కంపెనీలో ప‌ని చేసిన ఉద్యోగే… కంపెనీని కొనేశాడు..!

కొన్ని వంద‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన ఓ కంపెనీని అందులోనే చాలా త‌క్కువ వేతనానికి ప‌నిచేస్తున్న ఎవ‌రైనా ఉద్యోగి కొన‌గ‌ల‌రా..? అస్స‌లు ఆ మాటలే ఊహ‌కు అంద‌వు. అలాంటిది… అంత పెద్ద కంపెనీని ఓ సామాన్య ఉద్యోగి ఎలా కొనుగోలు చేస్తాడు..? అదీ అందులో ప‌నిచేస్తూనే… ఇది ఎలా సాధ్య‌మ‌వుతుంది… అస్స‌లే కాదు..! అని అన‌బోతున్నారా..! అయితే ఆగండి..! ఎందుకంటే అది సాధ్య‌మైంది కాబ‌ట్టి. అవును, షాకింగ్ ఉన్నా ఇది నిజ‌మే. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ వ్య‌క్తి గురించే. ఆయ‌న ఒకప్పుడు సాధార‌ణ ఉద్యోగిగా ఆ కంపెనీలో ప‌నిచేశాడు. కానీ… ఓడ‌లు బ‌ళ్లు… బ‌ళ్లు ఓడ‌లు అయిన‌ట్టుగా… ఆ వ్య‌క్తికి కాలం క‌ల‌సి వ‌చ్చింది. దీంతో ఏకంగా తాను ప‌నిచేస్తున్న కంపెనీనే కొనుగోలు చేసి ఇప్పుడు టాప్ కోటీశ్వ‌రుల్లో ఒక‌రిగా మారాడు. ఆయ‌నే రాహుల్ శుక్లా..! ఎస్ఎస్ వైట్‌ టెక్నాలజీస్ (ఎస్ఎస్‌డబ్ల్యూటీ) య‌జ‌మాని..!

rahul-shukla-ss-white

రాహుల్ శుక్లాది గుజ‌రాత్ రాష్ట్రం. అక్క‌డి సురేంద్ర న‌గర్ అనే జిల్లాలోని వాద్వాన్ ప్రాంతంలో నివాసం ఉండే వాడు. అయితే ఆయ‌న విద్యాభ్యాసం మాత్రం వాద్వాన్‌తోపాటు భావ్ న‌గ‌ర్‌, అహ్మ‌దాబాద్‌ల‌లో సాగింది. ఈ క్ర‌మంలో అత‌ను 1971లో ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఓ వైపు చ‌దువుకుంటూనే మ‌రో వైపు పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవాడు. ఈ క్ర‌మంలో విద్యాభ్యాసం కాగానే ఇండియాకు వ‌చ్చిన శుక్లా టెంప‌ర‌రీ ఉద్యోగిగా ఎస్ఎస్ వైట్‌లో చేరాడు. అందులోనే కారు డ్రైవర్‌ గా, సెక్యూరిటీ గార్డుగా, వెయిటర్ గా కూడా పనిచేశాడు. అనంత‌రం క్వాలిటీ కంట్రోల్ ఇన్ స్పెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహించాడు. అయితే 1988లో ఎస్ఎస్ వైట్‌ కంపెనీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో కంపెనీ మూసివేత ద‌శ‌కు వ‌చ్చేసింది.

కంపెనీ ప‌రిస్థితి అలా దిగ‌జారే స‌రికి శుక్లా ఆ విష‌యం ఇంట్లో త‌న భార్య మీనాకు చెప్పాడు. ఈ క్ర‌మంలో ఆమె త‌రువాత ఏం చేస్తార‌ని శుక్లాను అడ‌గ్గా, అప్పుడు శుక్లా చెప్పిన స‌మాధానం మీనాను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎలాగైనా ఆ కంపెనీని కొంటాన‌ని అన్నాడు. అయితే అందుకు దాదాపు రూ.41 కోట్లు కావాలి. కానీ వారు కూడ‌బెట్టుకున్న డ‌బ్బు రూ.4.85 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉంది. దీంతో మిగ‌తా డ‌బ్బు కోసం అత‌ను బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎలాగైనా కంపెనీని లాభాల ప‌ట్టిస్తాన‌ని చెప్పి, లోన్ తీసుకున్నాడు. దీంతో అత‌ను కంపెనీ కొనేశాడు. ఇక అక్కడి నుంచి శుక్లా వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఎస్ఎస్ వైట్‌లో విమానాల‌కు చెందిన షాఫ్ట్‌లు, ఇత‌ర విడి భాగాలు, ల్యాండ్ అయ్యే సమయంలో అవసరమయ్యే థ్రస్ట్‌ రివర్సల్‌ సిస్టమ్ ల‌ను అత‌ను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో ఆ రంగం అత‌నికి బాగా క‌ల‌సి వ‌చ్చింది. అలా శుక్లా దిన దినాభివృద్ధి చెంది ఇప్పుడు టాప్ ట‌ర్నోవ‌ర్ క‌లిగిన సంస్థ‌ల్లో ఒక‌టిగా ఎస్ఎస్ వైట్‌ను నిల‌ప‌డ‌మే కాదు, అత‌నూ టాప్ కోటీశ్వ‌రుల్లో ఒక‌డ‌య్యాడు. ఇప్పుడు ఎస్ఎస్ వైట్‌కు చెందిన కంపెనీలు మ‌న దేశంలోనే కాదు, అమెరికా, యూకేల‌లోనూ ఉన్నాయి. వాటి ద్వారా ఆయా విమాన సంస్థ‌ల‌కు విడి భాగాల‌ను ఆయ‌న కంపెనీ స‌ర‌ఫ‌రా చేస్తుంటుంది. ఇప్పుడు వాడుతున్న విమాన షాఫ్ట్‌ల‌లో దాదాపు 98 శాతం షాఫ్ట్‌లు శుక్లా కంపెనీలో త‌యారైన‌వే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..? అంతలా అత‌ను త‌న కంపెనీని లాభాల బాట ప‌ట్టించాడు. నిజ‌మే మ‌రి..! సంక‌ల్పం, ప‌ట్టుద‌ల ఉండాలే గానీ ఎవ‌రైనా వ్యాపార రంగంలో అలా రాణించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top