తనకొచ్చిన PF మొత్తాన్ని గ్రామానికి రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన ఆర్మీ ఉద్యోగి.

మ‌న దేశంలో ప‌ట్ట‌ణాలు, న‌గరాల్లో ఉన్న రోడ్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ గుంత‌లు, మ్యాన్‌హోల్స్ పైకి లేచి, ప్యాచ్ వ‌ర్క్‌తో రంధ్రాలు ప‌డి… ఇంకా చెప్పాలంటే ఇదిలా సాగుతూనే ఉంటుంది. కాంట్రాక్ట‌ర్ల క‌క్కుర్తి, ప్ర‌భుత్వ అధికారుల నిర్లక్ష్యం వెర‌సి ఎక్క‌డ చూసినా రోడ్ల ప‌రిస్థితి అధ్వాన్నంగానే ఉంది. అయితే ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో ఉన్న రోడ్లే ఇలా ఉంటే ఇక గ్రామాల్లో ఉండే రోడ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అక్క‌డ రోడ్లే ఉండ‌వు కాబ‌ట్టి. మ‌ట్టిబాటే గ్రామ‌వాసుల‌కు ర‌హ‌దారి. ఆ దారిలోనే వెళ్లాలి. రావాలి. ఇక వర్షం ప‌డితే అంతే సంగ‌తులు. మోకాళ్ల లోతుకు దిగ‌బ‌డాల్సిందే. అదీ గ్రామాల్లోని ర‌హ‌దారుల ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో స‌రిగ్గా ఇలాంటి స్థితిలో ఉన్న ఓ గ్రామ ర‌హ‌దారిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించాడు ఆ వ్య‌క్తి. అత‌నే బ‌గ్గూరాం మౌర్యా. మాజీ సైనికాధికారి..!

Bhagguram-Maurya

వార‌ణాసిలోని హీరాంపూర్ గ్రామంలో నివాసం ఉండే బ‌గ్గూరాం మౌర్యా 1978లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2012లో లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ క్ర‌మంలో అత‌ను 2002లో ఒక‌సారి, 2012లో మ‌రోసారి అప్ప‌టి రాష్ట్ర‌ప‌తులు అబ్దుల్ క‌లాం, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీల చేతుల మీదుగా మెడ‌ల్స్‌ను కూడా అందుకున్నాడు. అనంత‌రం ఉద్యోగం నుంచి రిటైర్ అయినందుకు గాను అత‌నికి రూ.4 ల‌క్ష‌ల పీఎఫ్ కూడా వ‌చ్చింది. అయితే ఆ మొత్తాన్ని అత‌ను త‌న‌కు గాను, త‌న కుటుంబానికి గానీ వాడుకోలేదు. త‌మ గ్రామంలో ర‌హ‌దారి బాగాలేక‌పోవ‌డంతో ఆ డ‌బ్బుల‌ను ర‌హ‌దారి నిర్మాణానికి వినియోగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.

అయితే బ‌గ్గూరాం మౌర్యా ఆ ర‌హ‌దారి నిర్మాణాన్ని స్వాతంత్ర్య దినోత్స‌వ కానుక‌గా త‌న గ్రామ ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న‌ట్టు తెలిపాడు. ఈ క్ర‌మంలో చాలా వ‌ర‌కు ర‌హ‌దారి నిర్మాణం పూర్త‌యింది. కానీ ఇంకా కొంత పెండింగ్ ఉండ‌డంతో దానికి బ‌గ్గూరాం మౌర్యా వ‌ద్ద ఉన్న డ‌బ్బులు స‌రిపోలేదు. దీంతో ఆ రోడ్డు నిర్మాణం అక్క‌డికి ఆగిపోయింది. అయినా అత‌ను త‌న ప్ర‌య‌త్నం విడిచిపెట్ట‌లేదు. ఎలాగైనా త‌మ గ్రామ ర‌హ‌దారిని పూర్తి చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి విన్న‌వించాడు. మ‌రి బ‌గ్గూరాం మౌర్యా విన‌తికి ప్ర‌భుత్వ అధికారులు, నాయ‌కులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా వృద్ధాప్యంలో త‌న‌కు వ‌చ్చిన పీఎఫ్ డ‌బ్బును సొంత అవ‌స‌రాల‌కు వాడుకోకుండా సామాజిక సేవ‌కై వినియోగించిన బ‌గ్గూరాం మౌర్యా ఆద‌ర్శాన్ని మ‌న‌మంద‌రం అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top