ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు గొప్ప మనసు, అంతకు మించిన ధైర్యం, తెగువ ఉంటే చాలు. మిగతావేవీ అక్కర్లేదు. ప్రాణాపాయంలో ఉన్న వారినైతే వారు ఎలాంటి వారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, వారిని కాపాడితే తమకేం వస్తుంది అని అనుకోకుండా వెంటనే సహాయం చేయాలి. అదే నిజమైన మానవత్వం అనిపించుకుంటుంది. పంజాబ్‌కు చెందిన ఆ యువకుడు సరిగ్గా అలాగే చేశాడు. అయితే అతను కాపాడింది మాత్రం మనిషిని కాదు. ఓ కుక్కని. అవును, కుక్కనే. ఇంతకీ అందులో విశేషమేముందీ అంటారా? అవును, ఆ సంఘటనలో నిజంగానే చెప్పుకోవాల్సిన ఓ విశేషముంది. అదేమిటంటే…
పంజాబ్ రాష్ట్రానికి చెందిన శర్వాణ్ సింగ్ అనే ఓ 28 ఏళ్ల యువకుడు ఇటీవలే ఓ రోజు తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. కాగా మార్గమధ్యలో ఓ కాలువ వద్ద జనాలు బాగా గుమి గూడి ఉండడాన్ని అతను గమనించాడు. దీంతో అతను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భావించి కారులోంచి దిగి అక్కడికి వెళ్లాడు. అక్కడ ఉన్న కాలువలో ఓ కుక్క అప్పటికే పడిపోయి ఉంది. ఎంతో సేపటి నుంచి అది ఆ కాలువలో కొట్టుకుంటున్నా నీటి ప్రవాహం వల్ల రాలేకపోతోంది. దీంతో అది మునిగి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలోనే అక్కడికి వచ్చి దాన్ని చూసిన శర్వాణ్ సింగ్ ఎలాగైనా ఆ కుక్కను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతనికి ఈత రాదు. అయినా సరే ఏదో విధంగా కుక్కను కాపాడాలని ముందుకు వెళ్లాడు.
అప్పుడే తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. అదే టర్బన్. అవును, శర్వాణ్సింగ్ స్వతహాగా సిక్కు వర్గానికి చెందిన వాడు కావడంతో నిత్యం విధిగా టర్బన్‌ను ధరిస్తున్నాడు. దీంతో తన తలకు ఉన్న ఆ పొడవాటి టర్బన్‌ను విడదీసి దాని సహాయంతో ఆ కుక్కను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతను కాలువ వైపు అడుగులు వేస్తూ టర్బన్‌ను తీశాడు. దాని ఒక చివరని పట్టుకోమని స్నేహితులకు చెప్పాడు. వారు అలాగే చేశారు. అనంతరం శర్వాణ్సింగ్ కాలువ గట్టుపై ఏటవాలుగా వాలి టర్బన్ రెండో చివరను పట్టుకుని మరో గుడ్డ సహాయంతో నీటిలో ఉన్న కుక్కను ఎలాగోలా బయటికి లాగాడు.
అయితే శర్వాణ్సింగ్ చేసిన ప్రయత్నం ఫలించింది. కుక్క బయటికి వచ్చినా ఏమాత్రం ప్రాణాపాయం లేకుండా సురక్షితంగానే ఉంది. దీన్ని చూసిన శర్వాణ్సింగ్ తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించాడు. కాగా సిక్కు మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో లేదా స్నానం చేసే సమయంలో మాత్రమే టర్బన్‌ను తీయాల్సి ఉంటుంది. కానీ శర్వాణ్సింగ్ మాత్రం అదేమీ ఆలోచించలేదు. ఓ మూగ జీవిని ఎలాగైనా రక్షించాలనే తపనతో తన మత విశ్వాసాలను కూడా పక్కన పెట్టి ఆ కుక్కను ప్రాణాపాయం నుంచి కాపాడాడు. నిజంగా శర్వాణ్సింగ్ చేసిన పనికి అతన్ని మనం అభినందించాల్సిందే కదా!
శర్వాణ్సింగ్ కుక్కను రక్షించిన వీడియోను కింద వీక్షించవచ్చు…