అత‌డు చ‌దివింది 6వ త‌ర‌గ‌తే… అయినా గొప్ప ఆవిష్క‌ర‌ణ చేశాడు..!

ఎవ‌రైనా ఏదైనా అద్భుతం చేయాలంటే అందుకు పెద్ద పెద్ద డిగ్రీలు చ‌ద‌వాల్సిన ప‌నిలేదు. చేయాల‌న్న త‌పన‌, ప‌ట్టుద‌ల, సంక‌ల్పంతోపాటు కొంత ప్రేర‌ణ ఉంటే చాలు, ఎవ‌రైనా ఏదైనా చేసి చూపించ‌వ‌చ్చు. అదిగో… ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా అదే చేశాడు. చ‌దివింది 6వ త‌ర‌గ‌తే అయినా అత‌ను చేసిన ఆవిష్క‌ర‌ణ వల్ల నేడు ఎన్నో కుటుంబాలు స్వ‌యం ఉపాధి పొందుతున్నాయి. ఈ క్రమంలో ఆ వ్య‌క్తి ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ లిస్ట్‌లో స్థానం సాధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అవార్డు కూడా అందుకున్నాడు. అత‌నే… చింత‌కింది మ‌ల్లేషం. తెలంగాణ రాష్ట్రంలోని షార్జిపేట అనే ఓ గ్రామానికి చెందిన వాడ‌త‌ను. అత‌ని త‌ల్లిదండ్రులు చేనేత దుస్తులు త‌యారు చేసేవారు. ఈ క్ర‌మంలో మ‌ల్లేషం తల్లి ల‌క్ష్మి నిత్యం కొన్ని గంట‌ల పాటు సాంప్ర‌దాయ చేనేత మిష‌న్‌పై ప‌నిచేసి చీర‌లు నేసేది. అయితే అది చాలా శ్ర‌మ‌తో కూడుకున్న‌ది. ఒక చీర నేసేందుకు సుమారు 5 నుంచి 6 గంట‌ల స‌మ‌యం ప‌ట్టేది. ఆ స‌మ‌యంలో చేతుల‌ను సుమారు 9వేల సార్లు పైకి కింద‌కి క‌దిలిస్తూ చీర‌ల‌ను నేయాల్సి వ‌చ్చేది. అయినా ఆమె ఆ ప‌నే చేసేది. ఎందుకంటే వారికి వ‌చ్చింది అదొక్క‌టే క‌దా.

mallesham

ఈ క్ర‌మంలో మ‌ల్లేషం 6వ త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు తండ్రి చ‌దువు మాన్పించాడు. దీంతో మ‌ల్లేషం కూడా అదే చేనేత యంత్రంపై ప‌నిచేసేందుకు పూనుకున్నాడు. అయితే అత‌ని త‌ల్లి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే అందులో చాలా శ్ర‌మ ఉంటుంద‌ని, అది అత‌ను త‌ట్టుకోలేడ‌ని చెప్పింది. దీంతో మ‌ల్లేషం ఎలాగైనా మ‌రింత సుల‌భంగా చేనేత దుస్తుల‌ను నేసేలా ఏదైనా ఒక కొత్త మిషన్‌ను క‌నిపెట్టాల‌ని అనుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా 6 ఏళ్ల పాటు శ్ర‌మించి మ‌రీ త‌న త‌ల్లి పేరిట ల‌క్ష్మి అసు మిష‌న్ అనే కొత్త ర‌క‌మైన చేనేత యంత్రాన్ని 1999లో త‌యారు చేశాడు. దాన్ని చెక్క ఫ్రేమ్‌ల‌తో త‌యారు చేశాడు. అయితే నిజానికి అసు అంటే దుస్తుల‌ను నేయ‌డానికి ముందు చేసే ఓ ప్ర‌క్రియ‌. ఈ క్ర‌మంలో మ‌ల్లేషం త‌యారు చేసిన ల‌క్ష్మి అసు మిష‌న్ కేవ‌లం ఒక‌టిన్న‌ర గంటలోనే చీర నేసేది. అందుకు మ‌నుషులు ద‌గ్గర ఉండాల్సిన ప‌నిలేదు. దీంతో చాలా శ్ర‌మ భారం కూడా త‌గ్గింది. అలా అత‌ని మిష‌న్ గురించి అంద‌రికీ తెలిసింది. అయితే ఆ మిష‌న్‌లో చెక్క‌కు బ‌దులుగా స్టీల్ వంటి లోహాల‌ను వాడి దాన్ని మ‌రింత మెరుగ్గా త‌యారు చేశాడు. ఈ క్ర‌మంలో చాలా మంది ఆ మిష‌న్‌ను కొనుగోలు చేసి సొంతంగా, ఎక్కువ శ్ర‌మ లేకుండా దుస్తులను నేస్తూ స్వ‌యం ఉపాధి పొంద‌సాగారు.

అలా మ‌ల్లేషం మిష‌న్‌ను త‌యారు చేయ‌డం, ఎంతో మంది జీవితాలు దాంతో బాగు ప‌డుతుండడంతో అత‌ని ఆవిష్క‌ర‌ణ‌కు అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిభా పాటిల్ 2009లో అవార్డును కూడా అంద‌జేశారు. ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో ఎమ‌ర్జింగ్ ఇండియ‌న్‌గా 7వ స్థానాన్ని పొంది ఆ అవార్డును కూడా అత‌ను కైవ‌సం చేసుకున్నాడు. మొన్నా మ‌ధ్య జ‌రిగిన అమేజింగ్ ఇండియ‌న్ అవార్డును ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా అందుకున్నాడు కూడా. ఈ క్ర‌మంలో మ‌ల్లేషం త‌యారు చేసిన మిష‌న్లు ఇప్ప‌టి వ‌రకు 800 అమ్ముడ‌య్యాయి. త్వ‌ర‌లో మ‌రిన్ని మిష‌న్ల‌ను త‌యారు చేసి చేనేత కార్మికుల‌కు అందిస్తానంటున్నాడు. అయితే ఒక్కో మిష‌న్ ధ‌ర రూ.25వేలు ఉండ‌డంతో దాన్ని కొన‌లేని వారికి 75 శాతం స‌బ్సిడీతో మిష‌న్‌ను అంద‌జేసేలా ఓ స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారం కూడా అత‌ను తీసుకుంటున్నాడు. ఇప్పుడు మ‌ల్లేషం యాదాద్రి జిల్లాలోని ఆలేర్‌లో ల‌క్ష్మీ అసు మిష‌న్ల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అక్క‌డి నుంచే మిష‌న్ల‌ను త‌యారు చేస్తూ చేనేత కార్మికుల‌కు అందిస్తున్నాడు. దీంతో అనేక మంది కార్మికులు స్వ‌యం ఉపాధి పొందుతున్నారు కూడా. 6వ త‌ర‌గతి మాత్ర‌మే చ‌దివినా అంత‌టి అద్భుత ఆవిష్క‌ర‌ణ చేసి, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న మ‌ల్లేషంకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top