మీ సరదా పాడుగాను..తేడా వస్తే…..పాడెక్కుతార్రా!

పిచ్చి ముదిరి పైత్యం త‌ల‌కెక్క‌డం అంటే మీకు తెలుసా..? తెలిసే ఉంటుంది లెండి. అయినా దాని గురించి ఇప్పుడెందుకు అన‌బోతున్నారా..? అవును, మ‌రి. అనాల్సి వ‌స్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం అటువంటిది మ‌రి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ వీడియోలు, ఫొటోల‌కు ఉన్న క్రేజ్ ఎటువంటిదో అంద‌రికీ తెలిసిందే. ఎవ‌రైనా, ఏదైనా విచిత్ర‌మైన‌, అద్భుత‌మైన, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన, ఆలోచ‌నాత్మ‌క‌మైన‌ సంఘ‌ట‌న‌ను వీడియోగానో, ఫొటోగానో తీసి దాన్ని సోష‌ల్ సైట్ల‌లో, ప్ర‌ధానంగా ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తే, ఇక అది అంద‌రి ఖాతాల్లోనూ వైర‌ల్ నృత్యం చేస్తుంది. చాలా మంది ఇలాంటి వైర‌ల్ వీడియోలు, ఫొటోల‌ను ప‌బ్లిసిటీ కోసం లేదంటే తమ గుర్తింపు చాటు కోవ‌డం కోసం లేదా ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల చేస్తారు.

ghaziabad-stunt

అయితే ఇలాంటి వైర‌ల్ కంటెంట్ సృష్టించే స‌మ‌యంలో అంతా బాగా జ‌రిగితే ఫ‌ర్లేదు. కానీ ప్రాణాల‌కు అపాయం క‌లిగితే..? ఇంకేముంది, య‌ముడికి హాయ్ చెప్పాల్సి వ‌స్తుంది. కానీ మ‌నం ఇలా ప్రాణాల గురించి ఆలోచించిన‌ట్టు అంద‌రూ ఆలోచించ‌రు క‌దా..! అలా ఆలోచించ‌కుండా కొంద‌రు చేసే ప‌నులే ఇత‌రుల‌కు కూడా వెన్నులో వ‌ణుకు పుట్టిస్తాయి. అలా వ‌ణుకు పుట్టించే ఓ వైర‌ల్ వీడియోనే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఫేస్‌బుక్ లైక్‌లు, కామెంట్ల కోస‌మో, లేదంటే ప‌బ్లిసిటీ కోస‌మో, లేదా పైన చెప్పిన‌ట్టుగా పిచ్చి ముదిరి పైత్యం త‌ల‌కెక్క‌డ‌మో, ఇంకోటేదో గానీ కొంద‌రు యువ‌కులు ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా చేసిన ఓ స్టంట్ అంద‌రినీ జ‌ల‌ద‌రింప‌జేస్తోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో ఇటీవ‌ల జ‌రిగింది ఆ సంఘ‌ట‌న‌. కాదు, ఆ సంఘ‌ట‌న‌ను కావాల‌నే క్రియేట్ చేశారు. దాన్ని వీడియో తీశారు. కొంద‌రు యువ‌కులు ఓ బ్రిడ్జిపై ఉన్న రైలు ప‌ట్టాల‌పై నిల్చుని త‌మ వైపుకు గంట‌కు 70-80 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకు వ‌స్తున్న ట్రైన్‌ను వెంట్రుక వాసిలో త‌ప్పించుకుని, బ్రిడ్జి కింద‌నే ఉన్న ఓ న‌దిలోకి దూకారు. అనంత‌రం ఎంచ‌క్కా న‌దిలో ఈదుకుంటూ ముందుకు వ‌చ్చేశారు. కాగా రైలు దాదాపుగా అత్యంత స‌మీపంలోకి రాగానే వారు ఒక్క ఉదుటున న‌దిలోకి దూకారు. కానీ అదే స‌మ‌యంలో ఏదైనా త‌ట్టుకుని న‌దిలోకి దూక‌లేక‌పోతే..? అప్పుడు రైలు కింద ప‌డాల్సి వ‌చ్చేది. అంత‌టి ప్ర‌మాద‌క‌ర స్టంట్‌ను చేశారు వాళ్లు. నిజంగా ఇలాంటి స్టంట్స్ చేసే యువ‌కుల‌ను ఏమ‌నాలో మ‌న‌కైతే అర్థం కావ‌డం లేదు, కానీ వారి త‌ల్లిదండ్రుల‌ను చూస్తే జాలేస్తోంది. ఇలాంటి ప్రమాద‌క‌ర స్టంట్స్ చేయ‌కుండా యువ‌కుల‌నే కాదు, ఎవ‌రినైనా క‌ట్టడి చేయాల్సిందే! లేదంటే, వారిని చూసి ఇంకొక‌రు, ఇంకొక‌రు అలా ఇది ఓ జాడ్యంలా త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంటుంది. అంతే క‌దా!

ఘ‌జియాబాద్‌లో యువ‌కులు చేసిన ఆ స్టంట్‌ను కింద చూడ‌వ‌చ్చు…

Comments

comments

Share this post

scroll to top