ఓ విద్యార్థిని చేసిన సాహ‌సం… 111 మంది చిన్నారుల‌ను ర‌క్షించింది…

ఆమె ఓ సాధార‌ణ ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. నిత్యం క‌ళాశాల‌కు వెళ్ల‌డం, రావ‌డం, విద్య‌న‌భ్య‌సించ‌డం, పోటీ ప‌రీక్ష‌కు ప్రిపేర్ అవ‌డం ఇదే ఆమె ప‌ని. అయితేనేం ఆమె చేసిన ఓ ప‌ని వ‌ల్ల ఎంతో మంది చిన్నారులు ర‌క్షింప‌బ‌డ్డారు. బందిఖానా లాంటి ఓ ఫ్యాక్ట‌రీలో బాల‌కార్మికులుగా అత్యంత క‌ఠిన‌మైన ప‌రిస్థితుల్లో బ‌తుకులీడుస్తున్న వారి జీవితాలకు విముక్తి లభించేలా ఆ విద్యార్థిని ఎవ‌రూ చేయ‌ని సాహ‌సాన్ని చేసింది. చివ‌ర‌కు త‌న ప్ర‌య‌త్నం ఫ‌లించి అనుకున్న‌ది సాధించగ‌లిగింది. ఈ క్ర‌మంలో అంద‌రిచేత భేష్ అని కూడా అనిపించుకుంది. ఆమే అహ్మ‌దాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జార్ణ జోషి.

అహ్మ‌దాబాద్‌లో నివాసం ఉండే జార్ణ జోషి స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో బ్యాచిల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (బీబీఏ) విద్య‌ను అభ్య‌సిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఓ రోజు ఉద‌యం బ‌స్ కోసం స్టాప్ వ‌ద్ద వేచి చూస్తుండ‌గా స్కూల్ బ‌స్ లాంటి ఓ బ‌స్సులో ఉన్న చిన్నారుల‌ను గ‌మ‌నించింది. అయితే ఆమె ముందుగా వారిని పాఠశాల‌కు వెళ్తున్న చిన్నారులు అనుకుంది, కానీ కొంత జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించే స‌రికి క‌థ వేరే ఉంద‌ని తెలిసింది. దీంతో ఆమె ఆ పిల్ల‌ల‌ను ఎక్క‌డికి తీసుకువెళ్తున్నారో తెలుసుకోవాల‌నుకుంది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ బ‌స్‌ను ఫాలో అయింది. చివ‌ర‌కు ఆ బ‌స్ గుంటు రోడ్‌లోని సోనాకి సెరామిక్ యూనిట్ అనే ఓ ప‌రిశ్ర‌మ ఎదుట ఆగింది. అందులోంచి ఒక్కొక్క‌రే చిన్నారులు దిగి ఆ ప‌రిశ్ర‌మ‌లోకి వెళ్ల‌డం, అక్క‌డ ప‌నిచేయ‌డం ప్రారంభించ‌డం ఆమె గ‌మ‌నించింది. దీంతో ఒక్క‌సారిగా జార్ణ జోషి షాక్‌కు గురైంది. అయితే ఆ ఫ్యాక్ట‌రీలో ఇంకా ఎంత మంది చిన్నారులు ఉన్నారో తెలుసుకోవాల‌నుకుంది. వారంద‌రినీ ర‌క్షించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

jharna-joshi

ఈ క్ర‌మంలో జార్ణ జోషి అదే ప‌రిశ్ర‌మ‌లో క‌ప్స్‌, సాస‌ర్స్ డిజైన్ వ‌ర్క‌ర్‌గా విధుల్లో చేరింది. దీంతో ఆమెకు ఆ చిన్నారుల‌ను ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించే అవ‌కాశం వ‌చ్చింది. అలా ఆమె దాదాపు 15 రోజుల పాటు ఆ ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేసింది. అక్క‌డ ప‌ని చేస్తున్న వారిలో అధిక శాతం మంది పిల్ల‌లే ఉన్నారని, వారంతా 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపువారే అని గుర్తించింది. కాగా ఈ విష‌యాలే కాకుండా ఆ ప‌రిశ్ర‌మ‌లో చిన్నారులు ప‌డుతున్న బాధ‌ల‌ను ఆమె క‌ళ్లారా చూసి చ‌లించిపోయింది. వారంతా మండే ఎండ‌లో మిట్ట మ‌ధ్యాహ్నం కూడా ప‌నిచేస్తుండ‌డం, క‌నీసం వారికి తాగేందుకు నీరు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం, బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఎలాంటి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం వంటి నానా హింస‌ల‌కు గుర‌వుతున్న చిన్నారుల‌ను చూసి ఆమె జాలిప‌డింది. అలా ఆ 15 రోజుల్లో ఆ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని వివ‌రాలు సేక‌రించి చివ‌రాఖ‌రికి పోలీసులు, సోష‌ల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌, లేబ‌ర్‌, ఎంప్లాయ్‌మెంట్ విభాగం, ఫ్యాక్ట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్‌, చైల్డ్ లేబ‌ర్ ఆఫీస‌ర్ వంటి అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారుల‌కు ఒకేసారి స‌మాచార‌మిచ్చింది. వారంతా ఒకేసారి వ‌చ్చి ఆ ప‌రిశ్ర‌మ మీద రైడ్ చేశారు. దీంతో అక్క‌డ పిల్ల‌లతో ప‌నిచేయిస్తున్న వారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ క్ర‌మంలో ఆ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న దాదాపు 111 మంది చిన్నారుల‌ను ప్ర‌భుత్వ అధికారులు ర‌క్షించారు. జార్ణ జోషి చేసిన సీక్రెట్ ఆప‌రేష‌న్‌కు ఆయా శాఖ‌ల అధికారులు ఆమెను ఎంత‌గానో మెచ్చుకున్నారు. కాగా ఆ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అతి పెద్ద చైల్డ్ లేబ‌ర్ రెస్క్యూ ఆప‌రేష‌న్ అని అక్క‌డి అధికారులు తెలియ‌జేశారు. నిజంగా జార్ణ జోషి చూపిన ధైర్య సాహ‌సాల‌కు, తెగువ‌కు, అంత‌మంది చిన్నారుల‌ను రక్షించినందుకు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top