ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరిగ్గా వైద్యం చేస్తూ వారికి అన్ని వేళలా అందుబాటులో ఉండే డాక్టర్లు ఎంత మంది ఉంటారు..? నిజంగా చెప్పండి. అలాంటి వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఇప్పుడు మేం చెప్పబోయే ఆ డాక్టర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. ఆయన పేరు డాక్టర్ సీహెచ్ మధుసూదన్. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్)లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. అయితే ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదు. పేషెంట్లకు ఈయన చేసిన సర్జరీలు, అందించిన సేవలు వెలకట్టలేం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈయనను ఉత్తమ ప్రభుత్వ డాక్టర్‌గా సన్మానించనుంది.
డాక్టర్ మధుసూదన్ నిజంగా పేదల పాలిట దైవమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన చాలా క్లిష్టతరమైన ఆపరేషన్లను పేదలకు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ, దేశంలో మొదటి ఆటో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలను చేశారు. ఈ తరహా సర్జరీ ప్రపంచంలోనే రెండోది. దీంతోపాటు నల్గొండకు చెందిన టైప్ 1 డయాబెటిస్ పేషెంట్‌కు 23 గంటల పాటు నాన్‌స్టాప్‌గా కిడ్నీ, క్లోమం ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేసి రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలి నుంచి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గాల్ బ్లాడర్ క్యాన్సర్ కణతిని తీసేసి కాపాడారు. 2016-17వ సంవత్సరంలో ఉస్మానియా ఆస్పత్రిలో 6 మందికి విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో లివర్, పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లను ఈయన ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ మధుసూదన్ చేసిన సేవలు చాలానే ఉన్నాయి.
అందుకే ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ డాక్టర్‌గా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే 2016-17 సంవత్సరానికి గాను రాష్ట్రం మొత్తం మీద పలు ప్రభుత్వ విభాగాల్లోని అన్ని శాఖల్లోనూ సేవలు అందించిన ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగులు 132 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో డాక్టర్ మధుసూదన్ టాప్ 4లో ఉన్నారు. అందుకు గాను ఈయనకు స్వాతంత్ర్యం దినోత్సవం రోజున రూ.5 లక్షల ప్రైజ్ మనీ, ఒక ఇంక్రిమెంట్, సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. అవును మరి, నిజంగా ఆయన చేసిన సేవకు ఈ రివార్డులు కూడా తక్కువే అవుతాయి కదా..!