బీచ్ నుంచి 4300 ట‌న్నుల వ్య‌ర్థాల‌ను ఒంటి చేత్తో క్లీన్ చేసిన వ్య‌క్తి అత‌ను..!

మ‌న ఇంట్లోకి ఎవ‌రైనా చెత్తా చెదారం, మ‌ల విస‌ర్జ‌కాలు, వ్య‌ర్థాలు విసిరేస్తే మ‌నం చూస్తూ ఊరుకుంటామా..? ఊరుకోం క‌దా… ముందుగా ఆ ప‌ని చేసిన వారిని తిడ‌తాం. వీలుంటే కొడ‌తాం. అది కుద‌ర‌క‌పోతే క్లీన్ చేసుకోవ‌డం మ‌న‌కైతే త‌ప్ప‌దు క‌దా. మ‌రి నిత్యం వేల ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను స‌ముద్రాల్లోకి పారవేస్తున్నాం క‌దా, అవి చేప‌లు, తాబేళ్లు వంటి జీవ‌రాశుల‌కు ఇండ్ల వంటివి. మ‌రి వాటి ఇండ్ల‌లోకి మ‌నం వ్యర్థాల‌ను వేస్తే అవి క్లీన్ చేసుకోగ‌ల‌వా..? లేవు క‌దా..! అప్పుడు వాటిని ఎవ‌రు శుభ్రం చేస్తారు..? మ‌న‌మే చేయాలి..! అది మ‌న బాధ్య‌త‌..! స‌రిగ్గా ఇదే మాట‌లు చెబుతాడు ఆయ‌న కూడా. అందుకే కేవ‌లం సంవ‌త్స‌రంన్న‌ర‌ కాలంలోనే ముంబై బీచ్‌లో ఏకంగా 4300 ట‌న్నుల ప్లాస్టిక్ వ్యర్థాల‌ను ఒంటి చేత్తో తీసివేయ‌గ‌లిగాడు. ఆయ‌నే ముంబైకి చెందిన లాయ‌ర్ అఫ్రోజ్ షా.

Afroz-Shah-1

Afroz-Shah-2

అఫ్రోజ్ షా 2015లో ముంబైకి వ‌ల‌స వ‌చ్చాడు. ఆయ‌న అక్క‌డి హై కోర్టులో లాయర్‌. అయితే ఒక రోజు అత‌ను స్థానికంగా ఉన్న వెర్సోవా బీచ్‌లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌, ఇత‌ర చెత్త, వ్య‌ర్థాలు పేరుక‌పోవ‌డం చూశాడు. దీంతో అత‌ని మ‌న‌స్సు చివుక్కుమంది. అలాంటి ప్ర‌కృతి స‌హ‌జ‌సిద్ధ వాతావ‌ర‌ణం క‌లుషితం కావడాన్ని అత‌ను స‌హించ‌లేక‌పోయాడు. అయితే దాన్ని క్లీన్ చేసేందుకు ప్ర‌భుత్వానికి ఆదేశాలిచ్చేలా కోర్టులో ఆయ‌న ఓ పిల్ వేయ‌గ‌ల‌డు. లాయ‌ర్ కనుక అత‌నికి ఆ ప‌నిచేయ‌డం ఎంత‌గానో సులువు. కానీ అలా చేయ‌లేదు. సొంతంగా తానే ఆ బీచ్ క్లీనింగ్ బాధ్య‌త‌ను చేప‌ట్టాడు. ఈ క్ర‌మంలో 2015 అక్టోబ‌ర్ నెల‌లో అఫ్రోజ్ షా త‌న స్నేహితుడితో క‌లిసి వెర్సోవా బీచ్‌ను శుభ్రం చేయ‌సాగాడు. దీంతో రాను రాను అలా క్లీనింగ్ చేసే వారి సంఖ్య పెరిగింది.

ఒకానొక ద‌శ‌లో అఫ్రోజ్ షా స్థానికంగా ఉన్న మురికి వాడ‌లు, ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు బీచ్ శుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కూడా మొద‌లు పెట్టాడు. దీంతో చాలా మంది ఆయన చేస్తున్న కార్య‌క్ర‌మానికి జ‌త క‌లిశారు. అలా అందరూ క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం కాల వ్య‌వ‌ధిలోనే దాదాపుగా 4300 ట‌న్నుల‌కు పైగా ప్లాస్టిక్‌ను స‌ముద్రం బీచ్ నుంచి తీసేశారు. దీంతో అక్క‌డ 90 శాతం శుభ్ర‌త ప‌నులు పూర్త‌య్యాయి. మ‌రో 10 శాతం శుభ్రం చేస్తే చాలు ఆ బీచ్ అంతా స‌ర్వాంగ సుంద‌రంగా మారుతుంద‌ని అఫ్రోజ్ షా అంటున్నాడు. అయితే అలా బీచ్‌ను శుభ్రం చేసినందుకు గాను ఆయ‌న‌కు యునైటెడ్ నేష‌న్స్ అవార్డు కూడా ప్ర‌దానం చేసింది. ఎర్త్ అవార్డుతో ఆయ‌న‌ను గౌర‌వించింది. అయిన‌ప్ప‌టికీ బీచ్ క్లీనింగ్ ప్ర‌క్రియ‌లో ఆగేది లేద‌ని, మ‌రింత మందిని తోడు తీసుకెళ్లి దాన్ని పూర్తిగా శుభ్రం చేస్తాన‌ని అంటున్నాడు అఫ్రోజ్ షా. అత‌ని ల‌క్ష్యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top