అత‌ను ఒక‌ప్పుడు డోర్ టు డోర్ సేల్స్‌మ‌న్‌. ఇప్పుడు వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న కంపెనీకి అధిప‌తి..!

”నిర్మా.. నిర్మా… వాషింగ్ పౌడ‌ర్ నిర్మా…” అంటూ అప్ప‌ట్లో ఒక యాడ్ వ‌చ్చేది గుర్తుంది క‌దా. అది అప్పుడు సంచ‌ల‌నం. విదేశీ బ్రాండ్ల‌కు చెందిన స‌ర్ఫ్ పౌడ‌ర్‌ల‌ను తోసిరాజ‌ని దేశీయ బ్రాండ్ అయిన నిర్మా డిట‌ర్జెంట్ పౌడ‌ర్ మార్కెట్‌లో గొప్ప బ్రాండ్‌గా అవ‌త‌రించింది. అప్ప‌టి నుంచి ఇక ఆ పౌడ‌ర్‌కు తిరుగులేదు. ఈ క్ర‌మంలోనే నిర్మా గ్రూప్‌కు చెందిన అనేక ఉత్పత్తులు ఇప్పుడు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే నిర్మా డిట‌ర్జెంట్ పౌడ‌ర్ అంత‌టి సంచ‌ల‌నంగా మార‌డానికి వెనుక ఓ వ్య‌క్తి క‌ష్టం ఉంది. తీవ్ర‌మైన కృషి, శ్ర‌మ ఉన్నాయి. ఆ పౌడ‌ర్‌ను మార్కెట్‌లో అగ్ర స్థానంలో నిల‌బెట్టేందుకు ఆ వ్య‌క్త ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే..?

ఆయ‌నే డాక్ట‌ర్ కార్స‌న్‌భాయ్ ఖోదిదాస్ ప‌టేల్. ఆయ‌న్ను కేకే ప‌టేల్ అని కూడా పిలుస్తారు. ప‌టేల్‌ది గుజ‌రాత్ రాష్ట్రంలోని అహ్మ‌దాబాద్ స‌మీపంలో ఉన్న ఓ చిన్న కుగ్రామం. రైతు కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు. 21 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో బీఎస్సీ కెమిస్ట్రీ విద్య‌ను అభ్య‌సించారు. అయితే ఆయ‌న‌కు ఎప్ప‌టికైనా ఓ కంపెనీ పెట్టి వ్యాపారంలో వృద్ధి చెందాల‌ని కోరిక ఉండేది. అందులో భాగంగానే ఆయ‌న డిట‌ర్జెంట్ పౌడ‌ర్ త‌యారీపై ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ఈ క్ర‌మంలోనే త‌న ఇంటి వెన‌క పెర‌ట్లో ఆ పౌడ‌ర్‌ను త‌యారు చేసేవాడు. అయితే అందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బును కూడా ఆయ‌నే స్వ‌యంగా సంపాదించే వారు. అహ్మ‌దాబాద్‌లో ఉన్న ఓ టెక్స్‌టైల్ మిల్‌లో ల్యాబ్ టెక్నిషియ‌న్‌గా ప‌నిచేసేవాడు. అందులో సంపాదించే డ‌బ్బుతోనే ఆయ‌న సొంతంగా డిట‌ర్జెంట్ పౌడ‌ర్‌ను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాడు.

అలా ప‌టేల్ తాను త‌యారు చేసిన డిట‌ర్జెంట్ పౌడ‌ర్‌ను ఇల్లిల్లు తిరుగుతూ అమ్మేవాడు. ఆ పౌడ‌ర్‌ను కూడా చాలా మంది కొనేవారు. ఈ క్ర‌మంలోనే ప‌టేల్ సొంతంగా చిన్న‌పాటి డిట‌ర్జెంట్ పౌడ‌ర్ తయారీ ప‌రిశ్ర‌మను ప్రారంభించాడు. అందులో త‌యారు చేసే పౌడ‌ర్‌ను ఆయ‌న చాలా త‌క్కువ ధ‌ర‌కే అమ్మ‌సాగాడు. అప్ప‌ట్లో.. అంటే 1969ల‌లో… విదేశీ బ్రాండ్లు అయిన హిందుస్తాన్ లీవ‌ర్‌, స‌ర్ఫ్‌లు కేజీ డిట‌ర్జెంట్ పౌడ‌ర్ ను రూ.13కు అమ్మేవి. కానీ ప‌టేల్ త‌న డిట‌ర్జెంట్ పౌడ‌ర్ ను కేవ‌లం రూ.3కే కేజీ ఇచ్చేవాడు. అదీ గాక ఆ పౌడ‌ర్ చాలా క్వాలిటీతో ఉండేది. ఇంకేముందీ.. అది కాస్తా హిట్ అయ్యింది. జ‌నాలు కొన‌డం మొద‌లు పెట్టారు. దీంతో అన‌తి కాలంలో నిర్మా పౌడ‌ర్ ఎంతో పేరుగాంచింది. ఆ సంస్థ‌కు లాభాల‌ను తెచ్చి పెట్టింది. అయితే ఆ పౌడ‌ర్‌కు నిర్మా అని పేరు పెట్టడం వెనుక ఓ కార‌ణం కూడా ఉంది. అదేమిటంటే… ప‌టేల్ కూతురు నిరుప‌మ ఓ యాక్సిడెంట్‌లో మృతి చెందింది. దీంతో ఆమె పేరు మీదుగా ఆ పౌడ‌ర్‌కు నిర్మా డిట‌ర్జెంట్ పౌడ‌ర్ అని పేరు పెట్టారు. అలా పెట్ట‌డం ఏమోగానీ ఆ పౌడ‌ర్ చాలా విజ‌య‌వంత‌మైంది.

కాగా ప‌టేల్ అక్క‌డితో ఆగిపోలేదు. నిర్మా గ్రూప్ కింద ఇంకా చాలా ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసి అందించ‌డం మొద‌లు పెట్టారు. అన్నీ క్వాలిటీతో అందించేవారు. అందుకే నిర్మా ఉత్ప‌త్తుల‌న్నీ అంత పేరుగాంచాయి. ముఖ్యంగా అప్ప‌ట్లో నిర్మా డిట‌ర్జెంట్ పౌడ‌ర్ మీద వ‌చ్చే యాడ్ అందరినీ క‌ట్టి ప‌డేసేది. ”Sabki Pasand Nirma, Washing Powder Nirma” అంటూ హిందీలో వ‌చ్చే యాడ్‌కు అంద‌రూ ఫిదా అయిపోయేవారు. ఈ క్ర‌మంలో నిర్మా కంపెనీ విదేశీ బ్రాండ్ల‌కు చాలా గ‌ట్టిపోటీనే ఇచ్చింది. కాగా ప‌టేల్ 1995లో నిర్మా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీని, 2004లో నిర్మా ల్యాబ్స్ ఎడ్యుకేష‌న్ ప్రాజెక్ట్‌ను స్థాపించి విద్యారంగంలో అడుగు పెట్టారు. 2009లో ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ దేశంలోనే 92వ స్థానంలో ఉన్న కోటీశ్వ‌రుడిగా ప‌టేల్‌కు స్థానం క‌ల్పించింది. 2010లో ఆయ‌న్ను ప‌ద్మ‌శ్రీ వ‌రించింది. దేశంలోని ప్ర‌ముఖ బ్రాండ్ల‌లో నిర్మా 9వ స్థానంలో నిలిచింది. నిర్మా కంపెనీకి చెందిన టాయిలెట్ సోప్ ల‌క్స్‌, లైఫ్ బాయ్ స‌బ్బుల త‌రువాత స్థానంలో అత్యంత ఎక్కువ‌గా అమ్ముడ‌వుతున్న స‌బ్బుగా స్థానం సంపాదించింది. వీటిన్నింటినీ స్వ‌యంగా కేకే ప‌టేల్ త‌యారు చేశారంటే న‌మ్మ‌గ‌ల‌రా..? ఈ ఘ‌న‌త‌ల‌న్నింటికీ కూడా ఆయ‌నే కార‌ణం. అందుకు ఆయ‌న్ను అంద‌రూ అభినందించాల్సిందే. ఆయ‌న జీవితాన్ని యువ ఔత్సాహికులు ఆద‌ర్శంగా తీసుకోవాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top