గుజరాత్‌లోని ఆ బీచ్‌ను ఓ సోషల్ సైంటిస్ట్ ఒక్కడే 4 ఏళ్లుగా శుభ్రం చేస్తున్నాడు..! 

రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడైనా చెత్త కనిపిస్తే మీరు ఏం చేస్తారు? సాధారణంగా ఎవరైనా ముక్కు మూసుకుని వెళ్తారు. ఆ చెత్త నుంచి వీలైనంత త్వరగా దూరంగా వెళ్లేందుకు ప్రాధాన్యతనిస్తారు. కానీ దాని గురించి మాత్రం దాదాపు ఎవరూ పట్టించుకోరు. అయితే గుజరాత్‌కు చెందిన ఆ సామాజిక వేత్త మాత్రం అలా కాదు. తనకు చెత్త కనిపిస్తే చాలు, వెంటనే దాన్ని తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తాడు. ఇలా ఆయన గత కొన్నేళ్లుగా రోజూ తన ఇంటి దగ్గర ఉన్న బీచ్‌ను శుభ్రం చేస్తూ స్వచ్ఛత, పరిశుభ్రత గురించి అందరూ ఆలోచించేలా చేస్తున్నాడు.
గుజరాత్‌లోని దండి అనే గ్రామంలో నివసించే డాక్టర్ కాలు దంగార్ సోషల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈయన ప్రజలు ఎక్కువగా తిరిగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనపడితే ఎంత మాత్రం ఊరుకోరు. దాన్ని వెంటనే శుభ్రం చేస్తారు. ఈ క్రమంలో ఆయన తన ఇంటికి సమీపంలో ఉన్న బీచ్ వద్ద సందర్శకుల కారణంగా రోజు రోజుకీ పేరుకుపోతున్న చెత్త, వ్యర్థాలను గమనించాడు. దీంతో ఎలాగైనా ఆ బీచ్‌ను శుభ్రం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ఉదయాన్నే 6.30 గంటలకు తన ఇంటి నుంచి ఆ బీచ్‌కు వచ్చి దాదాపు 3 కిలోమీటర్ల పొడవునా బీచ్‌లో నడుస్తూ తనకు కనిపించే ప్రతి చెత్త, వ్యర్థ పదార్థాలను ఏరడం మొదలు పెట్టాడు. అలా తీసిన చెత్తను ఆయనే స్వయంగా చెత్తకుండీలో వేస్తారు. అంతేకాదు ఆ బీచ్ ఎంట్రన్స్ వద్ద ఉన్న ఓ తోటను స్వయంగా పర్యవేక్షిస్తారు. అక్కడి వాటర్ ట్యాంక్‌లో నిత్యం 2వేల లీటర్ల నీటిని నింపుతాడు.
man-cleaning-beach
అలా గత 4 ఏళ్లుగా డాక్టర్ కాలు దంగార్ ఆ బీచ్‌ను తానొక్కడే శుభ్రం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బీచ్ గుజరాత్‌లోని టాప్ బీచ్‌లలో ఒకటిగా మారింది. అత్యంత శుభ్రంగా ఉండే బీచ్‌గా కూడా అది గుర్తింపు పొందింది. ఇదంతా డాక్టర్ దంగార్ చలవే. అయితే ఆయన ఈ నాలుగేళ్లుగా చేస్తున్న పని మరొక్కటి కూడా ఉంది. అదేమిటంటే సాయంత్రం వేళల్లో బీచ్‌కు వచ్చి అక్కడి సందర్శకులకు చెత్త వేయవద్దని, దాన్ని కుండీల్లోనే వేయాలని చెబుతాడట. అయితే అధికశాతం మంది ఆయన సూచనను పాటించినా కొంత మంది మాత్రం ఇంకా అక్కడ చెత్త వేస్తూనే ఉన్నారట. త్వరలో అది కూడా లేకుండా చూస్తానని డాక్టర్ దంగార్ చెబుతున్నారు.
కేవలం మన పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాదు, ప్రజలు తిరిగే బహిరంగ ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉండాలని చాటి చెబుతూ డాక్టర్ దంగార్ చేస్తున్న పని ఇప్పుడక్కడ అందరినీ శుభ్రత పట్ల మేల్కొల్పుతోంది. డాక్టర్ దంగార్‌లా సమాజంలోని అందరూ చేస్తే అప్పుడు పరిశుభ్ర భారత్‌ను మనం చూడవచ్చు.

Comments

comments

Share this post

scroll to top