ఆ సైంటిస్టు రైతుగా మారాడు… అనుకున్న‌ది సాధించాడు… ఎందుకో తెలుసా..?

కృత్రిమ ఎరువులు, ర‌సాయ‌నాలు వాడి పండించ‌న పంట‌ల‌తో మ‌న ఆరోగ్యానికే కాదు, ప‌ర్యావ‌రణానికి కూడా ఎంత‌గానో న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ మ‌న దేశంలో ఎక్కువ‌గా ఈ త‌ర‌హాలోనే పంట‌ల‌ను పండిస్తున్నారు. అయితే ఇలా పంట‌ల‌ను వేయ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను తెలియ‌జేయ‌డం కోసం, ఆర్గానిక్ ఫార్మింగ్‌పై రైతుల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ఆ సైంటిస్టు ఏకంగా రైతులా మారాడు. ఆ క్ర‌మంలోనే ఎంతో మంది రైతుల‌కు ఆయ‌న మేలు చేశాడు. దీంతో చాలా మంది రైతులు ఇప్పుడు సేంద్రీయ ఎరువుల‌తో పంట‌ల‌ను పండించ‌డం మొద‌లు పెట్టారు. ఆ సైంటిస్టు స్ఫూర్తితో చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఆయ‌న పేరు డాక్ట‌ర్ జి.న‌మ్మ‌ల్వార్‌. త‌మిళనాడులోని తంజావూరు జిల్లా ఎలంగాడు గ్రామంలో 1938లో జ‌న్మించాడు. న‌మ్మ‌ల్వార్ విద్యాభ్యాసం పూర్తి అవ‌గానే కొవిల్‌ప‌ట్టి అనే ప్రాంతంలో ఉన్న అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీజ‌న‌ల్ రీసెర్చి స్టేష‌న్‌లో సైంటిస్టుగా చేరాడు. ఈ క్ర‌మంలోనే రైతులు పంట‌ల‌ను ఎలా పండిస్తున్నారో తెలుసుకునేవాడు. కృత్రిమ ఎరువులు, ర‌సాయ‌నాలు వేసిన పంట‌ల‌తో అనేక న‌ష్టాలు వ‌స్తుండ‌డాన్ని ఆయ‌న గ‌మ‌నించాడు. అలా పంట‌ల‌ను వేస్తే నీరు ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతుంది. ఒక వేళ అంతా క‌రెక్ట్‌గా అయినా పంట దిగుబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది. దీనికి తోడు అలా ర‌సాయ‌నాలు వేసి పండించడం వల్ల ఆ పంట‌ల‌తో మ‌న శ‌రీర ఆరోగ్యం పాడ‌వుతుంది. ప‌ర్యావ‌ర‌ణానికి కూడా న‌ష్ట‌మే జ‌రుగుతుంది. ఇదే విష‌యాల‌ను గ‌మ‌నించిన న‌మ్మ‌ల్వార్ రైతుల‌ను ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ప‌ట్ల మ‌ళ్లించ‌డానికి పూనుకున్నాడు. అందుకోసం ఆయ‌న విదేశాల‌లో ప‌ర్య‌టించాడు. అక్క‌డ కేవ‌లం సేంద్రీయ ఎరువుల‌నే వాడి పూర్తి స‌హ‌జ సిద్ధ ప‌ద్ధ‌తుల్లో వ్య‌వ‌సాయం ఎలా చేస్తున్నారో తెలుసుకున్నాడు. దీంతో తిరిగి ఇండియాకు వ‌చ్చి అవే మెళ‌కువ‌ల‌ను రైతుల‌కు చెప్పాడు.

అయితే రైతుల‌కు న‌మ్మ‌ల్వార్ చెప్పిన ప‌ద్ధ‌తులపై న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. దీంతో న‌మ్మ‌ల్వార్ ఏం చేశాడంటే ఆయ‌న రైతులా మారాడు. వేషం, భాష అన్నీ మార్చేశాడు. ప‌దుకొట్టాయ్ అనే జిల్లాలో సొంతంగా 10 ఎక‌రాల బంజ‌రు భూమి కొన్నాడు. అందులో స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధతుల‌తో వ్య‌వ‌సాయం చేయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో త్వ‌ర‌గానే ఆయ‌న పాటించిన ప‌ద్ధ‌తులు స‌త్ఫ‌లితాల‌నిచ్చాయి. బంజ‌రు భూమిగా ఉన్న ఆ ప్రాంతం ప‌చ్చ‌ద‌నంతో నిండేస‌రికి రైతుల‌కు కూడా ఆయ‌న ప‌ట్ల విశ్వాసం పెరిగింది. దీంతో వారు ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి ఆర్గానిక్ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను తెలుసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో ఆ ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం వ‌ల్ల పంట‌ల‌కు నీరు త‌క్కువ‌గా అవ‌సరం ఉండ‌డ‌మే కాదు, ఖ‌ర్చు కూడా త‌క్కువ‌గా వ‌స్తుంద‌ని, దిగుబ‌డి పెరుగుతుంద‌ని రైతులు గ్ర‌హించారు. అలా ఆ నోటా ఈ నోటా అంతటా న‌మ్మ‌ల్వార్ గురించి తెలిసింది. దీంతో ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి అంద‌రూ సేంద్రీయ ప‌ద్ధతుల ద్వారా వ్యవ‌సాయం చేయ‌డం ఎలాగో నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో అన‌తి కాలంలోనే ఆయన అలా త‌మిళ‌నాడు చుట్టూ ఉన్న ఇత‌ర రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లోనూ స్వ‌యంగా ఆ మెళ‌కువ‌ల‌ను చెప్ప‌డం ప్రారంభించారు. దీంతో అనేక చోట్ల ఇప్ప‌టికీ ఆయ‌న చెప్పిన ప‌ద్ధ‌తుల్లో ఆర్గానిక్ వ్య‌వ‌సాయం చేస్తున్నారు రైతులు. అయితే డిసెంబ‌ర్ 30, 2013 న ఆయ‌న అనుకోకుండా మృతి చెందారు. అయిన‌ప్ప‌టికీ నేటికీ ఆయ‌న చెప్పిన ఆర్గానిక్ వ్య‌వసాయ ప‌ద్ధ‌తులు మాత్రం సజీవంగానే ఉన్నాయి. చాలా మంది రైతులు వాటిని ఇప్ప‌టికీ అనుస‌రిస్తూనే ఉన్నారు..!

Comments

comments

Share this post

scroll to top