గుట్కాలు తినడం వల్ల ఎంతటి ప్రమాదకరమైన అనారోగ్యాలు వస్తాయో అందరికీ తెలిసిందే. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉంటాయి. ఏటా అనేక మంది వీటి బారిన పడుతున్నారు కూడా. అయినా చాలా మంది గుట్కాలను తినడం మానడం లేదు. అయితే అలాంటి వారిలో ఎలాగైనా మార్పును తీసుకురావాలని, గుట్కా విక్రయాలను పూర్తిగా నిషేధించాలని ఆ వ్యక్తి పోరాటం చేశాడు. ఎన్నో సంవత్సరాల పాటు అందుకు తీవ్రంగా శ్రమించాడు. చివరికి ఎలాగైతేనేం తాను అనుకున్నది సాధించాడు. అతనే ఒడిశాకు చెందిన ఎండీ ఇమ్రాన్ అలీ.
ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఎండీ ఇమ్రాన్ అలీకి చిన్నతనం నుంచే సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండేది. కాగా భువనేశ్వర్‌లో పీజీ విద్యను అభ్యసించేటప్పుడు 10 సంవత్సరాల బాలురు గుట్కా, పొగాకు ఉత్పత్తులకు ఏ విధంగా వ్యసన పరులయ్యారో ప్రత్యక్షంగా చూశాడు. దీనికి తోడు ఆ ఉత్పత్తులను వాడడం వల్ల ఎంతటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయో కూడా తెలుసుకున్నాడు. దీంతో అలాంటి బాలురే కాదు, అసలు ఆ రాష్ట్రంలో గుట్కా ఉత్పత్తులేవీ ఉండకూడదని, వాటిపై పూర్తిగా నిషేధం విధించాలని, అందుకోసం తన వంతు ప్రయత్నం కచ్చితంగా చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన పని మొదలు పెట్టాడు.
ఓ వైపు పీజీ విద్యను అభ్యసిస్తూనే మరో వైపు ఖాళీ సమయాల్లో స్థానికంగా ఉన్న పాఠశాలలు, బస్తీలు, మురికి వాడల్లో గుట్కా ఉత్పత్తులను వాడడం వల్ల కలిగే అనర్థాలను గురించి ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సొంతంగా నషా ముక్తి యువ సంకల్ప్ (ఎన్ఎంవైఎస్) పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఇమ్రాన్ ఏర్పాటు చేశాడు. దీంతో ఆ సంస్థతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు అనేక మంది యువత ముందుకు వచ్చారు. కాగా గుట్కా కలిగించే అనర్థాలపై ఇమ్రాన్ సొంతగా ఓ పుస్తకం కూడా రాశాడు. అంతేకాదు మురికి వాడలు, బస్తీలు, కాలనీల్లో పలు లఘు చిత్రాలను కూడా ప్రదర్శించడం మొదలు పెట్టాడు. అందుకోసం పలువురు కళాకారులు కూడా ఇమ్రాన్‌కు స్వచ్ఛందంగా చేయూతనందించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఒడిశాలో గుట్కా విక్రయాలను నిషేధించాలని, వాటి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఇమ్రాన్ ఓ లాయర్ సహాయంతో ఒడిశా హైకోర్టులో పిల్ వేశాడు. హైకోర్టు అందుకు అనుకూలంగా స్పందించినా గుట్కా విక్రయాలు మాత్రం ఆగలేదు. కాగా 2013లో మరోసారి అలా పిల్ వేసి ఎట్టకేలకు గుట్కాలపై పూర్తి నిషేధం వచ్చేలా ఇమ్రాన్ కృషి చేశాడు. సమాజ సేవ పట్ల అతనికున్న అంకిత భావానికి రాష్ట్రపతి కూడా ఇమ్రాన్‌ను అభినందించారు. మనం కూడా ఇమ్రాన్‌ను అభినందించాల్సిందే! ఏమంటారు!