ఉగ్ర‌దాడిలో వీర‌మ‌ర‌ణం పొందిన ఆ సైనికుడికి ల‌భించిన అత్యున్న‌త స్థాయి గౌర‌వం అశోక్ చ‌క్ర‌..!

అది జమ్మూ కాశ్మీర్‌లోని అత్యంత చ‌ల్ల‌నైన ప్ర‌దేశం. మంచుతో కప్ప‌బ‌డి ఉన్న ప్రాంతం. స‌ముద్ర మ‌ట్టానికి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న మంచు కొండ‌ల‌వి. రాత్రి పూట న‌లుగురు ఉగ్ర‌వాదులు ఆ కొండ ద్వారా భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు య‌త్నించారు. వారి క‌ద‌లికల‌ను ప‌సిగ‌ట్టిన ఓ సైనికాధికారి వెంట‌నే సిబ్బందిని అల‌ర్ట్ చేసి వారికి నాయ‌క‌త్వం వ‌హిస్తూ ఉగ్ర‌వేట సాగించాడు. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాదులపై మెరుపు దాడి చేస్తూ ముగ్గుర్ని మ‌ట్టుబెట్టాడు. నాలుగో ఉగ్ర‌వాదిని ప‌ట్టుకోబోయే స‌రికి బుల్లెట్ల వ‌ర్షానికి గుర‌య్యాడు. అయినా మ‌రణించే చివ‌రి క్ష‌ణాల వ‌ర‌కు దేశం కోస‌మే ఆ సైనికుడు ప‌నిచేశాడు. త‌న‌ను గాయాల‌కు గురి చేసిన ఉగ్ర‌వాదిపై బుల్లెట్ల వ‌ర్షం కురిపించి అత‌న్ని కూడా గాయాల పాలు చేశాడు. అనంత‌రం ప్రాణాలొదిలాడు. అత‌ను చేసిన సాహ‌సం వ‌ల్లే ఆ రోజు భార‌త్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. లేదంటే పెద్ద ఎత్తున ఆయుధాలతో ఆ ఉగ్ర‌వాదులు మ‌న భూభాగంలోకి చొర‌బ‌డేవారు. ఆ త‌రువాత ఏం జ‌రిగి ఉండేదో అంద‌రికీ తెలిసిందే. ఇంత‌కీ… దేశం కోసం అంత‌టి ప్రాణ త్యాగం చేసిన ఆ వీర సైనికుడు ఎవ‌రో తెలుసా..? అత‌నే హ‌వ‌ల్దార్ హంగ్‌ప‌న్ దాదా.

HAVILDAR-HANGPAN-DADA

జ‌మ్మూ కాశ్మీర్‌లో అలా ఉగ్ర‌వాదులతో పోరాడి వీర మ‌ర‌ణం పొందినందుకు గాను దాదాకు గ‌తేడాది ఆగ‌స్టు 15న అశోక్ చ‌క్ర బిరుదును ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే జ‌న‌వ‌రి 26, 2017 గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణికి ఆ మెడ‌ల్‌ను భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంద‌జేశారు. అశోక్ చ‌క్ర అనేది ఆర్మీలో అత్యున్న‌త స్థాయి పుర‌స్కారం. అంత‌టి త్యాగం చేశాడు కాబ‌ట్టే అలాంటి అత్యున్న‌త స్థాయి పుర‌స్కారం దాదాకు ల‌భించింది.

ashok-chakra

రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిన రోజుగా మ‌నం గ‌ణతంత్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో హ‌వ‌ల్దార్ హంగ్‌ప‌న్ దాదా లాంటి వీర సైనికుడికి అంత‌టి పుర‌స్కారం ల‌భించ‌డం నిజంగా అభినంద‌నీయం. అలాంటి వీర సైనికుల‌ను మ‌నం ఈ సంద‌ర్భంగా క‌చ్చితంగా ఓసారి స్మ‌రించుకోవాల్సిందే. నిజానికి దాదా గ‌తేడాది మే లోనే జ‌మ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియ‌న్‌లో చేరాడు. అనంత‌రం మే 27, 2016న ఉగ్ర‌వాదుల‌తో పోరు స‌లిపి వీర మ‌ర‌ణం పొందాడు. అలాంటి సైనికుల‌కు మ‌నం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top