కూలిగా ప‌నిచేసిన ఆ వ్య‌క్తి త‌న ఆరుగురు కూతుళ్ల‌ను మేయ‌ర్‌, డాక్ట‌ర్స్‌, పోలీస్ అధికారుల‌ను చేశాడు..!

ప్ర‌పంచాన్ని మార్చేయ‌గ‌ల శ‌క్తి ఉన్న గొప్ప ఆయుధం చ‌దువు – నెల్స‌న్ మండేలా. అవును, నిజ‌మే. చ‌దువుకే ఆ ప‌ని సాధ్య‌మ‌వుతుంది. క‌నుకే ఆ వ్య‌క్తి తాను క‌ష్ట‌ప‌డి చ‌దివి ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌డమే కాదు, త‌న ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడిని దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దాడు. వారంద‌రికీ నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం కోసం తాను క‌ష్ట‌ప‌డి ముందుండి వారిని న‌డిపించాడు. అత‌నే రాజ‌స్థాన్ కు చెందిన రూపారాం ధ‌న్‌దేవ్‌.

Rooparam-Dhandev

రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్ జిల్లా చెలాక్ గ్రామంలో ఓ పేద ద‌ళిత కుటుంబంలో రూపారాం జ‌న్మించాడు. తండ్రి కూలి ప‌ని చేసేవాడు. అయినా రూపారాంను అత‌ను క‌ష్ట‌ప‌డి చ‌దివించాడు. కాగా తండ్రి శ్ర‌మ‌ను రూపారాం ఎన్న‌డూ వృథా చేయ‌లేదు. చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువుల్లో శ్ర‌ద్ధ‌ను క‌న‌బ‌రిచాడు. అలా అత‌ను హై స్కూల్ విద్య‌లో ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచి టాప్‌గా నిలిచాడు. అయితే ఆపై చ‌దువులు చ‌దివేందుకు అత‌ని వ‌ద్ద డ‌బ్బు లేదు. దీంతో అత‌నికి అత‌ని స్కూల్ ఉపాధ్యాయులు స‌హాయం చేశారు. అదే సమ‌యంలో రూపారాంకు పెళ్లి కూడా అయింది. అయినా అత‌ని ధ్యాసంతా చ‌దువు మీదే ఉండేది. అలా అత‌ను క‌ష్ట‌ప‌డి చ‌దువుతూనే ఖాళీ దొరికిన‌ప్ప‌డల్లా కూలి ప‌నులు చేసే వాడు. ఆ డ‌బ్బుతోనే ఓ వైపు కుటుంబాన్ని పోషిస్తూ మ‌రో వైపు విద్య‌న‌భ్య‌సించాడు. ఎట్ట‌కేల‌కు ఎంబీఎం ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించ‌డంతో అత‌నికి రాజస్థాన్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్ట్ వ‌చ్చింది. అయితే రూపారాం అంత‌టితో ఆగ‌లేదు. త‌న పిల్ల‌ల‌ను కూడా ప్ర‌యోజ‌కుల‌ను చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. అందులో భాగంగానే త‌న ఆరుగురు కూతుళ్లు, ఓ కుమారుడిని ప్ర‌యోజకులుగా తీర్చిదిద్దాడు.

Rooparam-Dhandev-children

రూపారాం మొద‌టి కుమార్తె అంజ‌న ఇప్పుడు జై సల్మీర్ మేయ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, రెండో కుమార్తె గోమ‌తి డెంటిస్ట్‌ అయింది. మూడో కుమార్తె రాజేశ్వ‌రి పీడియాట్రిషిన్ అయింది. నాలుగవ కుమార్తె ప్రేమ్ జై స‌ల్మీర్ ఆర్‌పీఎస్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తోంది. 5వ కుమార్తె డెంటిస్ట్‌గా ప‌నిచేస్తుండ‌గా, 6వ కుమార్తె కాలిఫోర్నియాలో మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దువుతోంది. ఇక రూపారాం ఒక్క‌గానొక్క కుమారుడు హ‌రీష్ అక్క‌డి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో జూనియ‌ర్ ఇంజినీర్‌గా ప‌నిచేశాడు. అయితే వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ‌తో ఇప్పుడ‌త‌ను క‌ల‌బంద పంట పండిస్తూ కోట్లు గ‌డిస్తున్నాడు. ఇదీ… ఓ పేద ద‌ళిత కుటుంబంలో పుట్టిన వ్య‌క్తి విజ‌య ప‌రంప‌ర. అయితే రూపారాం ఒక్క‌డే కాదు, అత‌నికి, అత‌ని మొద‌టి ఐదుగురు కూతుళ్లకు అంద‌రికీ కామ‌న్‌గా ఓ పోలిక ఉంది. అదేంటంటే… వారు చేస్తున్న ఆయా పోస్టులను సాధించిన మొద‌టి ద‌ళిత వ్య‌క్తులు జై స‌ల్మీర్‌లో వారే కావ‌డం విశేషం..! ఏది ఏమైనా ఓ వైపు కూలిగా ప‌నిచేస్తూనే మ‌రో వైపు తాను ప్ర‌యోజ‌కుడిగా మార‌డమే కాదు, త‌న‌కు పుట్టిన సంతానాన్ని కూడా ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దిన రూపారాంకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top