మన దేశం ఎన్నో చారిత్రక, పురాతన దేవాలయాలకు నిలయం. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించినా ఇప్పటికీ చెక్కు చెదరని ఆలయాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆలయ పరంగా ఎంతో పురాణ విశిష్టతను కలిగి ఉన్నాయి. మరికొన్ని వాటి నిర్మాణం, ఆకృతి, ప్రాచీనత వంటి అంశాల కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం వీటన్నింటికీ భిన్నమైంది. ఎందుకంటే ఆ ఆలయం రోజూ మాయమవుతూ, మళ్లీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే..?
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర దగ్గర ఉన్న కవి కంబోయ్ అనే గ్రామం వద్ద అరేబియా మహా సముద్రంలో పైన మేం చెప్పిన శివాలయం ఉంది. అక్కడి శివున్ని స్తంభేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైందని చరిత్రకారులు చెబుతున్నారు. కొన్ని వేల ఏళ్ల కిందటే కార్తికేయ స్వామి స్వయంగా దీన్ని నిర్మించాడట. అప్పుడు ఆ స్వామి తారకాసురుడనే రాక్షసున్ని వధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అదే సమయంలో నిర్మించిన ఈ ఆలయం గత 150 ఏళ్ల కిందటే ప్రజలకు దర్శనమిచ్చిందట. అప్పటి వరకు సముద్రంలోనే మునిగి ఉందట.
అయితే ఇప్పటికీ ఆ ఆలయం రోజూ సముద్రంలో మునిగి మాయమవుతూ, మళ్లీ మరుసటి రోజు ఉదయం ప్రత్యక్షమవుతూ ఉంటుందట. ఈ ఆలయంలోని శివలింగం 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకునే భక్తులు తాము కోరిన కోర్కెలను స్వామి తప్పక నెరవేరుస్తాడని నమ్ముతారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే భక్తులు ఉదయాన్నే రావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం వరకు స్వామి వారి దర్శనం చేసుకుని పూజలు చేయవచ్చు. అనంతరం తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఆలయం మళ్లీ సముద్రంలోకి మునిగిపోతుంది. అయితే ఈ ఆలయానికి ఇదే విశిష్టత కాదు, ఇంకో చెప్పుకోదగిన ప్రాముఖ్యత కూడా ఉంది. అదేమిటంటే, ఈ ఆలయం ఉన్న చోటే మహి సాగర్, సబర్మతీ అనే రెండు నదులు కలుస్తాయట. అక్కడికి భక్తులు రోజూ అధిక సంఖ్యలో కూడా వస్తారట. ఇంకెందుకాలస్యం… మీకూ ఓపిక ఉంటే ఆ మాయమయ్యే శివాలయాన్ని ఒకసారి చూసి రండి మరి..!