తన కొడుకు చావు బతుకుల మద్య ఉన్నప్పటికీ….మానవత్వం మరవని మంచి మనిషి.

అత‌నిక‌ప్పుడు ఉద్యోగం లేదు. దీనికి తోడు త‌న ఒక్క‌గానొక్క కొడుక్కి త‌ట్టుకోలేని అనారోగ్యం. ఆ స‌మ‌యంలో ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి. ఒకానొక క్ర‌మంలో అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు కూడా సిద్ధ‌ప‌డ్డాడు. కానీ ఆ ప‌నిచేయ‌లేదు. అందుకు కార‌ణ‌మేమిటంటే, అత‌ని జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే. ఆ సంఘ‌ట‌నే అత‌న్ని జీవితాన్ని మార్చేసింది. కేవ‌లం అత‌నికే కాదు, ఆ సంఘ‌ట‌న నేడు ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా చేసింది. అయితే ఆ సంఘ‌ట‌న కార‌ణంగా ఇప్ప‌టికీ ఆయ‌న ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు. ఎందుక‌ని? ఏంటా సంఘ‌ట‌న‌? తెలుసుకుందాం రండి!

అదిప్ప‌టి మాట కాదు. ఒక‌ప్ప‌టి మాట‌. అప్పుడు 1964. డ‌బ్బుకు చాలా విలువ ఉన్న రోజుల‌వి. చేతిలో ఒక 10 రూపాయ‌లు ఉంటే చాలు ఎంతో విలువైన‌విగా భావించేవారు. ఆ రోజుల్లో కేవ‌లం ఒక రూపాయి ఉంటే చాలు, నెల మొత్తం బ‌తికేందుకు అవ‌స‌ర‌మైన స‌రుకులు వ‌చ్చేవి. ఆ స‌మ‌యంలో గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన నాగిందాస్ షా అనే వ్య‌క్తికి ఉద్యోగం లేదు. చేసేందుకు ప‌ని దొర‌క‌డం లేదు. ఎక్క‌డా స‌హాయం చేసే వారు కూడా లేరు. దీంతో కుటుంబం గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉండేది. దీనికి తోడు ఉన్న ఒక్క‌గానొక్క రెండేళ్ల‌ కొడుక్కి ఆస్త‌మా. అది ఒక్కోసారి ఇంకా ఎక్కువై ప్రాణాల మీద‌కు తెస్తుండేది. అయితే నాగిందాస్ పుణ్య‌మో, అత‌ని కొడుకు పుణ్య‌మో ఎప్పుడు హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా వెంట‌నే కోలుకుని మ‌ళ్లీ ఇంటికి తిరిగి వ‌చ్చేవాడు. అయితే ఒకానొక స‌మ‌యంలో ఆ బాలుడికి ఆస్త‌మా మ‌రింత ఎక్కువైంది. దీంతో ఎప్ప‌టిలాగే నాగిందాస్ షా త‌న కుమారుడ్ని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు. అయితే ఈ సారి త‌న కొడుకు ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మార‌డంతో అత‌ను బ‌తికే అవ‌కాశం లేద‌ని భావించాడు. కానీ ఏదో ఒక మూల ఆశ ఉండ‌డంతో త‌న స్నేహితుడి వద్ద రూ.25 అప్పు తీసుకుని వచ్చి ఆస్పత్రిలో త‌న కొడుకు చికిత్స కోసం వేచి చూస్తున్నాడు.

Nagindas-Shah

అయితే అప్పుడే ఓ మ‌హిళ త‌న కొడుకు ప‌క్క‌నే ఉన్న మ‌రో బెడ్ వ‌ద్ద కూర్చుని రోదిస్తోంది. ఎందుకేడుస్తున్నావ‌ని నాగిందాస్ ఆ మ‌హిళ‌ను ప్ర‌శ్నించ‌గా త‌న కుమారుడి చికిత్స కోసం రూ.25 అవ‌స‌రం అని, కానీ త‌న వ‌ద్ద రూ.3 మాత్ర‌మే ఉన్నాయ‌ని, దీంతో త‌న కొడుకును బ‌తికించుకోలేన‌ని ఆమె త‌న వేద‌న‌ను నాగిందాస్ షాకు చెప్పింది. అప్పుడు నాగిందాస్ షా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. విష‌మ ప‌రిస్థితిలో ఉన్న త‌న కొడుకు ఎలాగూ బ‌త‌క‌లేడు. త‌న వ‌ద్ద ఉన్న రూ.25 ల‌ను ఆమెకిచ్చేస్తే ఆమె కొడుకైనా బ‌తుకుతాడు క‌దా, అని నాగిందాస్ షా అనుకున్నాడు. దీంతో వెంట‌నే త‌న వ‌ద్ద ఉన్న రూ.25 ల‌ను ఆమెకిచ్చేశాడు. అయితే వైద్యులు మాత్రం ఆ డ‌బ్బులు స‌రిపోవ‌ని, చికిత్స కోసం మ‌రిన్నిడ‌బ్బులు కావ‌ల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. దీంతో నాగిందాస్ షా ఎలాగైనా ఆ బాలుడ్ని బ‌తికించాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా స్థానికంగా ఉన్న ఓ మార్కెట్‌కు వెళ్లి అక్క‌డ క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆ మ‌హిళ బాధ‌ను వివ‌రించి స‌హాయం చేయ‌మ‌ని అడిగాడు. అయితే నాగిందాస్ ప్రార్థ‌న‌ను ఎవ‌రూ ఆల‌కించ‌లేదు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు వ్యాపారులు అత‌నికి రూ.51 చొప్పున మొత్తం రూ.102ను ఇచ్చారు. దీంతో నాగిందాస్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. వెంట‌నే హాస్పిట‌ల్‌కు చేరుకుని ఆ మ‌హిళ కొడుక్కి చికిత్స చేయించాడు. దీంతో ఆ బాలుడు కోలుకున్నాడు. అయితే అదే స‌మ‌యంలో అనుకోకుండా, ఆశ్చ‌ర్యంగా త‌న కుమారుడు కూడా కోలుకున్నాడు. దీంతో నాగిందాస్ మ‌రోసారి ఇంకా ఎక్కువ సంతోష‌ప‌డ్డాడు. కాగా త‌న‌కు వ‌చ్చిన ఆ రూ.102లో కేవ‌లం రూ.30 మాత్ర‌మే ఆ ఇద్ద‌రు చిన్నారుల‌కు చికిత్స కోసం ఖర్చ‌యింది. దీంతో మ‌రో రూ.72 దాకా మిగిలాయి. వాటిని తిరిగి ఆ వ్యాపారుల‌కు ఇద్దామ‌ని మార్కెట్‌కు వెళ్లాడు. కానీ వారు ఆ డ‌బ్బును తీసుకోలేదు. ఎవ‌రైనా అవ‌స‌రం ఉన్న ఇత‌ర పేద‌ల‌కు ఆ డ‌బ్బును ఇవ్వ‌మ‌ని వారు చెప్పారు.

ఈ క్ర‌మంలో నాగిందాస్ షా త‌న సామాజిక సేవ‌ను మొద‌లుపెట్టాడు. అది అలా అలా పెరిగి పెరిగి ఓ స్వ‌చ్ఛంద సంస్థను ఏర్పాటు చేసేలా చేసింది. ‘దార్ది ను ర‌హ‌త్ ఫండ్’ పేరిట నాగిందాస్ ఓ సేవా సంస్థ‌ను నెల‌కొల్పాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఎన్నో ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు దాని ద్వారా వైద్య స‌హాయం అందిస్తూ వ‌స్తున్నాడు. అయిన‌ప్ప‌టికీ నాగిందాస్ ఇప్ప‌టికీ నిరుద్యోగిగానే ఉండ‌డం విశేషం. ఇప్పుడు ఆ సంస్థ ఏటా రూ.1 కోటి వ‌ర‌కు విరాళాల‌ను సేక‌రించ‌గలుగుతోంది. నెల‌కు దాదాపు రూ.8 ల‌క్ష‌ల వ‌ర‌కు పేద‌ల‌కు వైద్య స‌హాయం అందించ‌గ‌లుగుతోంది. ఇప్పుడు నాగిందాస్‌కు దాదాపు 86 ఏళ్లు. గ‌త 50 ఏళ్లుగా ఆయన ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవ‌లం స‌మాజ సేవ ద్వారానే కాలం గ‌డుపుతూ వ‌చ్చారు. తాను చ‌నిపోయే వ‌ర‌కు దీన్ని ఆప‌న‌ని, త‌న అనంత‌రం కూడా ఆ సంస్థ వాలంటీర్లు, త‌మ కుటుంబ స‌భ్యులు ఈ సేవ‌ను కొన‌సాగిస్తార‌ని ఆయ‌న చెబుతున్నాడు. ఆప‌న్న హ‌స్తం కోసం వేచి చూస్తున్న పేద‌లకు సేవ చేస్తున్న నాగిందాస్ కృషిని నిజంగా మ‌నం అభినందించాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top