కువైట్ లో భార‌తీయుడి క‌ష్టాలు… పాస్ పోర్ట్ లాగేసుకొని వేధిస్తున్న ఓన‌ర్.!

సుదూర ప్రాంతాల‌కు వెళ్లి, రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదించి క‌ష్టాల‌న్నింటినీ తొల‌గించుకోవాల‌ని చాలా మంది క‌ల‌లు కంటారు. ఆ క్ర‌మంలో వారు దుబాయ్‌, కువైట్ వంటి గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్తారు. అయితే తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన‌ట్టు క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదించాల‌నుకుని ఆయా దేశాల‌కు వెళ్లేవారికి అన్నీ చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. ప‌నిచేసే కంపెనీ లేదా షాపు వారు జీతం స‌రిగ్గా ఇవ్వ‌రు. దీనికి తోడు చిత్ర హింస‌ల‌కు గురి చేస్తారు. దేశం వ‌దిలి సొంత ఊరికి వెళ్దామంటే పాస్ పోర్టు లాక్కుంటారు. త‌ప్పించుకుని పోతే క్రిమిన‌ల్ కేసులు పెట్టి ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఫైన్‌గా గుంజుతారు. ఇదీ… గ‌ల్ఫ్ దేశాల్లో ఇప్పుడు చాలా మంది భార‌తీయులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప‌వన్ కుమార్ అనే వ్య‌క్తికి కూడా ఇలాంటి క‌ష్ట‌మే వ‌చ్చింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఉన్నావ్ అనే ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల ప‌వ‌న్ కుమార్ 2013 డిసెంబ‌ర్ 7 న డొమెస్టిక్ ఎంప్లాయ్‌మెంట్ వీసాపై కువైట్ వెళ్లాడు. అయితే మొద‌టి నాలుగు నెల‌ల పాటు అత‌నికి బాగానే న‌డిచింది. కానీ అత‌ను ప‌నిచేస్తున్న కంపెనీని ష‌మ్మ‌రి అనే ఓ వ్య‌క్తి కొనుగోలు చేశాడు. దీంతో అత‌ని కింద నెల రోజుల పాటు ప‌నిచేసిన ప‌వన్‌కు న‌ర‌కం క‌నిపించింది. సేల్స్ బాగా లేవంటూ ప‌వ‌న్‌ను అత‌ను ఎప్పుడూ వేధించేవాడు. ఒక్కోసారి అత‌ను త‌న కార్‌లో ప‌వ‌న్‌ను బంధించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టేవాడు. అయినా ప‌వ‌న్ ఆ బాధ‌ను భ‌రిస్తూనే ప‌నిచేశాడు. అయితే ప‌వ‌న్‌కు ష‌మ్మ‌రి జీతం స‌రిగ్గా ఇచ్చేవాడు కాదు. దీంతో ప‌వ‌న్ ఓసారి త‌న‌కు రావ‌ల్సిన బాకీ మొత్తాన్ని ఇవ్వ‌మ‌ని కోర‌గా, అందుకు ష‌మ్మ‌రి పేమెంట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి అది ముట్టిన‌ట్టుగా ఏవో కాగితాల‌పై సంత‌కం పెట్టించుకున్నాడు. ఆ కాగితాల్లో అంతా అర‌బిక్ భాష‌తో రాయ‌డంతో అందులో ఏముందో ప‌వ‌న్‌కు తెలియ‌లేదు. అదే అత‌న్ని మ‌రింత అగాథంలోకి నెట్టివేసింది.

ప‌వ‌న్‌కు అర‌బిక్ భాష రాక‌పోవ‌డంతో ష‌మ్మ‌రి ఆ కాగితాల్లో త‌నకు అనుకూలంగా రాసుకున్నాడు. అత‌నికి కొన్ని సంవ‌త్స‌రాల జీతాన్ని ముందే ఇచ్చిన‌ట్టుగా వాటిలో రాసుకున్నాడు. ఈ క్ర‌మంలో మ‌రి కొద్ది నెల‌ల‌కు ప‌వ‌న్ త‌న జీతం అడగ్గా అప్పుడు ష‌మ్మ‌రి అస‌లు విష‌యం చెప్పాడు. దీంతో ప‌వ‌న్ షాక్‌కు గురయ్యాడు. వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోయి అదే కంపెనీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ఇండియ‌న్ ఎంబ‌స్సీకి చేరుకున్నాడు. విష‌యాన్ని చెప్ప‌గా వారు స‌హాయం చేస్తామ‌ని చెప్పారు, కానీ ఆ విష‌యం గురించి మళ్లీ ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో ష‌మ్మ‌రి ప‌వ‌న్‌పై క్రిమిన‌ల్ కేసు పెట్టాడు. తన కంపెనీని చీటింగ్ చేసి వెళ్లినందుకు గాను ప‌వ‌న్ 2800 కువైట్ దీనార్స్ (దాదాపు 6 ల‌క్ష‌లు) త‌న‌కు న‌ష్ట ప‌రిహారంగా చెల్లించాల‌ని అత‌ను కేసు వేశాడు. దీంతో ప‌వ‌న్ అక్క‌డే ఇరుక్కుపోయాడు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ త‌న స‌మ‌స్య‌ను పరిష్క‌రించాల‌ని కేంద్ర మంత్రులు సుష్మా స్వ‌రాజ్‌, డాక్ట‌ర్ వీకే సింగ్‌ల‌కు ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్‌ల‌లో సందేశాడు పంపాడు. అయితే వీకే సింగ్ నుంచి ర‌క్షిస్తామ‌నే రిప్లై అందింది, కానీ అది మాట‌కే ప‌రిమిత‌మైంది. ఇంత వ‌ర‌కు ప‌వ‌న్ కోసం వారు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. కాగా ప‌వ‌న్‌ను బ‌య‌టికి ర‌ప్పించేందుకు కువైట్‌లోనే ష‌హీన్ స‌య్య‌ద్ అనే ఓ మ‌హిళా సామాజిక వేత్త కృషి చేస్తోంది. ఈమె గతంలోనూ కువైట్‌లో అలా ఆగిపోయిన 28 మంది బాధితుల‌ను సుర‌క్షితంగా ఇండియా వెళ్లేలా చేసింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆమే స్వ‌యంగా ప‌వ‌న్ కేసును చూస్తోంది. త్వ‌ర‌లో ప‌వ‌న్ ఇండియాకు వ‌స్తాడ‌ని ఆశిస్తోంది. అత‌నే కాదు, అలాంటి ఎందరో బాధితుల‌ను ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top