పేద‌వాళ్ల‌కు మెడిసిన్ల‌ను అందిస్తున్న మెడిసిన్ బాబా ఇత‌ను..! అత‌నికి ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

మ‌న దేశంలో ఇండ్లు, హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌లో నిత్యం ఎన్ని ల‌క్ష‌ల ట‌న్నుల ఆహారం వృథాగా పోతుందో అంద‌రికీ తెలిసిందే. దీంతో అలాంటి ఆహారాన్ని సేక‌రించి పేద‌ల‌కు అందించే కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నాయి కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు. వీటికి ప‌లువురు దాత‌లు, వాలంటీర్లు కూడా సేవ‌లందిస్తున్నారు. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఆహారం మాత్ర‌మే కాదు, మ‌నం వాడే ఎన్నో రకాల ఇంగ్లిష్ మెడిసిన్స్ కూడా ఇలాగే వృథాగా పోతున్నాయి. దీన్ని గ‌మ‌నించిన అత‌ను వాటిని అవ‌స‌రం ఉన్న పేద‌ల‌కు అందిస్తున్నాడు. అత‌నే… ఢిల్లీకి చెందిన మెడిసిన్ బాబా..!

మెడిసిన్ బాబా అస‌లు పేరు ఓంకార్ నాథ్ శ‌ర్మ‌. అలా అని చెప్పి ఈయ‌న ఉప‌దేశాలు బోధించే బాబా కాదు, ప‌ని చేసే బాబా. పేద‌ల కోసం, వారికి అవ‌స‌రం ఉన్న ట్యాబ్లెట్లు, మందుల‌ను అందించ‌డం కోసం న‌డుం బిగించాడు. అస‌లు ఓంకార్ నాథ్ ఈ ప‌ని ఎందుకు మొద‌లు పెట్టాడంటే… అది 2008వ సంవ‌త్స‌రం. ఒకసారి తూర్పు ఢిల్లీలో మెట్రో పనులు జరుగుతుంటే ఉన్నట్టుండి బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్క‌డ స‌రైన స‌దుపాయాలు, ముఖ్యంగా మందులు అందుబాటులో లేక‌పోవ‌డంతో కొంద‌రు మృతి చెందాల్సి వ‌చ్చింది. దీంతో ఓంకార్ నాథ్ క‌ల‌త చెందాడు. ఎలాగైనా పేద‌ల‌కు ఆరోగ్యం విష‌యంలో స‌హాయం చేయాల‌నుకున్నాడు. అప్ప‌టి నుంచే ఇలా మెడిసిన్ల‌ను ఇవ్వ‌డం ప్రారంభించాడు.

అయితే ఓంకార్ నాథ్ తాను ఇచ్చే మెడిసిన్ల‌ను సొంత ఖ‌ర్చు పెట్టి కొన‌డు. మ‌రి అత‌నికి మెడిసిన్లు ఎక్క‌డి నుంచి వ‌స్తాయ‌నేగా మీ సందేహం. ఏమీ లేదు… పైనే చెప్పాం క‌దా, ఇండ్ల‌లో, హోట‌ల్స్‌లో ఆహారం మిగిలితే దాన్ని సేక‌రించి పేద‌ల‌కు పంచుతార‌ని, అలాగే ఇండ్ల‌లో మిగిలిన, వాడ‌ని, ఎక్స్‌పైరీ తేదీ ముగ‌య‌ని మందులు, టానిక్‌ల‌ను ఓంకార్ నాథ్ సేక‌రిస్తాడు. అనంత‌రం వాటిని అవ‌స‌రం ఉన్న వారికి అంద‌జేస్తాడు. అలా అత‌ను నెల‌కు రూ.4 ల‌క్ష‌ల నుంచి రూ.6 ల‌క్ష‌ల విలువైన మందుల‌ను సేక‌రించి అవ‌స‌రం ఉన్న వారికి అందిస్తున్నాడు. దీంతో అత‌న్ని అంద‌రూ మెడిసిన్ బాబా అని పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. మ‌రి త‌న ఉపాధి కోసం అత‌ను ఏమీ చేయ‌డా..? అంటే అవును, చేయ‌డు. ఎందుకంటే అత‌ను త‌న ఉద్యోగం నుంచి ఎప్పుడో రిటైర్ అయ్యాడు. గ‌తంలో నోయిడాలో ఓ హాస్పిట‌ల్‌లో బ్ల‌డ్ బ్యాంక్ టెక్నిషియ‌న్‌గా అత‌ను ప‌నిచేశాడు. అనంత‌రం రిటైర్ అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ వృద్ధాప్యంలోనూ అత‌ను పేద‌ల‌కు ఇలా సేవ చేస్తున్నాడంటే… నిజంగా అత‌న్ని అంద‌రం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top