కోమాలోకి వెళ్లిన వారు బ‌త‌క‌డం చాలా క‌ష్టం… అయినా ఆ వ్య‌క్తి కోమా నుంచి బ‌య‌ట ప‌డి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు…

ఎవ‌రైనా ఓ వ్య‌క్తి కోమాలోకి వెళ్ల‌డ‌మంటే ఇక ఆ వ్య‌క్తి బ‌తికే అవ‌కాశం దాదాపుగా లేనట్టే. కోమాలోకి వెళ్లిన వ్య‌క్తులకు బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధం ఉండ‌దు. అదో దీర్ఘ‌కాలిక నిద్రావ‌స్థ‌. చాలా వ‌ర‌కు కేసుల్లో కోమాలోకి వెళ్లిన వారు చ‌నిపోవ‌డ‌మే త‌ప్ప బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన వారు లేరు. కార‌ణాలు ఏమున్నా ఒక సారి ఏ వ్య‌క్తి అయినా కోమాలోకి వెళ్తే ఆ వ్య‌క్తి కుటుంబ స‌భ్యులు ఇక వారిపై ఆశ‌లు వ‌దిలి పెట్టుకుంటారు. సౌతాఫ్రికాకు చెందిన ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా ఇలాగే కోమాలోకి వెళ్లాడు. ఎన్నో ఏళ్లు అలా కోమాలోనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో అత‌ని కుటుంబ స‌భ్యులు అత‌నిపై ఆశ‌లు వ‌దిలి పెట్టుకున్నారు. అత‌ను చ‌నిపోతాడ‌నే అంతా భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. విచిత్రంగా అత‌ను కోమా నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడు సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నాడు. అత‌నే మార్టిన్ పిస్టోరియ‌స్.

martin

సౌతాఫ్రికాలో 1975లో జన్మించిన మార్టిన్ పిస్టోరియ‌స్ 12 ఏళ్ల వ‌య‌స్సులో ఉండ‌గా అత‌ని శ‌రీర కండ‌రాలు ప‌నిచేయ‌కుండా అయ్యాయి. దీంతో అత‌ను న‌డ‌వ‌లేని ప‌రిస్థితికి చేరుకున్నాడు. క్ర‌మ క్ర‌మంగా మాట పోయింది. చేతులు ప‌నిచేయ‌కుండా పోయాయి. చివ‌రికి కోమాలోకి వెళ్లాడు. దీంతో అతన్ని త‌ల్లిదండ్రులు హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అయితే డాక్ట‌ర్లు కూడా మార్టిన్‌కు ఏమైందో స‌రిగ్గా చెప్ప‌లేక‌పోయారు. దీంతో మార్టిన్ 3 ఏళ్ల పాటు కోమాలోనే ఉన్నాడు. అయితే అలా 3 ఏళ్లు గ‌డిచాక అత‌ను కొద్ది కొద్దిగా తేరుకోవ‌డం మొద‌లు పెట్టాడు. కానీ అవ‌య‌వాలేవీ ప‌నిచేయ‌లేదు. అలా అత‌ను కేవ‌లం కళ్ల‌తోనే సైగ‌లు చేసి చెప్ప‌డానికి మ‌రో 4 ఏళ్లు ప‌ట్టింది. అప్పుడు అత‌నికి 19 ఏళ్లు. ఆ వ‌య‌స్సులో పూర్తిగా స్పృహ‌లోకి వ‌చ్చాడు. కానీ కేవ‌లం క‌ళ్ల‌తోనే ఇత‌రుల‌తో మాట్లాడేవాడు.

మార్టిన్ ప‌రిస్థితి చూసిన అత‌ని త‌ల్లిదండ్రులు అత‌ను చ‌నిపోతాడ‌ని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే క‌ళ్ల‌తో సైగ‌లు చేయ‌డం మొద‌లు పెట్టాడో అప్పుడు వారికి మార్టిన్ ప‌ట్ల ఓ అవ‌గాహ‌న వ‌చ్చింది. దీంతో అత‌న్ని యూనివ‌ర్సిటీ ఆఫ్ ప్రిటోరియాకు ప‌లు ప‌రీక్ష‌ల నిమిత్తం పంపారు. అయితే అక్క‌డ వైద్యులు ప‌రీక్ష‌లైతే చేశారు కానీ అత‌ని వ్యాధిని న‌యం చేయ‌లేక‌పోయారు. అయినా మ‌రో 3 ఏళ్ల‌కు ఆశ్చ‌ర్యంగా అత‌నికి చేతులు ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టాయి. కానీ కాళ్ల‌తో న‌డ‌వ‌లేక‌పోయాడు. ఇత‌ర అవ‌య‌వాలు కూడా నెమ్మ‌దిగా స్పందించ‌డం మొద‌లు పెట్టాయి. కానీ నోటితో మాట్లాడ‌లేక‌పోయాడు. దీంతో త‌ల్లిదండ్రులు అత‌నికి ఓ స్పీచ్ కంప్యూట‌ర్‌ను ఇచ్చారు. దాని స‌హాయంతో మార్టిన్ ఇత‌రుల‌తో మాట్లాడేవాడు. ఈ క్ర‌మంలో అత‌ను ప‌లు కంప్యూట‌ర్‌ కోర్సుల‌ను అభ్య‌సించ‌డం, ఓ యువ‌తిని వివాహం చేసుకోవ‌డం అన్నీ అయిపోయాయి. కాగా 2011లో మార్టిన్ ‘ఘోస్ట్ బాయ్(Ghost Boy)’ పేరిట సొంతంగా ఓ పుస్త‌కం కూడా రాశాడు. అందులో త‌న కోమా గురించిన విష‌యాల‌ను, అప్పుడు తాను ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్న‌దీ క్షుణ్ణంగా వివ‌రించాడు. కాగా మార్టిన్ ఇప్ప‌టికీ స‌ద‌రు స్పీచ్ కంప్యూటర్‌తోనే ఇత‌రుల‌తో మాట్లాడుతున్నాడు. కాళ్లు ప‌నిచేయ‌క పోవ‌డంతో వీల్ చెయిర్‌కే ప‌రిమితమ‌య్యాడు. అయినా తాను అభ్య‌సించిన కోర్సుల‌తో ఫ్రీలాన్స్ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌, డిజైన‌ర్‌, రైటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌ను యూకేలో భార్య‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. కోమాలోకి వెళ్లి చ‌నిపోతాడ‌నుకున్న వ్య‌క్తి నేడు అంద‌రిలా తిరుగుతుండ‌డం విశేష‌మే మ‌రి! దానంత‌టికీ మార్టిన్ దృఢ సంకల్ప‌మే కార‌ణం. కాదంటారా!

Comments

comments

Share this post

scroll to top