ఆ గ్రామంలో ఆడ‌పిల్ల పుడితే 6 నెల‌లు క‌టింగ్‌, షేవింగ్ ఫ్రీ..!

మ‌హిళ గ‌ర్భంతో ఉందంటే ఆమె అత్తింటి వారు ఆడ‌పిల్ల వ‌ద్ద‌ని, మ‌గ‌పిల్ల‌వాడే కావాల‌ని కోరుకునే దురాచారం మ‌న దేశంలో త‌ర త‌రాలుగా వ‌స్తోంది. ఓ వైపు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తున్నా మ‌రో వైపు మాత్రం ఇలాంటి దురాచారాలు ఆగ‌డం లేదు. దీని వల్ల ఎంతో మంది ఆడ‌పిల్ల‌లు ఈ భూ ప్ర‌పంచంపై అడుగు పెట్ట‌క‌ముందే ఆదిలోనే మృత్యువుకు బ‌ల‌వుతున్నారు. అయితే ఇలాంటి భ్రూణ హ‌త్య‌లు, లింగ నిర్దార‌ణ ప‌రీక్ష‌ల్లో మ‌హారాష్ట్ర‌లోని బీద్ జిల్లా ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. దీంతో ఆ జిల్లా ఓ పెద్ద అప‌వాదునే మూట‌గ‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో అక్క‌డ నివ‌సించే ప్ర‌జ‌ల్లో మార్పు తేవ‌డం కోసం ఓ బార్బ‌ర్ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. ఎవ‌రికైనా ఆడ పిల్ల పుడితే ఆ కుటుంబంలోని మ‌గ‌వారికి ఉచితంగా క‌టింగ్‌, షేవింగ్ చేస్తాన‌ని అత‌ను ప్ర‌క‌టించాడు.

ashok-pawar-hair-cut

అత‌ని పేరు అశోక్ ప‌వార్‌. మ‌హారాష్ట్ర‌లోని బీద్ జిల్లా కుంభెఫ‌ల్ గ్రామ వాసి. అయితే బీద్ జిల్లాలో ఇటీవ‌లి కాలంలో లింగ నిర్దార‌ణ ప‌రీక్ష‌లు, భ్రూణ హ‌త్య‌లు ఎక్కువ‌య్యాయి. ఆడ‌పిల్ల పుడుతుంద‌ని తెలిస్తే చాలు దాంతో ఆ శిశువును భూమిపై ప‌డ‌కముందే అంత‌మొందిస్తున్నారు. దీంతో భ్రూణ హ‌త్య‌ల్లో ఆ జిల్లా తీవ్ర‌మైన అప‌వాదును మూట‌గట్టుకుంది. అయితే ప్ర‌జ‌ల్లో అలాంటి దురాచారాన్ని పోగొట్టి వారిని చైత‌న్య‌వంతం చేయాల‌నే ఉద్దేశంతో అశోక్ ప‌వార్ త‌న సెలూన్‌లో వినూత్న కార్య‌క్ర‌మానికి పూనుకున్నాడు. జ‌న‌వ‌రి 1 త‌రువాత త‌న స్వ‌గ్రామంలో ఎవ‌రికైనా ఆడ‌పిల్ల పుడితే ఆ ఇంట్లో ఉండే మ‌గ‌వారికి 6 నెల‌ల పాటు ఉచితంగా క‌టింగ్, షేవింగ్ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అంతేకాదు, ఆడ‌పిల్ల పుడితే వారికి ఉచితంగా పుట్టు వెంట్రుక‌లు తీస్తాన‌ని కూడా చెప్పాడు. ఆ మేర‌కు త‌న షాపు ఎదుట ఓ బోర్డు కూడా రాయించాడు.

అయితే మొద‌టి 15 మందికి మాత్ర‌మే అత‌ను అలా ఉచితంగా సేవ అందించ‌నున్నాడు. అయినా ఆ త‌రువాత వారికి కూడా స‌గం రేటునే తీసుకోనున్నాడు. రూ.50కే క‌టింగ్‌, షేవింగ్ చేస్తాన‌ని చెబుతున్నాడు. దీంతో అశోక్ ప‌వార్ గురించిన వార్త ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడ‌త‌ను ఆ గ్రామంలో హీరో అయ్యాడు. ఈ విష‌యంపై అత‌న్ని అడిగితే… చాలా మంది ఆడ‌పిల్ల పుడితే ఖ‌ర్చు పెరుగుతుంద‌ని భావిస్తార‌ని, ఆ ధోర‌ణి వారిలో పోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాన‌ని చెబుతున్నాడు. నిజంగా… అశోక్ ప‌వార్ చేస్తున్న ప‌నికి మ‌నం అత‌న్ని అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top