8 ల‌క్ష‌లు దొరికితే…తీసికెళ్లి..పోగోట్టుకున్న వారికి అందించిన టాక్సీ డ్రైవ‌ర్.!!

ల‌క్ష‌ల రూపాయ‌ల‌ న‌గ‌దు, అంతే మొత్తంలో విలువ చేసే బంగారు న‌గ‌లు, ఫోన్లు, అధునాత‌న సాంకేతిక ప‌రిక‌రాలు… ఇవ‌న్నీ ఒకే చోట ఎవ‌రికైనా దొరికితే చాలా మంది ఏం చేస్తారు..? ఎంచ‌క్కా వాటిని తీసుకుని వెన‌క్కి తిరిగి చూడ‌కుండా అక్క‌డి నుంచి జారుకుంటారు. ఇక పుణ్యానికి వ‌చ్చిన డ‌బ్బు, దొరికిన న‌గ‌లు క‌దా, దాంతో జ‌ల్సాలు చేస్తారు. ఇది ఓకే.. చాలా మంది డ‌బ్బు, న‌గలు అలా దొరికితే ఆ విధంగానే ఖర్చు పెడ‌తారు. అయితే ఆ వ్య‌క్తి మాత్రం అలా కాదు, త‌న‌కు దొరికిన న‌గ‌లు, న‌గ‌దును నిజాయితీగా తీసుకెళ్లి ఓన‌ర్‌కు ఇచ్చాడు. ఇంతా చేస్తే అత‌ను ఓ పేద ట్యాక్సీ డ్రైవ‌ర్‌. త‌ల‌పైన వేల రూపాయ‌ల అప్పు ఉన్నా త‌న‌కు దొరికిన ఆ న‌గలు, న‌గదును వెంట తీసుకెళ్ల‌లేదు. నేరుగా వెళ్లి పోలీసుల‌కు అంద‌జేశాడు.

అత‌ని పేరు దేబేంద్ర క‌ప్రి. వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. బీహార్ వాసి. ఢిల్లీలో ఉంటున్నాడు. అక్క‌డే ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని ఒంట‌రిగా నివాసం ఉంటున్నాడు. అత‌ను ట్యాక్సీ న‌డుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవ‌లే ఓ వ్య‌క్తి ఢిల్లీలోని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వ‌ద్ద దేబేంద్ర ట్యాక్సీ ఎక్కాడు. ఈ క్రమంలో అత‌ను ఢిల్లీలోని ప‌హ‌ర్‌గంజ్ ఏరియాలో దిగాడు. అయితే అత‌ను దిగాక కొంత దూరం వెళ్లిన దేబేంద్ర కారులో వెన‌క్కి చూసే స‌రికి బ్యాక్ సీట్‌లో ల‌గేజ్ ఉంది. అందులో రూ.8 ల‌క్ష‌ల విలువ చేసే విదేశీ క‌రెన్సీతోపాటు కొన్ని బంగారు న‌గ‌లు, నూత‌న ఫోన్లు, గ్యాడ్జెట్లు ఉన్నాయి.

దీంతో వాటిని చూసిన దేబేంద్ర ఆ వ్య‌క్తికి వాటిని ఇద్దామ‌ని వెన‌క్కి వెళ్లాడు. అయితే ఆ వ్య‌క్తి అక్క‌డ లేడు. దీంతో దేబేంద్ర తిన్న‌గా స్థానికంగా ఉన్న ఐజీఐ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాడు. జ‌రిగింది చెప్పి వాటిని పోలీసుల‌కు ఇచ్చాడు. పోలీసులు వాటిని ఓన‌ర్‌కు అంద‌జేశారు. దీంతో దేబేంద్ర గొప్ప మ‌న‌స్సుకు, నీతి, నిజాయితీకి ఆశ్చ‌ర్య‌పోయిన రేడియో జాకీ (ఆర్‌జే) న‌వీద్ ఎఫ్ఎం రేడియోలో త‌న షోకు దేబేంద్ర‌ను ఆహ్వానించాడు. అత‌ని గురించిన వివ‌రాల‌ను శ్రోత‌ల‌కు చెప్పాడు. దీంతో దేబేంద్ర గురించిన ఆ వార్త ఒక్క‌సారిగా వైర‌ల్ అయింది. అయితే నిజానికి దేబేంద్ర‌కు రూ.70వేల అప్పు ఉంది. త‌న‌కు దొరికిన ఆ డ‌బ్బుతో అత‌ను త‌న అప్పు తీర్చుకోవ‌డ‌మే కాదు, ద‌ర్జాగా బ‌త‌క‌వ‌చ్చు కూడా. కానీ దేబేంద్ర ఆ ప‌ని చేయ‌లేదు స‌రిక‌దా నిజాయితీగా వ్య‌వ‌హ‌రించి త‌న‌కు దొరికిన న‌గ‌దు, సొత్తును ఓన‌ర్‌కు చేరేలా చేశాడు. దీంతో దేబేంద్ర గురించి తెలుసుకున్న రేడియో శ్రోత‌లు అత‌ని నిజాయితీకి మెచ్చి అత‌నికి స‌హాయం చేశారు. అత‌నికి ఉన్న రూ.70వేల అప్పు తీరేలా అంద‌రూ క‌లిసి విరాళాలు సేక‌రించి అత‌నికి ఇచ్చారు. అదీ మ‌రి.. నిజాయితీకి ద‌క్కిన బ‌హుమానం అంటే.. అంతే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top