ఇత‌నో ఐఐటీ ప్రొఫెస‌ర్‌…తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇప్పుడిలా గడుపుతున్నాడు ఎందుకో తెలుసా?

ఢిల్లీ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీలు… ప్ర‌ఖ్యాత హూస్ట‌న్ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ ప‌ట్టా… అనంత‌రం ఐఐటీ ప్రొఫెస‌ర్‌గా ఉద్యోగం… ఇవ‌న్నీ ఉన్న వ్య‌క్తి ఎవ‌రైనా ఎలా ఉంటారు..? చాలా విలాస‌వంత‌మైన జీవితాన్ని హాయిగా గ‌డుపుతుంటారు. మంచి కారు, ఇల్లు, డిగ్నిఫైడ్ డ్రెస్‌, లెక్చ‌ర్లు, ప్ర‌సంగాలు, రీసెర్చ్‌లు… వెర‌సి ఏ ఐఐటీ ప్రొఫెస‌ర్ జీవిత‌మైనా ఇలాగే ఉంటుంది. ఇలాంటి వ్య‌క్తి త‌ల‌చుకుంటే ఏ యూనివ‌ర్సిటీ అయినా క‌ళ్ల‌క‌ద్దుకుని త‌మ వ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా జాబ్ ఇచ్చి, మంచి జీతం కూడా ఇస్తుంది. కానీ ఆ ఐఐటీ ప్రొఫెస‌ర్ మాత్రం అందుకు భిన్నం. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి, తాను అనుకున్న‌, త‌న‌కు న‌చ్చిన ప‌నిలో ఇప్పుడు ఆత్మ సంతృప్తి పొందుతున్నాడు. అయితే ఆయ‌నేదో వేరే ల‌క్ష‌లు తెచ్చి పెట్టే మ‌రో ఉద్యోగం చేస్తున్నాడ‌నుకుంటే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే ఆ ప్రొఫెస‌ర్ గ‌డుపుతోంది ఫ‌క్తు గిరిజ‌న జీవితం. ఆయన ఉన్న ప్ర‌దేశంలో రోడ్లు, హాస్పిట‌ల్, విద్యుత్ వంటి క‌నీస సౌక‌ర్యాలు కూడా లేవు. దీనికి తోడు ఆయ‌న‌కున్న‌వి ఓ సైకిల్‌, 3 జ‌త‌ల దుస్తులు మాత్ర‌మే. మీరు విన్న‌ది నిజ‌మే, మాజీ ఐఐటీ ప్రొఫెస‌ర్ అయినా ఇప్పుడు ఆయ‌న గ‌డుపుతున్న జీవితం చూస్తుంటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇంత‌కీ ఆయ‌న ఎందుకు అలా చేస్తున్నాడు..?

alok-sagar

ఢిల్లీకి చెందిన అలోక్ సాగ‌ర్ స్థానిక ఐఐటీలో ఇంజినీరింగ్ ప‌ట్టాను, అందులో మాస్ట‌ర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అనంత‌రం హూస్ట‌న్ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీని పూర్తి చేశారు. మ‌ళ్లీ ఢిల్లీ ఐఐటీలోనే ప్రొఫెస‌ర్‌గా చేరారు. ఈ క్ర‌మంలోనే మొన్నా మ‌ధ్య రాజీనామా చేసిన ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ వంటి ఎంతో మంది మేథావుల‌కు అలోక్ సాగ‌ర్ విద్య‌ను బోధించాడు. అయితే క్ర‌మంగా ఆయ‌న‌కు త‌న ఉద్యోగం ప‌ట్ల సంతృప్తి క‌ల‌గ‌లేదు. దీంతో 1982లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. అనంత‌రం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బేతుల్‌, హోషంగాబాద్ జిల్లాల్లో అట‌వీ ప్రాంతంలో ఉండ‌సాగాడు. ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీల వ‌ద్ద ఆయన త‌న కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

alok-sagar

దేశం బాగుప‌డాలంటే అందుకు మూల‌కార‌ణ‌మైన అట‌వీ, గిరిజ‌న ప్రాంతాలు, గ్రామాల్లో అభివృద్ధి జ‌ర‌గాల‌ని అలోక్ భావించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పైన చెప్పిన అట‌వీ ప్రాంతంలో ఉంటూ అక్క‌డి గిరిజ‌నుల జీవితాల‌ను బాగు చేయ‌డం ప్రారంభించారు. వారికి విద్య‌ను బోధించ‌డం, స్థానికంగా మొక్క‌లు నాట‌డం, విత్త‌నాల‌ను పంపిణీ చేస్తూ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను నేర్పించ‌డం వంటి సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న మునిగిపోయారు. అప్ప‌టి నుంచి అలోక్ సాగ‌ర్ ఆ గిరిజ‌న ప్రాంతాల‌కే అంకిత‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వారి భాష‌ల‌ను కూడా నేర్చుకుని అన‌ర్గ‌ళంగా మాట్లాడుతున్నాడు. వారి భాష‌లోనే వారి స‌మ‌స్య‌ల‌ను వింటూ వాటి ప‌రిష్కారం కోసం కృషి చేయ‌సాగాడు. అయితే ఒకానొక సంద‌ర్భంలో అక్క‌డి పోలీసులు అలోక్‌ను చూసి, అత‌ని వేషాన్ని గ‌మ‌నించి అత‌నిపై అనుమానం వ్య‌క్తం చేస్తూ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లార‌ట‌. వారి విచార‌ణ‌లో అలోక్ గురించిన అస‌లు విష‌యాలు తెలియ‌డంతో అప్ప‌టి నుంచి అలోక్ ప్రాచుర్యంలోకి వ‌చ్చారు. ఇప్ప‌టికి ఆయ‌న గిరిజ‌నుల‌తో ఉండ‌బ‌ట్టి దాదాపు 28 ఏళ్లు అయింది. అయినా త‌న శ్వాస ఉన్నంత వార‌కు వారి బాగు కోస‌మే పాటు ప‌డ‌తానంటున్నాడు అలోక్‌. ఇక చివరిగా ఇంకో విష‌యం. ఇన్నేళ్ల కాలంలో అలోక్ ఆయా గిరిజన ప్రాంతాల్లో నాటిన మొక్క‌లు ఎన్నో తెలుసా..? అక్ష‌రాలా 50వేలు. అవ‌న్నీ ఇప్పుడు పెద్ద‌గా అయ్యాయి. కొన్ని ఇంకా మొక్క‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఇదంతా అలోక్ చ‌లువే అంటారు ఆ ప్రాంత గిరిజ‌నులు. మంచి చ‌దువు, ఉద్యోగం ఉండి కూడా, విలాస‌వంత‌మైన జీవితాన్ని అనుభ‌వించే అవ‌కాశం ఉన్నా, అలోక్ సాగ‌ర్ వాటిని కాద‌ని త‌న ఆశ‌యం కోసం ప‌నిచేస్తుండ‌డం, ఆ ఆశ‌యం సామాజిక సేవ‌తో ముడిప‌డి ఉండ‌డం నిజంగా హర్ష‌నీయం. ఆయ‌న చొర‌వ‌కు, కృషికి నిజంగా అభినంద‌న‌లు తెల‌పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top