మొక్కలు పెంచాలని ఉందా? వాటిని ఎలా పెంచాలో తెలియదా? అయితే వీరిని ఫాలో అవ్వండి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజు రోజుకీ చెట్ల సంఖ్య ఏ విధంగా త‌గ్గిపోతుందో అంద‌రికీ తెలిసిందే. అందుకు అనేక కార‌ణాలు కూడా ఉన్నాయి. అయితే త‌గ్గిపోతున్న చెట్ల సంఖ్య‌ను పెంచాల‌ని అనేక దేశాల‌, రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వాలు, ఎన్‌జీవోలు ప‌లు ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నాయి. కానీ చాలా మంది ఏమ‌నుకుంటున్నారంటే త‌మ‌కు టైం లేద‌నో, లేదంటే ఇంకా వేరే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో చురుగ్గా పాల్గొన‌డం లేదు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా కృషి చేస్తేనే క‌దా మొక్కలు పెరిగి వృక్షాలుగా మారి మ‌న‌కు సౌక‌ర్యంగా ఉండేది. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌ల‌ను నాటేలా చేయాలంటే ఏం చేయాలి..? అనే ఆలోచ‌న‌తోనే ముందుకు వ‌చ్చింది ఆ స్వ‌చ్ఛంద సంస్థ‌. అదే సంక‌ల్ప్ త‌రు.

sankalp-taru

అపూర్వ భండారి అనే వ్య‌క్తి ఎంబీఏ చేసి ఓ ప్ర‌ముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌ను త‌న సొంత రాష్ట్ర‌మైన ఉత్త‌రాఖండ్‌లో చెట్ల సంఖ్య విప‌రీతంగా త‌గ్గిపోతుండ‌డం గ‌మ‌నించాడు. అయితే మొక్క‌ల‌ను నాటుదామ‌ని పిలుపునిస్తే వ‌చ్చే స్పంద‌న అంతంత మాత్ర‌మే అని అత‌నికి తెలుసు. దీంతో ఓ వినూత్న ప‌ద్ధ‌తిలో ఆ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. సంక‌ల్ప్ త‌రు అనే ఓ ఎన్‌జీవో ను ఏర్పాటు చేసి దాని ద్వారా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాడు. సంక‌ల్ప్ త‌రు అనేది నిజానికి ఓ వెబ్‌సైట్. అందులో ఔత్సాహికులు రిజిస్ట‌ర్ చేసుకుని రూ.149 నుంచి రూ.251 మ‌ధ్య రుసుం చెల్లించి అందులో ఉన్న విధంగా మొక్క పేరు, అది నాటాల్సిన ప్ర‌దేశాల‌ను ఎంచుకోవాలి. దీంతో స‌ద‌రు స‌మాచారం సంక‌ల్ప్ త‌రు కో ఆర్డినేట‌ర్‌కు చేరుతుంది. దీంతో ఆ వ్య‌క్తి ఆ ప్ర‌దేశంలో అందుబాటులో ఉన్న గ్రామ‌స్తులు, విద్యార్థులు, మ‌హిళ‌లు లేదా ప్ర‌భుత్వ సిబ్బంది స‌హ‌కారంతో ఔత్సాహికులు ఎంపిక చేసుకున్న మొక్క‌ను నాటిస్తాడు. అనంత‌రం దాన్ని ఫొటో తీసి స‌ద‌రు ఔత్సాహికుడికి మెయిల్ చేస్తాడు. అలా మొక్క పెరుగుతున్న కొద్దీ దాని ప్ర‌గ‌తిని ఫొటోల రూపంలో స‌ద‌రు కో ఆర్డినేట‌ర్ ఔత్సాహికుడికి పంపుతూ ఉంటాడు. అలా మొక్క‌ల‌ను పెంచేలా సంక‌ల్ప్ త‌రును ముందుకు తీసుకువెళ్తున్నాడు భండారి.

భండారి ఆచ‌ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చిన ఈ కార్య‌క్ర‌మం చాలా మందికి న‌చ్చింది. ఈ క్ర‌మంలో అనేక మంది మొక్క‌లు నాటేందుకు ముందుకు వ‌స్తున్నారు. 2012లో అలా ప్రారంభ‌మైన సంక‌ల్ప్ త‌రు ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 21,500 మొక్క‌ల‌ను నాటారు. ఆ సంస్థ‌కు 35 మంది కో ఆర్డినేట‌ర్లు కూడా ఉన్నారు. వారు దేశంలో ఉన్న ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైన చెప్పిన విధంగా మొక్క‌లు నాటుతారు. అయితే ఔత్సాహికులు తాము నాటిన మొక్క‌ల‌ను స్వ‌యంగా సంద‌ర్శించి వాటిని చూసుకోవ‌చ్చు కూడా. అందుకు గాను సంక‌ల్ప్ త‌రు సైట్ ద్వారా స‌ద‌రు మొక్క ఉన్న ప్ర‌దేశం, దాని వివ‌రాలు గూగుల్ మ్యాప్ రూపంలో ఔత్సాహికుల‌కు అందుతాయి. అయితే ఈ కార్య‌క్ర‌మం ద్వారా కేవ‌లం మొక్క‌లు నాట‌డ‌మ‌నే గొప్ప ప‌ని జ‌ర‌గ‌డ‌మే కాదు, ఆయా గ్రామాల్లో ఉన్న వారికి ప‌ని కూడా దొరుకుతోంది. సంక‌ల్ప్ త‌రులో ప్ర‌స్తుతం అనేక ర‌కాల ప్రాజెక్ట్‌ల పేరిట మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాలు ఔత్సాహికులకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో వారు దేన్న‌యినా ఎంచుకుని ముందుకు సాగ‌వ‌చ్చు. నిజంగా భండారి చేసిన ఐడియా చాలా బాగుంది క‌దా..! ఎక్క‌డికి వెళ్ల‌కుండానే చిన్న‌పాటి ఖర్చుతో మొక్క‌ను పెంచుకోవ‌చ్చు. దాని సంర‌క్ష‌ణ‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు..! మీకు కూడా ఆ ఆస‌క్తి ఉంటే వెంట‌నే సంద‌ర్శించండి సంక‌ల్ప్ త‌రు వెబ్‌సైట్ – http://www.sankalptaru.org/. దీనికి సంబంధించి మొబైల్ యాప్ కూడా ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ల‌భ్య‌మ‌వుతోంది.

Comments

comments

Share this post

scroll to top