రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వారు కనీసం ప్రభుత్వ పాఠశాలకు కూడా వెళ్లలేని అత్యంత దయనీయ స్థితిలో ఉంటారు. పూట పనిచేస్తే గానీ మరో పూటకు తిండి దొరకని స్థితిలో ఇక వారి చదువులు ఎలా సాగుతాయి. ఈ క్రమంలో అలాంటి కుటుంబాలకు చెందిన కొందరు పిల్లలు పనిచేయడం గానీ లేదంటే బిచ్చమెత్తుకోవడం గానీ, ఏవైనా చిన్న చిన్న వస్తువులను రోడ్లపై అమ్మడం వంటి పనులు చేస్తూ ఏదో తమకు చేతనైనంతలో డబ్బును సంపాదించే పనిలో పడతారు. ప్రధానంగా నగరాల్లో మనం ఇలాంటి పిల్లలను ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్దో, రోడ్డు పక్కనో కనిపించే ఇలాంటి వారిని చూసి దాదాపుగా ఎవరూ జాలి పడరు. అలా జాలి పడి సహాయం చేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఈ యువతి కూడా ఒకరు. అయితే అందరూ చేసే రూపాయి, రెండు రూపాయల సహాయంలా ఆమె వారికి సహాయం చేయలేదు. అంతకు మించి ఎక్కువగానే వారికి చేయూతనిస్తోంది. వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ, పెద్దయ్యాక తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా తీర్చిదిద్దుతోంది. ఆమే ఆర్తి పరాబ్.
ముంబైకి చెందిన 28 ఏళ్ల ఆర్తి పరాబ్ బీఈడీ విద్యను పూర్తి చేసింది. అనంతరం ఎంఏ సాధించింది. తరువాత మహారాష్ట్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ చారిటబుల్ సంస్థలో ఫెలోషిప్ చేస్తోంది. దీంతోపాటు ఆమె సమర్థ్ భారత్ వ్యాస్‌పీఠ్ (ఎస్బీవీ) అనే స్వచ్ఛంద సంస్థలో ప్రతినిధిగా చేరి సేవలందిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక రోజు ముంబైలోని థానేలో ఉన్న తీన్ హాత్ సిగ్నల్ ఫ్లై ఓవర్ వద్ద బిచ్చమెత్తుకుంటున్న వీధి బాలలను చూసింది. అక్కడే మరి కొద్ది దూరంలో చిన్నపాటి బొమ్మలు, ఇతర వస్తువులను ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులకు విక్రయిస్తున్న బాలలను కూడా గమనించింది. దీంతో ఆమె ఒక్కసారిగా చలించిపోయింది. వారి జీవితాలను ఎలాగైనా మార్చాలని, చదువు విలువ తెలియజేసి, వారికి చదువు చెబితే దాంతో వారు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని అనుకుంది. అలా అనుకున్నదే తడవుగా వారిని కలిసి వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి ఎన్నో విధాలా నచ్చజెప్పి ఒప్పించిందిం. అనంతరం వారు ఎక్కడైతే బిచ్చమెత్తుకున్నారో అదే తీన్ హాత్ సిగ్నల్ వద్ద ఫ్లై ఓవర్ కింద ఖాళీగా ఉన్న ఓ కంటెయినర్‌ను పాఠశాలగా మార్చేసింది. అందులో బాత్రూంల సౌకర్యం కూడా కల్పించింది. అనంతరం ఆ పిల్లలను ఆ చిన్నపాటి స్కూల్‌కు వచ్చేలా చేసింది.
ఇప్పుడు ఆ పాఠశాలలో మొత్తం 22 మంది చిన్నారులు చదువును నేర్చుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు స్కూల్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఇంటి వద్ద స్నానం చేయని పిల్లలకు స్కూల్లోనే స్నానం చేయించేలా ఏర్పాట్లు చేసింది ఆర్తి. ఉదయాన్నే జాతీయ గీతాలాపనతో ప్రారంభమయ్యే ఆ స్కూల్లో ముందుగా ఆర్తి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతుంది. అనంతరం డ్రాయింగ్, క్రాఫ్టింగ్ వంటి అంశాల్లో శిక్షణను ఇస్తుంది. తరువాత పలు పాఠ్యాంశాలను బోధిస్తుంది. ప్రస్తుతానికి ఆ స్కూల్ పెట్టి దాదాపు 3 నెలలు కావస్తుండగా, అంతకు ముందు కన్నా ఆ పిల్లలు ఇప్పుడు ఎంతో షార్ప్‌గా మారారని ఆర్తి చెబుతోంది. ఒకప్పుడు వారు తాను పెట్టిన స్కూల్‌కు వచ్చేందుకు భయపడేవారని, కానీ ఇప్పుడు తనను చూస్తే పాఠాలు చెప్పమని అడుగుతున్నారని ఆర్తి సంతోషంగా చెబుతోంది. అంతేకాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా వారిని బిచ్చమెత్తుకునేందుకు పంపడం లేదని, అవసరమైతే స్కూల్ ముగిశాక ఏవైనా వస్తువులు అమ్ముకుంటున్నారని ఆర్తి చెబుతోంది. మొదట్లో చిన్న చిన్న అక్షరాలను కూడా సరిగ్గా చదవలేని వారు ఇప్పుడు ఏకంగా పాఠాలను కంఠతా పడుతున్నారని ఆర్తి అంటోంది. నిజంగా ఇదంతా ఆమె సాధించిన విజయమంటే మీరు నమ్మగలరా..? ముంబై వంటి మహానగరంలో ఒక ఫ్లై ఓవర్ కింద పెట్టబడిన మొదటి స్కూల్ గా ఆర్తి స్కూల్ పేరు గాంచింది. ఇప్పుడు ఆమెకు సహాయం అందించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఈ ప్రోత్సాహంతో మరిన్ని పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆర్తి అంటోంది. పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆర్తి చేస్తున్న కృషికి నిజంగా మనం ఆమెకు అభినందనలు తెలపాల్సిందే.