌తోపాటు తీసుకెళ్లారు. త‌రువాత కొన్నేళ్ల‌కు అంటే 1976లో య‌మ‌కి దాన్ని అమెరికా ప్ర‌భుత్వానికి ఇచ్చేశాడ‌ట‌. దీంతోనైనా అమెరికా, జ‌పాన్‌ల మ‌ధ్య పాత యుద్ధం తాలూకు క‌క్ష‌లు ఉండ‌కుండా ఆ రెండు దేశాలు స్నేహ‌పూర్వ‌కంగా ఉంటాయ‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ చెట్టు ఇప్పుడు అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న యూఎస్ నేష‌న‌ల్ ఆర్బోరెటం లో భ‌ద్రంగా ఉంది. దాన్ని నిత్యం అనేక మంది సంద‌ర్శిస్తారు. ఏది ఏమైనా ఇప్పుడీ విష‌యం తాజాగా మ‌రో సారి తెలిసే స‌రికి ఇప్పుడా చెట్టును చూసేందుకు జ‌నాలు ఇంకా ఎక్కువగా వ‌స్తున్నార‌ట‌. అంత‌టి భారీ బాంబు దాడిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డ చెట్టుగా ఇప్పుడీ బోన్సాయ్ చెట్టుకు మంచి పేరు వ‌చ్చింది..!

Comments

comments

Share this post

scroll to top