భార్య‌కు కారు కొనేందుకు 5 నెల‌ల కొడుకుని అమ్మ‌కానికి పెట్టాడు ఆ వ్య‌క్తి..!

నేటి ఆధునిక స‌మాజంలో మాన‌వ సంబంధాల‌న్నీ క‌లుషిత‌మై పోతున్నాయి. ప్ర‌ధానంగా డ‌బ్బు ఆ సంబంధాల‌ను పూర్తిగా మార్చేస్తోంది. మనుషుల మ‌ధ్య చిచ్చు పెడుతోంది. త‌ల్లి, తండ్రి, అన్న‌, త‌మ్ముడు, అక్క‌, చెల్లి… వంటి బంధాల‌న్నీ డ‌బ్బుతో ముడిప‌డి ఉంటున్నాయి. డ‌బ్బు కోసం ఆ బంధాలతో ముడిప‌డి ఉన్న వారంతా ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌డం లేదు. చైనాలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. భార్యతో విడాకులు కోరుకున్న ఓ వ్య‌క్తి ఆమె అడిగింద‌ని చెప్పి సొంత కొడుకును అమ్మి ఆమె కోసం కారు కొనేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఎట్ట‌కేల‌కు అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

zhang
చైనాలోని లింగ్వి పట్టణానికి చెందిన జాంగ్ అనే వ్యక్తి ఇటీవలే ప‌లు కారణాల వల్ల తన భార్య నుండి విడాకులు తీసుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని భార్య కూడా అంగీకరించి ఒక షరతు విధించింది. తాను విడాకులు ఇవ్వాలంటే తనకు కారు కొనిపెట్టాలని కండిషన్ పెట్టింది. కారు కోనేటంత డబ్బు జాంగ్ దగ్గర లేదు. కానీ ఎలాగైనా తన భార్య నుండి విడాకులు పొందాలనుకుని అత‌ను భావించాడు. ఈ క్ర‌మంలోనే తన 5 నెలల వ‌య‌స్సున్న‌ కుమారుడిని అమ్మకానికి పెట్టాడు. ఆన్ లైన్ లో ఓ వ్య‌క్తి పరిచయం కాగా అత‌నికి 80 వేల యువాన్లకు కొడుకును అమ్ముతాన‌ని చెప్పాడు. అందులో భాగంగానే అత‌నికి త‌న కొడుకును ఇచ్చేందుకు జాంగ్ ఒక కూడలి వద్ద నిల్చున్నాడు. చిన్నారి ఒంటిపై సరైన దుస్తులు లేవు. చలి ఎక్కువగా ఉంది. దాంతో 10 నిముషాల తరువాత ఆ పిల్లాడు ఏడవడం మొదలెట్టాడు.

అయితే అదే సమయంలో అక్క‌డే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ప‌లువురు పోలీసులు అటు వైపుగా వచ్చారు. అక్క‌డే ఉన్న జాంగ్ కదలికలను వారు గ‌మ‌నించారు. అత‌ను అనుమానాస్ప‌దంగా అక్క‌డ త‌చ్చాడుతుండ‌డంతో స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దాంతో భార్యకు కారు కొనడానికి ఇలా చేసానని, అంతేకాకుండా తాము విడాకులు తీసుకుంటే తమ బిడ్డకు తల్లితండ్రులు ఉంటారనే ఉద్దేశంతోనే ఇలా చేశానని జాంగ్ చెప్పాడు. పోలీసులు జాంగ్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూశారుగా..! మ‌నుషుల మధ్య బంధాలు మ‌రీ ఎంత‌గా దిగ‌జారిపోయాయో..! ఇప్పుడు జాంగ్ కొడుకు ప‌రిస్థితి ఏంటో… త‌ల‌చుకుంటేనే హృద‌యం చ‌లించిపోతుంది..!

Comments

comments

Share this post

scroll to top