MA చదవిని ఈ యువకుడు..ఊర్లోని చెత్తను సేకరిస్తాడు. అతడి సామాజిక దృక్పథాన్ని అభినందిద్దాం.

”అబ్బో… కంపు… ఇంత దుర్వాస‌న వ‌స్తుందేంట్రా బాబూ…” చెత్త ప‌క్క నుంచి వెళ్తుంటే మ‌న ఎక్స్‌ప్రెష‌న్ ఇలా ఉంటుంది. ఆ సంద‌ర్భంలో ముక్కుకు క‌ర్చీఫ్ లేదా చేయి అడ్డం పెట్టుకుని, వాస‌న‌ను భ‌రిస్తూ వెళ్తాం. స‌రే… ఎలాగూ దాన్ని మున్సిపాలిటీ వారు తీసుకెళ్తారు క‌దా… అప్పుడు ఆ ప్ర‌దేశంలో కొంత శుభ్రంగానే ఉంటుంది. మ‌ళ్లీ చెత్త వేస్తే అంతా మామూలే. ఇక ఆ చెత్త‌ను మున్సిపాలిటీ వారు ఎప్పుడు తీస్తారా అని వేచి చూస్తాం. ఇక్క‌డి వ‌ర‌కు ఓకే. మున్సిపాలిటీ వారు ఉండి చెత్త‌ను తీసేస్తుంటే బాగానే ఉంటుంది. అదే వారు ఉండీ సక్ర‌మంగా ప‌నిచేయ‌క‌పోతే..? లేదంటే అస‌లు అక్క‌డ మున్సిపాలిటీ సిబ్బంది లేకుంటే..? ఇంకేముంది.. ఆ ప్రాంతంలో ఉండే వారు నిత్యం రోగాలు, అనారోగ్యాల‌తో కుస్తీలు ప‌ట్టాల్సిందే. అయిన‌ప్ప‌టికీ అలాంటి ప్ర‌దేశంలో ఉన్న చెత్త‌ను గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోరు. మాకుందుకులే అని ముక్కు మూసుకుని వెళ్లిపోతారు. కానీ ఆ యువకుడు అలా వెళ్లిపోలేదు. చెత్త‌ను సేక‌రించి దాన్ని క్ర‌మ‌బ‌ద్దంగా రీసైకిల్ చేస్తూ చెత్త‌ను దాదాపుగా 100 శాతం మ‌ళ్లీ ఉప‌యోగించుకునేలా చేస్తున్నాడు. పేద కుటుంబంలో పుట్టినా స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌లంపుతో చెత్తను స‌మ‌ర్థ‌వంతంగా రీసైకిల్ చేస్తూ త‌న ఊరి మేలు కోసం పాటు ప‌డుతున్నాడు.

waste-recycle

అత‌ని పేరు జ‌బీర్ కార‌త్‌. కేర‌ళ‌లోని కోజికోడ్ సిటీకి 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పూతుప్ప‌డి గ్రామంలో ఓ పేద కుటుంబంలో జ‌న్మించాడు. త‌మ గ్రామానికి ద‌గ్గ‌ర్లో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివాక స్కాలర్‌షిప్ స‌హాయంతో ఢిల్లీలో ప్ల‌స్ 2, డిగ్రీల‌ను పూర్తి చేశాడు. అనంత‌రం ఢిల్లీ యూనివ‌ర్సిటీలో ఎంఏ చ‌దివాడు. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి జ‌బీర్‌కు సామాజిక సేవ అన్నా, సేవా కార్య‌క్ర‌మాల‌న్నా ఎంతో ఆస‌క్తి ఉండేది. ఈ క్ర‌మంలో చ‌దువు పూర్త‌య్యాక స‌మాజానికి, ముఖ్యంగా తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒక‌టి చేయాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలో ఎంఏ అయ్యాక గాంధీ ఫెలోషిప్ కోసం అప్లికేష‌న్ పెట్టుకుని దాదాపు 5 ఏళ్ల‌పాటు అందులో ప‌నిచేశాడు. ఇందులో భాగంగా ముంబై వెళ్లి ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడు. అయితే త‌న ఫెలోషిప్ అయ్యాక తిరిగి సొంత ఊరికి చేరుకున్నాడు. అక్క‌డే త‌న ఊరి కోసం ఏదైనా చేయాల‌నుకున్నాడు.

ఈ క్ర‌మంలో జ‌బీర్ త‌న గ్రామంలో చెత్త ఎక్కువ‌గా పేరుకుపోతుండ‌డాన్ని, దాని వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుండ‌డాన్ని కూడా గ‌మ‌నించాడు. ప్ర‌ధానంగా వ్యాపారులు త‌మ దుకాణాల్లో మిగిలిన వ్య‌ర్థాల‌ను, చెత్త‌ను రోడ్ల‌పై పార‌బోడం మొద‌లు పెట్టారు. అయితే ఆ చెత్త‌ను చూసిన జ‌బీర్ దాన్ని ఎలాగైనా తొల‌గించి మ‌ళ్లీ ఉప‌యోగించుకునేలా 100 శాతం రీసైకిల్ చేయాల‌ని అనుకున్నాడు. కానీ అందులో జ‌బీర్‌కు అనుభ‌వం లేదు. ఈ క్ర‌మంలో చెత్త‌ను రీసైకిల్ చేసే ఓ సంస్థ‌లో అత‌ను ప‌నికోసం చేరాడు. ఆ ప్ర‌క్రియంతా ఎలా జ‌రుగుతుందో పూర్తిగా తెలుసుకోవడం కోసం నిత్యం అత‌ను ప‌లు ప్రాంతాల్లో చెత్త‌ను స్వ‌యంగా సేక‌రించి దాన్ని రీసైక్లింగ్ కోసం తీసుకువెళ్లేవాడు. అలా జ‌బీర్ ఆ ప‌నిని 3 నెల‌ల పాటు చేశాక తానే సొంతంగా తమ గ్రామంలో అలాంటిదే ఓ చిన్న కంపెనీని పెట్టాల‌ని అనుకున్నాడు. అనుకున్న‌దే త‌డవుగా గ్రామానికి చేరుకుని ఎన్‌జీవో సంస్థ‌ల స‌హ‌కారంతో సొంతంగా ఓ రీసైకిల్ కంపెనీ పెట్టాడు. త‌మ గ్రామంలో నిత్యం ఉత్ప‌త్తి అవుతున్న చెత్త‌ను అత‌ను సేక‌రిస్తూ దాన్ని 90 శాతం వ‌రకు రీసైకిల్ చేయ‌గ‌లుగుతున్నాడు. అంతేకాదు, చెత్త‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేయ‌కుండా వ్యాపారుల‌కు, ప్ర‌జ‌ల‌కు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాడు. అయితే జ‌బీర్ తాను రీసైకిల్ చేసిన చెత్త నుంచి ప్లాస్టిక్ మెటీరియ‌ల్ ద్వారా ప్లేట్లు, పింగాణీ వ‌స్తువులు చేయ‌డం, అదేవిధంగా కూర‌గాయల వంటి ఆర్గానిక్ చెత్తతో కంపోస్ట్ ఎరువు త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాడు. దీని వ‌ల్ల 100 శాతం చెత్త‌లో దాదాపుగా 90 శాతానికి పైగా చెత్త‌ను మ‌ళ్లీ ఉప‌యోగించుకున్న‌ట్టు అవుతోంది. దీంతో ప‌ర్యావ‌ర‌ణానికే కాదు, త‌మ ఊరి ప్ర‌జ‌ల‌కు కూడా ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్నాడు జ‌బీర్‌. ఇలాంటి జ‌బీర్‌లు అంత‌టా ఉంటే అప్పుడు చెత్తే లేని స్వ‌చ్ఛ భార‌త్‌గా మ‌న దేశాన్ని చూడ‌వ‌చ్చు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top