అతను చదివింది 3వ తరగతే… కానీ ఏకంగా హెలికాప్టర్‌నే తయారు చేశాడు…

ఎవరూ ఆవిష్కరించని విధంగా కొత్త ప్రయోగాలు చేసి అద్భుతాలు సృష్టించే సృజనాత్మక శక్తి ఉండాలే గానీ అందుకు విద్యార్హతలతో పనిలేదని నిరూపించాడు ఆ వ్యక్తి. చదువుకున్నది కేవలం 3వ తరగతే అయినా ఇంజినీర్లకు తాను ఏ మాత్రం తీసిపోనని ప్రతిభ చాటాడు. సిటీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న తమ గ్రామం కోసం 3 ఏళ్ల పాటు తీవ్రంగా శ్రమించి అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. అతనే చంద్ర శివకోటి శర్మ.

chandra-shiva-koti-sharma-heli

అస్సాంలోని ధేమాజీ జిల్లాలో ఉన్న దిమోవ్ గ్రామంలోని చంద్ర శివకోటి శర్మ వృత్తి రీత్యా ఓ వెల్డర్. దాంతోనే అతను తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా తమ గ్రామం గౌహతి నగరానికి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఓ మారుమూల ప్రాంతంలో ఉంటుంది. దీంతో వారికి నగర సౌకర్యాలు కావాలంటే అన్ని కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సి వస్తుండేది. ప్రధానంగా వరదలు వచ్చిన సమయంలో తమను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ క్రమంలోనే చంద్ర శివకోటి శర్మ ఏదో ఒకటి చేసి తమ గ్రామానికి సదుపాయాలు కల్పించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.

అలా అతను దాదాపు 3 ఏళ్ల పాటు కష్టపడి సొంతంగా ఓ హెలికాప్టర్‌నే తయారు చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! అయినా ఇది నిజమే. అతను ఇందుకోసం తన భార్య సహాయం కూడా తీసుకున్నాడు. కాగా హెలికాప్టర్ నిర్మాణానికి అతనికి రూ.15 లక్షలు ఖర్చవగా అందుకోసం అతని స్నేహితుడు జన్మయ్ మయాంక్ సహాయం చేశాడు. అయితే అది సాధారణ హెలికాప్టర్‌లా అత్యంత స్పీడ్‌తో ఎగరకున్నా గంటకు 50 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లగలదు. హెలికాప్టర్‌ను సొంతంగా తయారు చేయడంతో చంద్ర శివకోటి శర్మ పేరు నలు వైపులా వ్యాపించింది. అతని ఆవిష్కరణను చూసేందుకు పలువురు ఇంజినీర్లు కూడా రావడం విశేషం. ప్రస్తుతం అతను తన హెలికాప్టర్‌కు పేటెంట్ తీసుకునే పనిలో పడ్డాడు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ముందుగా తన గ్రామానికి ఆ హెలికాప్టర్ ద్వారా సేవలందిస్తానని అంటున్నాడు. చదువుకుంది 3వ తరగతే అయినా ఏకంగా హెలికాప్టర్‌నే తయారు చేశాడంటే చంద్ర శివకోటి శర్మ తెలివిని మనం మెచ్చుకోవాల్సిందే. ఏమంటారు!

Comments

comments

Share this post

scroll to top