ఎక్కువ చార్జిల పట్ల వినియోగ‌దారులు సుల‌భంగా ఫిర్యాదు చేయ‌వ‌చ్చిలా..!

బెంగుళూరులోని కోర‌మంగ‌ళ అనే ప్రాంతంలో ఉన్న పాష్ రెస్టారెంట్ అది. దాని పేరు ఏషియా కిచెన్. ర‌వి అనే వ్య‌క్తి త‌న స్నేహితుల‌తో క‌ల‌సి అక్క‌డికి డిన్న‌ర్‌కు వెళ్లాడు. డిన్న‌ర్ పూర్త‌యింది. బేరర్ ఇచ్చిన బిల్లును చూసి ర‌వి అవాక‌య్యాడు. కార‌ణం… బిల్లులో 5 మిన‌రల్ వాట‌ర్ బాటిల్స్‌కు రూ.450 బిల్ వేశారు. వాటికి మ‌హా అయితే 5 x 20 = 100, ట్యాక్స్ క‌లుపుకుని మ‌రో రూ.20 లేదా రూ.30 క‌న్నా ఎక్కువ కాదు. అంటే 5 వాట‌ర్ బాటిల్స్‌కు ట్యాక్స్‌తో క‌లిపి రూ.130 అనుకున్నా వారు వేసింది చాలా ఎక్కువ బిల్ అని ఇట్టే అర్థ‌మ‌వుతుంది. దీంతో ర‌వి ఊరుకోలేదు. వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

extra-charge

పైన చెప్పిన ర‌వి మాత్ర‌మే కాదు, ఇంకా ఇలాంటి ఘ‌ట‌నలు ఇది వ‌ర‌కు అనేకం చోటు చేసుకున్నాయి. హైద‌రాబాద్‌లోనే ఇలా ఓ హోట‌ల్ వారు వాట‌ర్ బాటిల్స్‌కు కొన్ని వంద‌ల రెట్లు చార్జి ఎక్కువ‌గా వేసి వ‌సూలు చేస్తే ఆ హోట‌ల్‌పై వినియోగ‌దారులు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి రూ.20వేల జ‌రిమానా కూడా ప‌డింది. అయితే… నిజానికి ఇలా వాట‌ర్ బాటిల్స్‌కు వ్యాపారులు ఎక్కువ వ‌సూలు చేయ‌డం ఇప్ప‌టిది కాదు. ఎప్ప‌టి నుంచో జ‌రుగుతుందే. కానీ… దీని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫ‌లితంగా హోట‌ల్స్‌తోపాటు సినిమా హాల్స్‌, బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల‌లో వీటి ద్వారా దోపిడీ ఎక్కువైంది. అయితే ఇప్పుడిప్పుడే జ‌నాల్లో మార్పు వ‌స్తోంది.

extra-charge-1

ఒక‌ప్ప‌టిలా ఎవ‌రూ చేతులు ముడుచుకుని కూర్చోవ‌డం లేదు. ధైర్యంగా అన్యాయంపై ఫిర్యాదు చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ఉందిగా. దాని ప‌వ‌ర్‌ను ఉప‌యోగించి అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారికి చుక్క‌లు చూపిస్తున్నారు. అయితే ఎవ‌రైనా అంత‌లా వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే మొన్నామ‌ధ్యే కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు కూడా. వ్యాపారులు ఎవ‌రైనా అలా ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా చార్జిలు వ‌సూలు చేస్తే వెంట‌నే చూస్తూ ఊరుకోవ‌ద్ద‌ని, ఫిర్యాదు చేయాల‌ని చెప్పారు. మరి… మీకూ అలాంటి ఘ‌ట‌న‌లు ఏవైనా ఎదుర‌వుతున్నాయా..? అయితే సందేహించ‌కండి. వెంట‌నే http://consumerhelpline.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు ఎదుర్కొన్న ఇబ్బందిని ఫిర్యాదు చేయండి. సంబంధిత అధికారులు 2 రోజుల్లోగా మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అందిస్తారు.

consumer-complaint

పైన చెప్పిన వెబ్‌సైట్‌లో వినియోగ‌దారులు ముందుగా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట‌ర్ చేసుకున్నాక అందులోకి లాగిన్ అయి త‌మ ఫిర్యాదును రిజిస్ట‌ర్ చేయ‌వ‌చ్చు. దాని స్థితి గ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాకింగ్ కూడా చేసుకోవ‌చ్చు. అయితే వెబ్‌సైట్ ద్వారా వీలు కాక‌పోతే 1800 11 4000 లేదా 14404 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ల‌కు కాల్ చేసి త‌మ స‌మ‌స్య‌ను తెల‌ప‌వ‌చ్చు. ఇవి ప్ర‌తి రోజు ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల మ‌ధ్య ప‌నిచేస్తాయి. హాలిడేల‌లో ఉండ‌వు. అలా కూడా కాద‌నుకుంటే 8130009809 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేసినా చాలు. అధికారులు స్పందిస్తారు. ఈ మాధ్య‌మాల ద్వారా వినియోగ‌దారులు త‌మ‌కు ఎదురయ్యే స‌మ‌స్య‌ల‌కు ఫిర్యాదులు చేసి ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top