సమాజ సేవ చేయడం ద్వారా వచ్చే మానసిక సంతృప్తిని నిజంగా ఎవరూ ఏ విధంగానూ పొందలేరు. ఆ సేవ చేయడంలో ఎంతో అనుభూతి ఉంది. అప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించరానిది. అందుకనే అలాంటి ఆనందం పొందడం కోసం ఆ యువకుడు రోజూ ఎంతో మంది పేదల కడుపు నింపుతున్నాడు. నిత్యం వేయి మందికి అతను ఉదయాన్నే అల్పాహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. అతని పేరు మహమ్మద్ సుజాతుల్లా. ఇతను హైదరాబాద్ వాసి..!
హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సుజాతుల్లా (24) ఇంజనీరింగ్ విద్యార్థి. అల్లాను గట్టిగా నమ్మే వ్యక్తి కావడంతో తనకు ఉన్న ఒకే ఒక బ్యాక్‌లాగ్‌ను తొలగించమని అల్లాను ప్రార్థించి మరీ ఎగ్జామ్ రాశాడు. ఆశ్చర్యం.. ఎగ్జామ్ పాసయ్యాడు. బ్యాక్‌లాగ్స్ లేవు. దీంతో అతను అల్లా మెచ్చే విధంగా సమాజ సేవ చేయాలని అనుకున్నాడు. అప్పుడు పుట్టిందే ఆ ఆలోచన. దాని ప్రకారమే అతను రోజూ ఎంతో మంది కడుపు నింపుతున్నాడు.
నిత్యం మహమ్మద్ సుజాతుల్లా సుమారుగా 1000 మంది ఆకలి తీరుస్తున్నాడు. రోజూ 20 కేజీల ఉప్మా రవ్వతో ఉప్మా చేయడం, చట్నీ, ఉప్మాను వాహనంలో పెట్టుకోవడం, హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రితోపాటు మరో ఆస్పత్రి ఎదుట ఆకలిగొన్న పేదలకు ఆ ఉప్మాను పెట్టడం.. అందులోనే తాను కొంత తినడం.. తరువాత కాలేజీకి వెళ్లడం.. ఇదీ అతని దిన చర్య. అతను ఇలా 2016 నుంచి వరుసగా 554 రోజుల పాటు ఏ రోజు కూడా మిస్ అవకుండా నిత్యం పేదలకు అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నాడు. తనను అల్లా పాస్ చేయించినందునే దేవుడు మెచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానని అతను చెబుతున్నాడు.
అయితే ఇంత చేయడానికి సుజాతుల్లాకు నిధులు ఎక్కడివి ? అనేగా మీ సందేహం. చాలా వరకు అతనికి నిధులు వస్తాయి. విరాళాలు వస్తుంటాయి. ఇక అవి లేనప్పుడు తనకు తెలిసిన వారో, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు లేదా తన స్నేహితుల్లో ఎవరైనా సహాయం చేస్తారు. అంతేకానీ.. డబ్బులు లేవని చెప్పి ఏ రోజూ ఈ కార్యక్రమాన్ని అతను ఆపలేదు. ఇక ముందు కూడా ఇలాగే చేస్తానని అతను అంటున్నాడు. ఇక ఇతను చేస్తున్న పనికి మెచ్చి కొందరు వాలంటీర్లుగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారట. ఇక మరికొందరు అయితే సోషల్ మీడియాలో ఇతని గురించి చదివి తమ ప్రాంతాల్లోనూ ఇలాగే పేదలకు ఆహారం అందజేస్తున్నారట. ఏది ఏమైనా.. సుజాతుల్లా ఇలాంటి గొప్ప పని చేస్తున్నందుకు అతన్ని మనం అభినందించాల్సిందే కదా..!