రిక్షా కార్మికుడి కొడుకు అత‌ను… ఇప్పుడు గొప్ప ఐఏఎస్ అధికారి అయ్యాడు..!

పేద వాళ్లంటే బ‌డాబాబుల‌కు ఎప్పుడూ చుల‌క‌నే. వారిని తాకేందుకు కాదు క‌దా, క‌నీసం వారిని చూసేందుకు కూడా ధ‌నికులు ఇష్ట ప‌డ‌రు. అంత‌లా అస‌హ్యించుకుంటారు. స‌రిగ్గా ఆ బాలున్ని కూడా ఓ ధ‌నిక కుటుంబం అలాగే అస‌హ్యించుకుంది. మా ఇంట్లో నుంచి పో అంటూ వెళ్ల‌గొట్టింది. దీంతో క‌సి పెంచుకున్న ఆ పేద బాలుడు క‌ష్ట‌ప‌డి చ‌దివి వారికి బుద్ధి చెప్పేలా ఇప్పుడు గొప్ప ఐఏఎస్ అధికారి అయ్యాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది జ‌రిగింది వార‌ణాసిలో..!

వార‌ణాసిలోని ఉస్మార్‌పుర అనే ప్రాంతంలో నివాసం ఉండే నారాయ‌ణ అనే వ్య‌క్తి రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అత‌నికి న‌లుగురు పిల్లలు ముగ్గురు బిడ్డ‌లు, ఓ కుమారుడు. కుమారుడు అంద‌రి క‌న్నా చిన్న‌వాడు. అత‌ని పేరే గోవింద్‌. గోవింద్‌కు చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువు అంటే ఎంత‌గానో ఆస‌క్తి ఉండేది. ఎప్ప‌టికైనా గొప్ప చ‌దువులు చ‌ద‌వాల‌ని, ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని అత‌నికి ఆస‌క్తిగా ఉండేది. దీంతో తండ్రి క‌ష్ట‌ప‌డి సంపాదిస్తుంటే గోవింద్ శ్ర‌ద్ధ‌గా చ‌దువుకునేవాడు. స్థానికంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్య‌ను అభ్య‌సించేవాడు. అయితే ఓ రోజున అత‌ను త‌మ ప్రాంతంలో ఉండే ఓ ధ‌నిక కుటుంబానికి చెందిన ఇంటికి అనుకోకుండా వెళ్లాల్సి వ‌చ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఉండే వారు గోవింద్‌ను త‌మ ఇంటి నుంచి వెళ్ల‌గొట్టారు. పొమ్మ‌ని అస‌హ్యించుకున్నారు. ఈ క్ర‌మంలో గోవింద్‌కు చ‌దువుకోవాల‌నే క‌సి మ‌రింత పెరిగింది. ఎలాగైనా బాగా చ‌దివి అంద‌రి చేత గొప్ప‌వాన్ని అనిపించుకోవాల‌ని, త‌న‌ను ఈస‌డించుకున్న వారిచేతే శ‌భాష్ అనిపించుకోవాల‌ని అనుకున్నాడు. దీంతో మ‌రింత బాగా చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు.

అందులో భాగంగానే పాఠ‌శాల విద్య‌తోపాటు ఇంట‌ర్‌, డిగ్రీల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. అనంతరం సివిల్స్ రాసి ఐఏఎస్ అవుదామ‌నుకున్నాడు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్ సాధించాల‌ని భావించాడు. అందుకోసం అత‌ను ఢిల్లీకి మ‌కాం మార్చాడు. అక్క‌డే ఓ వైపు మ్యాథ్స్ లెక్చ‌ర‌ర్‌గా ట్యూష‌న్లు చెబుతూ మ‌రో వైపు తండ్రి సంపాదన‌, త‌న సంపాద‌న‌తో వచ్చే డ‌బ్బుల్ని జాగ్ర‌త్త‌గా పొదుపు చేస్తూ వాటితో సివిల్స్ కోచింగ్ తీసుకునే వాడు. మ‌రో వైపు రోజుకు 18 నుంచి 20 గంట‌లు చ‌దివేవాడు. ఒక్కోసారి తిండి కూడా తిన‌కుండా డ‌బ్బులు మిగిల్చుకుని వాటితో పుస్త‌కాలు కొనేవాడు. వాటిలో ఉన్న సారాంశాన్ని బాగా ఆక‌ళింపు చేసుకునేవాడు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు 2006లో జ‌రిగిన సివిల్స్ ప‌రీక్ష‌లో దేశ వ్యాప్తంగా అత్యుత్త‌మ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యాడు. అలా గోవింద్ ఒక‌ప్పుడు త‌న‌ను అస‌హ్యించుకున్న వారే ముక్కున వేలేసుకునేలా చేశాడు..!

Comments

comments

Share this post

scroll to top