మ‌నుషులెవ‌రూ చేయ‌లేని హీన‌మైన ప‌నిని ఆ బాలిక‌ల‌చే చేయించారు ఆ ఎన్‌జీవో నిర్వాహ‌కులు. వీరినేం చేయాలి..?

మ‌లం, మూత్రం, చెత్త‌, వ్య‌ర్థాల‌తో నిండిన మ్యాన్ హోల్స్ అవి. వాటిని క్లీన్ చేసేందుకు యంత్రాలనే వాడాలి త‌ప్ప‌, మ‌నుషుల‌చే ఆ ప‌ని చేయించ‌కూడ‌దు. ఇది సుప్రీం కోర్టు ఇది వ‌ర‌కే తేల్చి చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఈ త‌ర‌హా ప‌నులు చేయించ‌డం ఆగ‌డం లేదు. స‌మాజంలో ఉన్న కొన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను చిన్న చూపు చూస్తూ కొంద‌రు అలా సెప్టిక్ ట్యాంకుల‌ను, మ్యాన్ హోల్స్‌ను క్లీన్ చేయిస్తున్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు కూడా. అయిన‌ప్ప‌టికీ అలాంటి పని చేసే వారికి త‌ప్ప‌దు క‌దా. బ్ర‌తుకు దెరువు అదే కదా. ఆ ప‌నిచేయాల్సిందే. అయితే ఇది అక్క‌డితో ఆగ‌లేదు. చిన్న‌పిల్ల‌ల దాకా పాకింది. చిన్న పిల్ల‌లతో కూడా అలా మ్యాన్‌హోల్స్ క్లీన్ చేయిస్తున్నారు. ఇలాంటి విచార‌క‌ర సంఘ‌ట‌న ఒక‌టి తాజాగా హైదరాబాద్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

న‌గ‌రంలోని బోడుప్ప‌ల్ ప్రాంతంలో గాయ‌త్రిన‌గ‌ర్‌లో Ambassadors of Goodwill for AIDS Patients Everywhere (AGAPE) అనే స్వ‌చ్ఛంద సంస్థ ఉంది. ఇందులో 235 మంది బాలిక‌లు ఉన్నారు. వారంద‌రూ అనాథలు. పైగా వారు ఎయిడ్స్‌వ్యాధి గ్ర‌స్తులు. ఈ క్ర‌మంలో ఆ బాలిక‌లంద‌రినీ ఆ సంస్థ చేర‌దీసి వారికి ఆస‌రా ఇస్తోంది. అయితే ఆ సెంట‌ర్‌లో ఉన్న బాలిక‌ల‌కు సూప‌ర్ వైజ‌ర్‌, వార్డెన్లుగా ఉన్న జి.ఎల‌వ‌ర‌స‌న్‌, వై.ప్ర‌జావ‌తిలు ఇటీవ‌లే ఆ బాలిక‌లచే ఆ సెంట‌ర్‌లోని మ్యాన్‌హోల్స్‌ను క్లీన్ చేయించారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు సంఘ‌ట‌న‌ను ఎవ‌రో వీడియో తీయ‌గా దానికి తాలూకు 30 సెక‌న్ల నిడివి గ‌ల ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది.

దీంతో స‌ద‌రు వీడియో ఆధారంగా హ్యూమ‌న్ రైట్స్‌, చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు స‌ద‌రు వార్డెన్‌, సూప‌ర్‌వైజ‌ర్‌ల‌ను అరెస్టు చేశారు. వారిపై పోలీసులు జువైన‌ల్ జ‌స్టిస్ యాక్ట్ సెక్ష‌న్ 75, చైల్డ్ లేబ‌ర్ యాక్ట్ సెక్ష‌న్ 3 ప్ర‌కారం కేసులు న‌మోదు చేశారు. అయితే ఇప్పుడంటే వీడియో దొరికింది కాబ‌ట్టి ఆ వార్డెన్‌, సూప‌ర్ వైజ‌ర్‌లు చేసిన చిత్ర‌హింస గురించి తెలిసింది. కానీ నిజానికి అస‌లు ఆ సెంట‌ర్‌లో బాలిక‌లు ఎన్నో రోజుల నుంచి దీనావ‌స్థ‌లో ఉన్నారు. వారిచేత ఆ సిబ్బంది ఇష్ట‌మొచ్చిన ప‌నులు చేయించుకున్న‌ట్టు తెలిసింది. దీంతో ఆ బాలిక‌లంద‌రినీ యూసుఫ్‌గూడ‌లో ఉన్న స్టేట్ హోంకు త‌ర‌లించే ప‌నిలో ప‌డ్డారు సంబంధిత అధికారులు. నిజంగా ఇన్ని రోజుల నుంచి పాపం ఆ బాలిక‌లు ఎన్ని బాధ‌లు ప‌డ్డారో..! అయితేనేం… ఇక‌నైనా వారి జీవితం బాగుప‌డాల‌ని ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top