తోపుడు బండిపై భార్య మృత‌దేహాన్ని 60 కిలోమీట‌ర్లు తీసుకెళ్లిన వ్య‌క్తి..!

మొన్న ఒడిశాలో భార్య మృత‌దేహాన్ని మోసుకెళ్లిన ద‌న‌మాఝీ… నిన్న కాన్పూర్‌లో 12 ఏళ్ల త‌న బాలుడిని భుజాన మోసుకెళ్లిన ఓ తండ్రి… నేడు మ‌రో వ్య‌క్తి… చ‌నిపోయిన త‌న భార్య మృత‌దేహాన్ని తీసుకెళ్లేందుకు డ‌బ్బులు లేవు. దీంతో ఓ తోపుడు బండిపై దాదాపు 60 కిలోమీట‌ర్ల దూరం ఆమె మృత‌దేహాన్ని తీసుకెళ్లాడు. అత్యంత హృద‌య విదార‌క‌ర‌మైన ఈ సంఘ‌ట‌న జ‌రిగింది తెలంగాణ రాష్ట్రంలో.

wife-dead-body

ఆ దంప‌తుల పేర్లు రాములు, క‌విత‌. గ‌త ఆరేళ్ల క్రితం సొంత ఊరైన సంగారెడ్డి నుంచి హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చారు. ఎక్క‌డ ప‌ని దొర‌క్క‌పోవ‌డంతో యాచ‌కులుగా మారారు. అక్క‌డా ఇక్క‌డా బిచ్చ‌మెత్తుకోగా వ‌చ్చిన నాలుగు పైస‌ల‌తోనే క‌డుపు నింపుకునేవారు. అయితే నిత్యం మంచి పౌష్టికాహారం తీసుకుంటూ మంచి జీవ‌న శైలి ఉన్న‌వారికే రోగాలు త‌ప్ప‌డం లేదు. అలాంటిది యాచ‌కం చేస్తేనే గానీ క‌డుపు నిండ‌ని వారికి ఎలాంటి వ్యాధులు వ‌స్తాయో మ‌నం ఇట్టే ఊహించ‌వ‌చ్చు. రాములు, క‌విత‌ల‌కు కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. వారిద్ద‌రికీ కుష్టు వ్యాధి వ‌చ్చింది.

అయిన‌ప్ప‌టికీ జీవ‌న పోరాటం ఆగ‌దు క‌దా. వారిని ఆదుకునేవారు కూడా లేరు. దీంతో ఆ వ్యాధితో క‌విత మొన్నే మృతి చెందింది. అయితే రాములు ఆమె అంత్య‌క్రియ‌ల‌ను త‌మ సొంత ఊర్లో చేయాల‌ని అనుకున్నాడు. కానీ ఆమె మృతదేహాన్ని అక్క‌డి వ‌ర‌కు తీసుకెళ్లాలంటే ఆంబులెన్సు డ్రైవ‌ర్లు రూ.5వేలు అడిగారు. అయితే అత‌ని వ‌ద్ద అందుకు త‌గిన డ‌బ్బు లేదు. దీంతో తన వ‌ద్ద ఉన్న ఓ తోపుడు బండిలో ఆమె మృత‌దేహాన్ని పెట్టుకుని కాలి న‌డ‌క‌నే ఊరికి ప్ర‌యాణ‌మ‌య్యాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అత‌ను రాత్రి పూట బ‌య‌ల్దేర‌డంతో దారి త‌ప్పి వికారాబాద్‌కు చేరుకున్నాడు. తీరా విష‌యం తెలుసుకున్న రాములుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్ర‌మంలో పెద్ద‌గా దుఃఖించ‌డం మొద‌లు పెట్టాడు. అయితే అత‌నికి దుఃఖానికి కార‌ణం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు అత‌నికి కావ‌ల్సిన స‌హాయం చేసి ఆంబులెన్స్‌లో క‌విత మృత‌దేహాన్ని సంగారెడ్డికి త‌ర‌లించారు.

ఇదీ… అపూర్వ భార‌త్‌గా చెప్పుకుంటున్న మ‌న దేశంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్నది. పేద‌ల జీవితాలు ఎంత‌టి దుర్భ‌ర ప‌రిస్థితుల్లో ఉన్నాయో క‌ళ్ల‌కు కట్టిన‌ట్టు తెలియ‌జేస్తుందీ సంఘ‌ట‌న‌. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఇంకా ఎన్నింటిని చూడాల్సి వ‌స్తుందో క‌దా..!

Comments

comments

Share this post

scroll to top