పిల్ల‌ల్ని బాగా చ‌దివించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆ వ్య‌క్తి ప‌డుతున్న కష్టాన్ని చూస్తే ఎవ‌రైనా అత‌నికి హ్యాట్సాఫ్ చెబుతారు..!

ఏ వ్య‌క్తి అయినా నిత్యం క‌ష్ట‌ప‌డితేనే జీవితంలో అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌ష్టం లేక‌పోతే ఏదీ మ‌న ద‌గ్గ‌ర‌కు రాదు. అందుకే క‌ష్టేఫ‌లి అన్నారు పెద్ద‌లు. బీహార్‌కు చెందిన ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. అయితే అత‌ను క‌ష్ట‌ప‌డుతోంది మాత్రం త‌న కోసం కాదు. త‌న పిల్ల‌ల కోసం. వారికి బంగారు భ‌విష్య‌త్తును అందించ‌డం కోసం అత‌ను తీవ్రంగా శ్ర‌మిస్తూ ఓ వైపు కుటుంబాన్ని పోషించ‌డ‌మే కాకుండా, తాను సంపాదిస్తున్న ఆ కొద్ది మొత్తంలోనే త‌న పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తూ వారి అభివృద్ధి కోసం పాటు ప‌డుతున్నాడు. మ‌రీ అంత‌లా ఎందుకు క‌ష్ట‌ప‌డుతున్నావ‌ని ఎవ‌రైనా అడిగితే అత‌ను వారికి చెబుతున్న స‌మాధానం ఏంటో తెలుసా? త‌న‌కు దూర‌మైన చ‌దువు త‌న పిల్ల‌ల‌కు దూరం కాకూడ‌ద‌ని. వారూ త‌న‌లా క‌ష్ట‌ప‌డ‌కూద‌ని.

Jogen-Raoi

బీహార్‌కు చెందిన జోగెన్ రావ‌య్ ఢిల్లీలో రిక్షా కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు. త‌న కుటుంబ స‌భ్యులు మాత్రం బీహార్‌లో ఉంటారు. అత‌నికి మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కుమార్తె 4వ త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గా, చిన్న కూతురు 2, కొడుకు 1వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. కాగా జోగెన్ రావ‌య్ ఢిల్లీలోని ల‌జ్‌ప‌త్‌న‌గ‌ర్‌లో నిత్యం రిక్షా తొక్కుతూ రోజుకు దాదాపు రూ.300 నుంచి రూ.400 వ‌ర‌కు సంపాదిస్తున్నాడు. అలా అత‌ను నెల‌కు దాదాపు రూ.10వేల నుంచి రూ.12 వేల‌కు సంపాదిస్తున్నా, అందులో త‌న రూం అద్దె, ఖ‌ర్చుల కోసం రూ.3వేలు ఉంచుకుని మిగిలిన డ‌బ్బునంతా బీహార్‌లోని త‌న కుటుంబానికే పంపుతున్నాడు. తండ్రి ప‌డుతున్న క‌ష్టానికి ఫ‌లితంగా అత‌ని పిల్ల‌లు కూడా చ‌దువుల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కుమార్తె ఎప్పుడూ ఫ‌స్ట్ క్లాస్‌లోనే మార్కులు తెచ్చుకుంటుంద‌ని జోగెన్ రావ‌య్ చెబుతాడు. అలా చెబుతున్న‌ప్పుడు అత‌ను ప‌డే ఆనందం వ‌ర్ణించ‌రానిది.

జోగెన్ రావ‌య్ అంత‌గా ఆనంద ప‌డడానికీ ఓ కార‌ణం ఉంది. అదేమిటంటే… త‌న చిన్న‌తనంలో అత‌ను 5వ త‌ర‌గ‌తి చ‌దివేట‌ప్పుడు తండ్రి చ‌నిపోయాడు. దీంతో కుటుంబ భారం అత‌ని మీద ప‌డింది. వారి ఆచారం ప్ర‌కారం ఇంట్లో ఉన్న ఆడ‌పిల్ల‌ల‌కు పెళ్లి చేయందే వారు చేసుకోకూడదు. దీంతో అత‌ను రోజువారీ కార్మికుడిగా పనిచేస్తూ ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న అక్క‌తోపాటు, త‌న త‌రువాత పుట్టిన మ‌రో ఇద్ద‌రు చెల్లెల్ల పెళ్లిళ్ల‌ను ఘ‌నంగా చేశాడు. అయితే అక్క‌డ ప‌ని దొర‌క‌డం క‌ష్ట‌త‌రంగా మార‌డంతో అతను ఢిల్లీకి వ‌ల‌స వెళ్లి అక్క‌డ రిక్షా తొక్కుతూ జీవ‌నం సాగించాడు. ఈ క్ర‌మంలోనే పెళ్లి చేసుకోవ‌డం, పిల్ల‌లు క‌ల‌గ‌డం, వారికి విద్యాబుద్ధులు చెప్పించ‌డం చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. ఇప్ప‌టికీ అత‌ను విసుగు చెంద‌కుండా మిట్ట మ‌ధ్యాహ్నం ఎండ‌లోనూ రిక్షా తొక్కుతూ త‌న పిల్ల‌లు, కుటుంబం బాగు కోసం ప‌రితపిస్తున్నాడు. ఇంకో చెప్పుకోద‌గ్గ విశేష‌మేమిటంటే జోగెన్ రావ‌య్‌కు ఎలాంటి చెడు అల‌వాట్లు లేక‌పోవ‌డం. అవును, త‌న‌కు మ‌ద్యం, ధూమ‌పానం లాంటి అల‌వాట్లు లేక‌పోవ‌డం వ‌ల్లే త‌న పిల్ల‌ల‌ను ఎంతో బాగా చ‌దివిస్తున్నాన‌ని, వారు చ‌దువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తే త‌న‌కు అంత‌కు మించిన బ‌హుమ‌తి మ‌రొక‌టి ఉండ‌ద‌ని చెమ‌ర్చిన క‌ళ్ల‌తో జోగెన్ రావ‌య్ స‌మాధానం చెబుతాడు. నిజంగా అత‌ను ప‌డుతున్న శ్ర‌మ‌కు, పిల్ల‌ల్ని చ‌దివించాల‌న్న అత‌ని ప‌ట్టుద‌ల‌కు మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఏమంటారు!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top