ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌దిలి… ఇసుక మాఫియాకు వ్య‌తిరేకంగా పోరాడుతున్నాడు ఆ వ్య‌క్తి..!

ఇసుక మాఫియా… దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌న దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు న‌దులు, చెరువులు అన్న తేడా లేకుండా ఎక్క‌డ ఇసుక ఉంటే అక్క‌డ త‌వ్వుతున్నారు. య‌థేచ్ఛ‌గా స‌హ‌జ వ‌న‌రుల‌ను కొల్ల‌గొడుతూ కోట్ల రూపాయ‌లు గ‌డిస్తున్నారు. ఇదేమిట‌ని అడిగితే ఇసుక మాఫియా దాడుల‌కు తెగ‌బ‌డుతుంది. అలా అడిగిన వారి ప్రాణాల‌ను తీసేందుకు కూడా ఆ మాఫియా వెనుకాడ‌డం లేదు. అయితే అలాంటి మాఫియాల గురించి తెలిసి కూడా ఓ వ్య‌క్తి మాత్రం వాటికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాడు. ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఇసుక మాఫియాల ఆట క‌ట్టించ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్నాడు. అందుకోసం అత‌ను తాను చేస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని కూడా మానేశాడు.

అత‌ని పేరు ఎస్‌.ముగిల‌న్‌. త‌మిళ‌నాడులోని నొయ్య‌ల్ అనే పేరున్న న‌ది ప‌క్క‌నే ఉన్న చెన్నిమ‌లై అనే ఓ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మెకానిక‌ల్ ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించిన ముగిల‌న్‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అత‌ను త‌మిళ‌నాడు ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడ‌బ్ల్యూడీ) విభాగంలో ఇంజినీర్‌గా విధుల్లో చేరాడు. అయితే అలా అత‌ను ఉద్యోగం చేస్తుండ‌గా, త‌మిళ‌నాడులో కొన‌సాగుతున్న ఇసుక మాఫియా ఆగ‌డాల‌ను అత‌ను క‌ళ్లారా చూశాడు. ఆ రాష్ట్రంలో ఉన్న ప‌లు జిల్లాల్లోని చెరువులు, న‌దుల నుంచి రోజూ కొన్ని వేల ట‌న్నుల ఇసుకను అక్ర‌మంగా తవ్వుతుండడం, దాన్ని అన్ని ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తూ ఒక్కో ట్ర‌క్కు ఇసుకను రూ.20వేల నుంచి రూ.30వేల వ‌ర‌కు అమ్ముతుండ‌డాన్ని అత‌ను గ‌మ‌నించాడు. అంతేకాదు, ఇసుక తవ్వుకోమ‌ని చెప్పి ప్ర‌భుత్వం నిర్దిష్ట మొత్తం ఇసుక‌కు అనుమ‌తి ఇస్తే అంత‌క‌న్నా ఎక్కువ‌గానే త‌వ్వుతూ కోట్లు గ‌డిస్తున్న ఇసుక మాఫియాల‌ను అత‌ను ప‌రిశీలించాడు.

ఈ క్ర‌మంలో ఇసుక అలా త‌వ్వుతుండ‌డం వ‌ల్ల ఆ రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భూగ‌ర్భ జ‌లాలు అడుగంటుతుండడాన్ని ముగిల‌న్ తెలుసుకున్నాడు. దీంతో స‌మాజం కోసం, భ‌విష్య‌త్ త‌రాల కోసం ఏదో ఒక‌టి చేయాల‌ని భావించాడు. వెంట‌నే తాను అనుకున్న ప‌ని మొద‌లు పెట్టాడు. ఇసుక మాఫియా ఆగ‌డాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ప్రారంభించాడు. ఆ అరాచ‌కాలను ఆపాల‌ని ల‌క్ష‌లాది మందితో సంత‌కాల‌ను కూడా సేక‌రించాడు. అయితే దీని కోసం త‌న ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని కూడా వ‌దిలి పెట్టాడు ముగిల‌న్‌. ఈ క్ర‌మంలో అత‌నిపై ఓ సారి ఇసుక మాఫియాలు దాడి చేశాయి కూడా. ఆ మాఫియాకు చెందిన కొంద‌రు వ్య‌క్తులు ముగిల‌న్‌ను కొట్ట‌గా అత‌ను తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. కొద్ది రోజులు ఆస్ప‌త్రిలోనే గ‌డిపాడు. ఇంత జ‌రిగినా అత‌ని కుటుంబం కూడా అత‌ను చేసే ప‌నుల‌కు స‌పోర్ట్‌గానే నిలిచింది. దీంతో మ‌రింత పెద్ద ఎత్తున ఉద్యమం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు ముగిల‌న్‌. ఈ క్రమంలో అత‌నికి ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు కూడా వ‌స్తున్నాయి. అయినా అత‌ను వాటిని లెక్క చేయ‌డం లేదు. ఇసుక మాఫియా ఆట‌ల‌ను క‌ట్టించాల‌నే ప‌నిచేస్తున్నాడు. అత‌ని ఆశ‌యం నెరవేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..! ఏది ఏమైనా ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి త‌న జాబ్‌ను కూడా వ‌దిలిపెట్టి ఇలా స‌మాజం కోసం ప‌నిచేస్తున్నాడంటే నిజంగా అత‌న్ని మ‌నం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top